- వైదొలగని రెబల్స్
- భీమిలి..అరకులో సైకిల్‌కు షాకు
- ఓడించి తీరుతామంటున్న తిరుగుబాటుదారులు
- గంటా ఆశలకు అనిత ఎసరు
సాక్షి, విశాఖపట్నం : జిల్లా టీడీపీకి తిరుగుబాట్ల బెడద తప్పలేదు. భీమిలి, అరకు స్థానాల్లో గంటా, సివేరి సోమకు ఎదురుదెబ్బల ఎదురింపులు నిద్రపట్టనీయడం లేదు. ముఖ్యనేతలు ఎన్ని ప్రలోభాలుపెట్టినా, బుజ్జగింపులు చేసినా రెబల్ అభ్యర్థులు దారికిరాలేదు. మాదారి ఎదురుదాడేనంటూ బరిలో నిలబడి పార్టీకి సవాల్ విసిరారు. ఇకనుంచి తడాఖా చూపడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు.
జిల్లాలో టీడీపీ నిలబెట్టిన అభ్యర్థులకు వ్యతిరేకంగా భీమిలి, అరకు,పాడేరు,విశాఖ ఉత్తరం,యలమంచిలి నియోజకవర్గాల్లో రెబల్ అభ్యర్థులు నామినేషన్లు వేశారు. బుధవారం రెబల్స్ తప్పుకునేలా టీడీపీ ముఖ్యనేతలు మంతనాలు జరిపారు. భీమిలి, అరకు స్థానాల్లో మాత్రం తిరుగుబాటుదారులు తమ నామినేషన్లు ఉపసంహరించుకోకుండా పార్టీకి షాక్ ఇచ్చారు. ఇప్పుడు భీమిలి నియోజకవర్గంలో టీడీపీ నిలబెట్టిన గంటాశ్రీనివాసరావుకు వ్యతిరేకంగా అనిత సకురు, అరకులో సివేరి సోమకు వ్యతిరేకంగా కుంభా రవిబాబు బరిలో మిగిలారు.
రెబల్స్ వలన తమకు రాలవసిన ఓట్లు చీలిపోతాయనే బెంగతో వీరు బిక్కుబిక్కుమంటున్నారు. గంటాను ఓడిస్తానని అనిత శపథం పూనారు. రాజకీయాలను వ్యాపారంగా చేసి ఎన్నికలొచ్చిన ప్రతిసారీ నియోజకవర్గం మార్చుతూ రాజకీయ విలువలు దిగజార్చుతోన్న గంటాకు వ్యతిరేకంగా తాను బరిలో నిలబడ్డానని ఆమె చెబుతున్నారు. ఇన్ని వ్యుహాలుచేసినా చివరకు తిరుగుబాటు అభ్యర్థి బెడదేంటంటూ గంటా కలవరపడుతున్నట్లు తెలిసింది.
అయ్యో..సోమ
అరకు సిట్టింగ్ ఎమ్మెల్యే సోమకు చంద్రబాబు మొదట్లో టిక్కెట్ నిరాకరించారు. తాజాగా పార్టీలో చేరిన కుంబారవిబాబుకు బీఫారం ఇచ్చారు. కాని ఆయన సామాజికవర్గం ఓట్లు నియోజకవర్గంలో లేవనే సాకుతో చివరి నిమిషంలో సోమకు సీటిచ్చారు. ఇప్పుడు రవిబాబు రెబల్‌గా మిగ లడంతో సోమ గిలగిలలాడుతున్నారు. సోమకు కేటాయించిన టీకప్పు గుర్తుతో తనకు వ్యతిరేకంగా పార్టీ అభ్యర్థి ప్రచారం చేస్తుండడంతో ఓడిపోతానని కంగారుపడుతున్నారు. చివరకు రవిబాబును పార్టీసీనియర్ నేతల ద్వారా బుజ్జగించినా దారికిరాకపోవడంతో ఏంచేయాలో తెలీక దిగులుచెందుతున్నారు.