అవకాశవాదం, రాజకీయ స్వార్థంతో పార్టీ మారిన శాసన సభ్యులకు క్యాడర్ షాకిస్తోంది. ఇప్పటి వరకూ తమతో ఉన్నవారు రాక, కొత్తగా చేరిన పార్టీలో నేతలు సహకరించక
- పార్టీ మారనున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు కార్యకర్తలు దూరం
- వెంట రాబోమని స్పష్టీకరణ
- టీడీపీ నుంచీ వ్యతిరేకత
- అయోమయంలో ఆ ఐదుగురు...
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: అవకాశవాదం, రాజకీయ స్వార్థంతో పార్టీ మారిన శాసన సభ్యులకు క్యాడర్ షాకిస్తోంది. ఇప్పటి వరకూ తమతో ఉన్నవారు రాక, కొత్తగా చేరిన పార్టీలో నేతలు సహకరించక ఈ శాసన సభ్యులు ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. తొందరపడి వీరిని పార్టీలోకి ఆహ్వానించామేమోనన్న సందిగ్ధం ఆ పార్టీ నేతలను వెంటాడుతోంది. కాంగ్రె స్ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వెళ్తున్న జిల్లాకు చెందిన కాంగ్రెస్ శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు, పంచకర్ల రమేష్‌బాబు, యూవీ రమణమూర్తి(కన్నబాబు), చింతలపూడి వెంకట్రామయ్య, ముత్తంశెట్టి శ్రీనివాస్‌లు ఇటీవల చంద్రబాబు నాయుడిని కలసి ఆ పార్టీలో చేరుతున్నట్టు చెప్పారు.
ఆ పార్టీ సీనియర్ నేత ఎం.వి.వి.ఎస్.మూర్తి వెంటనే వీరిని స్వాగతిస్తూ నగరంలో తేనీటి విందు కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ పరిణామాలతో కంగుతిన్న కాంగ్రెస్ క్యాడర్ ఒక్కసారిగా అడ్డం తిరిగింది. రోజూ ఆయా నియోజక వర్గాల్లో ఎక్కడో ఒకచోట సమావేశాలను నిర్వహిస్తున్న స్థానిక నేతలు, కార్యకర్తలు పార్టీని విడిచి వెళ్తున్న వీరు స్వార్థపరులని, వీరి వెంట నడిచే ది లేదని స్పష్టం చేస్తున్నారు. ఇంతకాలం అధికారంలో ఉండి తమపై కేసులు పెట్టించి వేధించిన వీరికి సహకరించేదే లేదంటూ తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు ఒకపక్క అధిష్టానాన్ని హెచ్చరిస్తున్నారు.
సమైక్య హీరోగా ప్రచారం చేసుకొని మంత్రి పదవి సంపాదించిన గంటా అనకాపల్లిలో సమైక్యవాదులపైనే కేసులు పెట్టించి జైలుకు పంపిన సంగతి తెలిసిందే. అక్కడ ఎన్టీఆర్ విగ్రహావిష్కరణను మంత్రి హోదాలో ఆయన ఇప్పటి వరకూ అడ్డుకుంటూ వచ్చారు. యలమంచిలిలో కన్నబాబు డెయిరీ చైర్మన్ తులసీరావు కుమార్తెతో పాటు ఆయన వర్గీయులపై కేసులు పెట్టించి అరెస్టు చేయించారు. పెందుర్తిలో రమేష్‌బాబు హిందుజాకు ఏజెంట్‌గా మారి తెలుగుదేశం నేత బండారుతో పాటు క్యాడర్‌ను పోలీసుల సాయంతో పరుగులు పెట్టించారు.
ఇక ఇంతకాలం వీరి వెంట నడిచిన కాంగ్రెస్ కార్యకర్తలు కూడా మీ అంత తేలిగ్గా మేం పార్టీ మారలేమని తెగేసి చెబుతున్నారు. శని, ఆదివారాల్లో యలమంచిలి నియోజక వర్గ కాంగ్రెస్ కార్యకర్తలు సమావేశాలు ఏర్పాటు చేసుకుని కన్నబాబుకు వ్యతిరేకంగా పనిచేయాలని తీర్మానించారు. ఆదివారం గాజువాకలో చింతలపూడి సమక్షంలోనే కాంగ్రెస్ కార్యకర్తలు ఆయనకు ఝలక్ ఇచ్చారు. మీతో రాలేమని, కాంగ్రెస్‌లోనే ఉంటామని స్పష్టం చేశారు. అనకాపల్లి, పెందుర్తి, భీమిలి నియోజక వర్గాల్లోనూ ఇదే పరిస్థితి. గంటాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న వారిని తిరిగి విమర్శించేందుకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసుకోవాల్సిన పరిస్థితి అనకాపల్లిలో ఉంది.
కాంగ్రెస్ నుంచి వచ్చిన ఈ శాసన సభ్యుల వెంట క్యాడర్ రాకపోతే తమకు ఇక ఉపయోగమేమిటని తెలుగుదేశం పెద్దలు ప్రశ్నిస్తున్నారు. ఈ శాసనసభ్యులకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న వారి వివరాలను తెలుగుదేశం అధిష్టానం సేకరిస్తోంది. ఇటు కాంగ్రెస్‌లో అటు తెలుగుదేశంలో వ్యతిరేకత మూటగట్టుకుంటున్న వీరికి టికెట్‌లిచ్చి ఉపయోగమేమిటని మొదటి నుంచి తెలుగుదేశంలో ఉన్న నేతలు అధిష్టానాన్ని నిలదీస్తున్నారు.