హైదరాబాద్: కాంట్రాక్టు అధ్యాపకులను క్రమబద్ధీకరించేలా మంత్రివర్గ ఉపసంఘం సానుకూల నిర్ణయం తీసుకోవాలని ప్రోగ్రెసివ్ డెమొక్రటిక్ ఫ్రంట్ ఎమ్మెల్సీలు ప్రభుత్వానికి విన్నవించారు. ఈమేరకు మంత్రివర్గం ఉపసంఘం సభ్యులు యనమల రామకృష్ణుడు, పల్లె రఘునాధరెడ్డిలను ఎమ్మెల్సీ శ్రీనివాసులురెడ్డి కలిశారు. జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కాలేజీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్లు గత 15 ఏళ్లుగా ప్రభుత్వ కాలేజీల అభివృద్ధికి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.
ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ కాంట్రాక్టు లెక్చరర్లను క్రమబద్ధీకరిస్తామని హామీ ఇచ్చిందన్నారు. ఎయిడెడ్, సంస్కృత పాఠశాలల సిబ్బంది వేతనాల కోసం బడ్జెట్‌ను విడుదల చేసినందున మూడు నెలల వేతనం ఆంక్షలు లేకుండా చెల్లించాలని కోరారు. ఈ విషయాలపై మంత్రులు కూడా సానుకూలంగా స్పందించారని శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. కాంట్రాక్టు లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు కె.శ్రీనివాస్ యాదవ్, ప్రధాన కార్యదర్శి గాంధీ, మాణిక్యం తదితరులు మంత్రులను కలిశారు