మాట్లాడుతున్న సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర
విజయనగరం, పార్వతీపురం: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎన్ని దొంగ దీక్షలు చేసినా ప్రజలు నమ్మరని సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర అన్నారు. సోమవారం పార్వతీపురం వచ్చిన ఆయన స్థానిక పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ, ప్రత్యేక హోదా ఏమైనా సంజీవనా.... ప్రత్యేక హోదా ఇచ్చిన 11 రాష్ట్రాల్లో ఏమి అభివృద్ధి జరిగిందని ప్రశ్నించిన చంద్రబాబునాయుడు ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ఢిల్లీలో దీక్ష చేశారని ప్రశ్నించారు.
నాడు ప్రత్యేక హోదా కావాలంటూ ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్థులు పోరాటం చేస్తుంటే పోలీసులతో బెదిరించిన చంద్రబాబు నేడు ఢిల్లీలో చేస్తున్న దొంగ దీక్షకు ఉద్యోగులు, విద్యార్థులు రావాలని బ్రతిమలాడుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. నాడు రాహుల్‌గాంధీ మన రాష్ట్రానికి వస్తే చచ్చామో, బతికామో చూడడానికి వస్తున్నాడా? అని ప్రశ్నించిన చంద్రబాబు నేడు ఆయనతో స్నేహం చేసి ప్రధాని మోదీపై ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు. మోదీ లాంటి సమర్థవంతమైన ప్రధానమంత్రి మరొకరు ఉండరని శాసనసభ సాక్షిగా చెప్పిన చంద్రబాబు... నేడు మోదీ గోబ్యాక్ అంటూ దీక్షలు చేయడం చంద్రబాబు దిగజారుడు రాజకీయానికి నిదర్శనమని చెప్పారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తిగా తరచు చెప్పుకొనే చంద్రబాబు ప్రతిపక్ష నేత ప్రకటించిన నవరత్నాల్లాంటి పథకాలను కాపీ కొట్టడం సిగ్గుచేటన్నారు.
ప్రజలే తరిమికొడతారు...
రైతు, డ్వాక్రా మహిళల రుణమాఫీ చేయడంతో పాటు నిరుద్యోగ భృతి ఇవ్వడంలో విఫలమైన ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రజలే తగిన రీతిలో బుద్ధి చెబుతారని ఎమ్మెల్యే రాజన్నదొర జోష్యం చెప్పారు. పోలవరం ప్రాజెక్ట్ అంచనాలను భారీగా పెంచి కమీషన్లు తింటూ అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తే రాజన్న రాజ్యం వస్తుందన్నారు. చంద్రబాబు ఎన్ని ఎత్తులు వేసినా ప్రజలు నమ్మరని.. రాబోవు ఎన్నికల్లో జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు. వైఎస్సార్‌సీపీ పార్వతీపురం నియోజకవర్గ సమన్వయకర్త అలజంగి జోగారావు మాట్లాడుతూ, చంద్రబాబునాయుడు ఐదు కోట్ల ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో ఏనాడో తాకట్టుపెట్టారన్నారు.
416 అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఏ ఒక్క హామీని పూర్తిగా నెరవేర్చలేదని మండిపడ్డారు. రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శి గర్భాపు ఉదయభాను మాట్లాడుతూ, 2014 నుంచి ప్రత్యేక హోదాపై పోరాటం చేస్తున్నది ఒక్క జగన్‌మోహన్‌రెడ్డేనన్నారు. పార్వతీపురం పట్టణ అధ్యక్షుడు కొండపల్లి బాలకృష్ణ మాట్లాడుతూ, ఒకపక్క డబ్బులు లేవని చెబుతూ మరోపక్క వృథా ఖర్చులు పెడుతున్న టీడీపీ నా యకులకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు రాష్ట్ర ఎస్సీసెల్ కార్యదర్శి ఎస్. శ్రీనివాసరావు, రణభేరి బంగారునాయురడు, పొట్నూరు జయంతి, చందక సూర్యప్రకాష్, తోట శివకుమార్, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment