
పొట్టేళ్ల మార్కెట్ రూ.2 కోట్లు
తగరపువలస: విజయ దశమి, బక్రీద్‌లను పురస్కరించుకుని ఆదివారం స్థానిక ప్రైవేట్ మార్కెట్‌లో జరిగిన సంతలో మేకలు, గొర్రెల వ్యాపారం రూ.2 కోట్ల వరకు జరిగింది. నగరం నుంచి మేక లు, గొర్రెలు కొనుగోలు చేయడానికి వచ్చిన ఉద్యోగులు, మారు బేరగాళ్లతో సంత కిటకిటలాడింది. పారిశ్రామికవాడకు చెందిన జీవీఎంసీ, స్టీల్‌ప్లాంట్, షిప్‌యార్డు, ఇంధన కంపెనీల ఉద్యోగు లు ఈ సంతకు ప్రభుత్వ వాహనాలతోనే రావడం ఆనవాయితీ. దీనికి ముందు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోని కందివలసగెడ్డ, మానాపురం, అచ్యుతాపురం సంతలో ఎక్కువగా విక్రయాలు జరుగుతాయి. ఆదివారం ఉద్యోగులకు సెలవు కావడంతోపాటు నగరానికి దగ్గరగా ఉండటంతో తగరపువలస సంతకే ప్రాధాన్యత ఇచ్చారు.
కొమ్ములతోపాటు ధరలూ అధికమే..
ప్రతిష్టకు చిహ్నంగా భావించిన కొనుగోలుదారు లు దసరా ఉత్సవాలకు ప్రత్యేకంగా భారీగా కొ మ్ములు తిరిగిన మేకలు, గొర్రెలకే ప్రాధాన్యత ఇస్తారు. కొమ్ములు ఎంతగా తిరిగితే, వీటి ధర కూడా అంతగా ఉంటుం ది. విజయనగరం జిల్లా డెంకాడ మండలానికి చెందిన బంగార్రాజుపే ట, కొండ్రాజుపేటకు చెందిన రైతులు ఏడాది పొడుగునా పొట్టేళ్ల పెంపకంపై దృష్టిపెడతారు. వివిధ సంతల్లో మేలుజాతి గొర్రెలను ఎంపిక చేసుకొని కొనుగోలు చేసి పెంచుతారు. మామూ లు రోజుల్లో ఇరవై కిలోల గొర్రె రూ.10వేల లోపే ఉండగా ఈ సంతలో రూ.12వేలు దాటడం విశేషం. ఆదివారం సంతతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో 1500 వరకు మేకలు, గొర్రెల విక్రయాలు జరిగినట్టు వ్యాపారులు చెబుతున్నారు.
కొండెక్కిన నాటు కోడి ధరలు
కోళ్ల ధరలు ఆకాశాన్ని తాకాయి. వేములవలస మార్కెట్‌లో ఆదివారం నాటు కోళ్లకు విపరీతమైన గిరాకీ ఏర్పడింది. ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాదే ఇక్కడ కోళ్ల మార్కెట్ ప్రారంభమయింది. విశాఖపట్నం, పెందుర్తి పరిసర ప్రాంతాల నుంచి వ్యాపారులు ఎగబడడంతో ధరలు అమాంతంగా పెరిగిపోయాయి. కిలో బరువు ఉండే నాటు కోడి పుంజు రూ. 400లు వరకూ పలికింది. పందెం కోళ్ల ధర రూ. 3,000 నుంచి రూ. 4.000 వరకు పలికింది.