త్రీఎస్సార్!
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : సుబ్బరామిరెడ్డిని ముచ్చటగా మూడోసారి రాజ్యసభ సీటు వరించింది. రెండు పర్యాయాలు రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన ఆయనకు మరోసారి అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించింది. నెల్లూరులో పుట్టిపెరిగి, హైదరాబాద్‌లో వ్యాపారాలు చే సే ఆయన విశాఖ కేంద్రంగా రాజకీయాలు చేస్తున్నారు. ఈ పర్యాయం రాజ్యసభ కాకుండా విశాఖ లోక్‌సభ స్థానానికి పోటీ చేస్తానని రెండేళ్ల ముందు నుంచే హడావుడి చేసిన ఆయన చివరకు పార్టీ అధిష్టానం నిర్ణయించిన విధంగా రాజ్యసభ బరిలో నిలవాల్సి వచ్చింది.
గతంలో 1996, 98 సంవత్సరాల్లో రెండు పర్యాయాలు విశాఖ లోక్‌సభ నుంచి ఎన్నికైన ఆయన 1999లో ఓటమి చెందారు. ఆ తర్వాత 2002లో, 2008లో రాజ్యసభకు ఎన్నికయ్యారు. రెండేళ్ల క్రితం నెల్లూరు లోక్‌సభకు జరిగిన ఉప ఎన్నికల్లో పోటీచేసి ఓటమి చెందారు. అప్పటి నుంచి విశాఖ లోక్‌సభపైనే దృష్టి సారించి ప్రస్తుత ఎంపీ, కేంద్ర మంత్రి పురందేశ్వరికి పోటీగా గ్రూపు రాజకీయాలు చేస్తూ వచ్చారు. విశాఖలో సేవా కార్యక్రమాలను కూడా బాగా విస్తరించారు. ఇటీవలే కేజీహెచ్‌లో రోగుల సహాయకుల సౌకర్యార్థం సత్రాన్ని నిర్మించారు.