రాజధాని గ్రామాల్లో 144 సెక్షన్ ఎందుకు?
విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంలో భూ సమీకరణ సమయంలో రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి మండిపడ్డారు. రాజధాని ప్రాంత రైతుల కోసం పరిరక్షణ వేదిక ఏర్పాటు చేశామన్నారు.
విజయవాడలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అమరావతి సమీప గ్రామాల ప‍్రజలకు ప్రభుత్వం ఇచ్చిన ఉచిత విద్య, వైద్యం హామీలు అమలుకావడం లేదన్నారు. లంక భూములు, అసైన్డ్ భూములను టీడీపీ నేతలు పెద్ద మొత్తంలో కొనుగోలు చేశారని చెప్పారు. అసైన్డ్ భూములు ఇచ్చిన రైతులకు వేరుగా ప్లాట్లు కేటాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని నిర్మాణ భవనాల కోసం ప్రభుత్వం ముందుగా నిర్ణయించిన 33వేల ఎకరాలకు అదనంగా మరో 10 వేల ఎకరాలు సేకరించిందన్నారు.
రాజధాని భూముల వివరాలు అడిగితే చెప్పే దిక్కే లేదని..అత్త సొమ్ము అల్లుడి దానంలా బాబు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కంపెనీలకు కేటాయించే భూములపై లెక్కా పత్రం లేదన్నారు. యోగా, చూర్ణాలు, కాలేజీలు ఏర్పాటు చేస్తామంటూ వచ్చే వారికి వందల ఎకరాల్లో భూములు కేటాయిస్తున్నారన్నారు. రాజధాని గ్రామాల్లో ఇప్పటికీ 144 సెక్షన్ అమలవుతుందని..ఎందుకు ఈ ఆంక్షలని ఆయన ప్రశ్నించారు. బాబు ఇంటి వెనక నుంచి వేల లారీల్లో ఇసుక తరలిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రాజధాని నిర్మాణంపై బుధవారం చంద్రబాబుకు సమగ్రంగా లేఖ రాస్తానని రఘువీరా చెప్పారు.