
అధికారం దక్కాక బీద అరుపులా?: రఘువీరా
ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారం చేపట్టక ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా బీద అరుపులు అరుస్తున్నారని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఆదివారం విశాఖపట్నంలో ధ్వజమెత్తారు.
విశాఖపట్నం: ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారం చేపట్టక ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా బీద అరుపులు అరుస్తున్నారని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఆదివారం విశాఖపట్నంలో ధ్వజమెత్తారు. రైతుల రుణాలు, డ్వాక్రా మహిళల రుణాలను పూర్తిగా మాఫీ చేస్తామని అధికారం చేజిక్కించుకున్న బాబు మాట మార్చుతున్నారని విమర్శించారు. సచివాలయంలో బల్లలు లేవు.. కుర్చీలు లేవనే కుంటి సాకులతో ఆర్థిక పరిస్థితి బాగోలేదని చెప్పడం ఎవరిని మోసగించడానికి? అని మండిపడ్డారు.
రాష్ట్రంలో వేలాది ప్రభుత్వ స్కూళ్లలో వసతులు లేవని, అంతమాత్రాన ఉపాధ్యాయులు పాఠశాలలకు వెళ్లకుంటే చంద్రబాబు ఊరుకుంటారా? అని నిలదీశారు. సచివాలయంలో సీఎం కార్యాలయానికి రూ.కోట్లు ఎందుకు ఖర్చు చేశారో చెప్పాలన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు కొత్త రాజధాని ఏర్పాటుపై కేంద్రం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ నివేదిక సిద్ధం కాకముందే పురపాలక మంత్రి నారాయణ నేతృత్వంలో మరో కమిటీని ఏర్పాటు చేయటంలో ఆంతర్యమేంటని ప్రశ్నించారు.