- ఎర్రచందనం స్మగ్లర్లతో నేలకూలుతున్న వృక్షాలు
- పోలీసుల దారి మళ్లించేందుకు అడవికి నిప్పు
- శేషాచలంలో దెబ్బతింటున్న జీవ వైవిధ్యం
సాక్షి, తిరుమల : ఎర్రచందనం స్మగ్లర్ల ఆగడాలతో తిరుమల శేషాచల అడవిలోని అరుదైన వృక్ష, జంతు, జీవజాలం కనుమరుగయ్యే పరిస్థితి కనిపిస్తోంది. నిత్యం వందలాది మంది ఎర్రచందనం కూలీలు అడవుల్లో చొరబడుతూ చెట్లను ఇష్టానుసారంగా నరికేస్తూ జీవ వైవిధ్యాన్ని నాశనం చేస్తున్నారు. శేషాచల ఏడుకొండలు తూర్పు కనుమల్లో భాగమై చిత్తూరు, వైఎస్సార్ జిల్లాల్లో 4756 చ.కి.మీ విస్తీర్ణంలో వ్యాపించాయి.
ఈ అడవులు తిరుమల కొండల్లో మొదలై కర్నూలు జిల్లాలోని కుందేరు నది వరకు ఉన్నాయి. జీవ వైవిధ్యం ఎక్కువగా ఉండటంతో జాతీయ స్థాయిలో 1989లో శేషాచలాన్ని శ్రీవేంకటేశ్వర అభయారణ్యంగా ప్రకటించారు. అనంతరం 2010 సెప్టెంబర్ 20వ తేదీన అంతర్జాతీయ స్థాయిలో ‘శేషాచల బయోస్పియర్ రిజర్వు’గా భారత పర్యావరణ మరియు అటవీ శాఖ ప్రకటించింది. అప్పటి నుంచి ఇక్కడి అరుదైన భౌగోళిక, ఆధ్యాత్మిక, ప్రకృతి సంపదను పరిరక్షిస్తోంది. తిరుపతిలో బయోస్పియర్ ల్యాబ్ స్థాపించి జీవ వైవిధ్య పరిశోధనలకు శ్రీకారం చుట్టింది.