మళ్లీ హుళక్కే
Published Thu, Feb 13 2014 12:55 AM | Last Updated on Sat, Sep 2 2017 3:38 AM
సాక్షి, కాకినాడ:అంతా అనుకున్నట్టే జరిగింది. జిల్లాకు మళ్లీ రిక్తహస్తమే మిగిలింది. మన వాళ్లు కోతల రాయుళ్లే తప్ప కూతలు పెట్టించగల మొనగాళ్లు కాదన్న విషయం స్పష్టమైపోయింది. బుధవారం పార్లమెంటులో రైల్వేమంత్రి మల్లికార్జునఖర్గే ప్రవేశపెట్టిన రైల్వేబడ్జెట్‌లో జిల్లాకు మొండిచేయే మిగిలింది. మన జిల్లా మీదుగా కొత్తగా వెళ్లే సికింద్రాబాద్-విశాఖపట్నం ఏసీ ఎక్స్‌ప్రెస్ మినహా ఒరిగిందేమీ లేదు. ఇది కూడా వారానికి ఒక్కరోజే వస్తుంది. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తామంటూ మంత్రిగారు ఆర్భాటంగా ప్రకటించారే తప్ప ఏ ప్రాజెక్టుకు ఎంత నిధులు కేటాయిస్తున్నామన్న విషయాన్ని మాత్రం చెప్పలేదు.
మెయిన్‌లైన్ ఊసేలేదు
కాకినాడ మెయిన్‌లైన్ మళ్లీ కలగానే మిగిలిపోయింది. కాకినాడ-పిఠాపురంల మధ్య రూ.140 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించ తలపెట్టిన 21 కిలోమీటర్ల బ్రాడ్‌గ్రేజ్ లైన్‌కు మోక్షం లభించలేదు. గతేడాది కోటి రూపాయలు కేటాయించగా, ఈ ఏడాది కేటాయింపులేమీ ప్రకటించలేదు.
పట్టాలెక్కని కోనసీమ రైలు
ఉభయగోదావరి జిల్లాల చిరకాల స్వప్నమైన నరసాపురం-కోటిపల్లి లైన్‌కు మాత్రం ఈసారి ఒక్క రూపాయి కూడా విదల్చలేదు. కొవ్వూరు-భద్రాచలం రైల్వేలైన్ సర్వేకు 2012 బడ్జెట్‌లో ఆమోదం తెలిపినా నేటి బడ్జెట్‌లో నిధుల జాడ లేదు. కాకినాడ రాజమండ్రిల మీదుగా హైదరాబాద్, తిరుపతిలకు ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్‌లను ఏర్పాటు చేయాలన్న ఆశ ఫలించ లేదు. కాకినాడ నుంచి ఢిల్లీకి, కోల్‌కతాకు కొత్త రైళ్లు ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌ను పట్టించుకోలేదు. భీమవరం మీదుగా కాకినాడ- వారణాశికి కొత్త రైలు వేయాలన్న డిమాండ్‌ను పట్టించుకోలేదు. విజయవాడ-అమరావతి మీదుగా ప్రయాణించే గోవా ఎక్స్‌ప్రెస్ కాకినాడలో ప్రారంభమై భీమవరం మీదుగా వెళ్లేలా ఏర్పాటు చేయాలన్న ఆశ ఫలించలేదు. మొత్తమ్మీద ఖర్గే బడ్జెట్ జిల్లావాసులకు చేదు అనుభవాన్నే మిగిల్చింది. ఈ బడ్జెట్‌పై స్పందించేందుకు జిల్లాకు చెందిన ఎంపీలు ఏమాత్రం ఆసక్తి చూపకపోవడం ఈ ప్రాంత ప్రజల ఆశలపై వారి కున్న చిత్తశుద్ధిని తేటతెల్లం చేస్తోంది.
Advertisement
Advertisement