శాతవాహన యూనివర్సిటీ, న్యూస్‌లైన్ : పరీక్షల నిర్వహణలో పదేపదే తప్పులు చేయడం, వాటిని కప్పిపుచ్చుకునేందుకు యత్నించడంలో శాతవాహన యూనివర్సిటీ పరీక్షల విభాగం తనకు తానేసాటి. పరీక్షల్లో ప్రశ్నపత్రాలు మారడం, ఫలితాలు వెల్లడించడంలో జాప్యం, తప్పులతడకగా మెమోలు జారీచేయడం, ఒకే సమయంలో రెండు కోర్సుల పరీక్షలు నిర్వహించడం.. ఇలా అనేక తప్పిదాలతో అప్రతిష్టను మూటగట్టుకున్న పరీక్షల విభాగం ఇప్పటికే అదే ఒరవడిని కొనసాగిస్తోంది. తాజాగా గత నెల 20న జరిగిన ఎమ్మెస్సీ కెమిస్ట్రీ ఫస్ట్ సెమిస్టర్ పరీక్షలో విద్యార్థులకు ఒక ప్రశ్నపత్రానికి బదులు మరో ప్రశ్నపత్రం ఇచ్చింది వారి జీవితానికే పరీక్ష పెట్టింది. ఈ విషయాన్ని పలు పీజీ కళాశాలలు పరీక్షల నియంత్రణ అధికారికి విన్నవించగా దానిని తొక్కిపెట్టే ప్రయత్నం చేసి భంగపడింది.
ఈ విషయం ఆ నోటా ఈ నోటా నాని పది రోజుల తర్వాత బయటపడింది. కరీంనగర్‌లోని ఎస్‌ఆర్‌ఎం, ఎస్సారార్ కాలేజీతోపాటు పలు కళాశాలల్లో ఎమ్మెస్సీ కెమిస్ట్రీ చదువుతున్న విద్యార్థులకు గతనెల 20న వివేకానంద, వాణీనికేతన్ డిగ్రీ కళాశాల కేంద్రాల్లో ఫస్ట్ సెమిస్టర్ పరీక్షను నిర్వహించారు. 2012-2013 విద్యాసంవత్సరం నుంచి కెమిస్ట్రీ సెలబస్‌లో మార్పులు చేయడంతో విద్యార్థులకు కొత్త సిలబస్ ప్రశ్నపత్రాలను ఇవ్వాల్సి ఉండగా, ఈ రెండు పరీక్ష కేంద్రాల్లో పాత సిలబస్ పరీక్ష పత్రాలు ఇచ్చారు. విద్యార్థులు పరీక్ష పత్రం ఇది కాదని చెప్పినా నిర్వాహకులు వినిపించుకోలేదు. పరీక్ష కేంద్రానికి ఒకే రకమైన పేపర్లు వచ్చాయని, వాటినే రాయాలని తేల్చిచెప్పడంతో విద్యార్థులు తమకు తోచింది రాసేసి బయటకొచ్చారు. నగరంలోని కొన్ని పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు రాసిన వారికి న్యూ సిలబస్ ప్రశ్నపత్రాలు ఇచ్చినట్లు సమాచారం రావడంతో ప్రశ్నపత్రాలను పోల్చిచూసుకుని విద్యార్థులు కంగుతిన్నారు.
ఒక పేపర్‌కు బదులు మరో పేపర్ రాసిన తాము పరీక్షలో అనుకున్న స్థాయిలో రాణించలేమోనన్న భయాందోళనలో ఉన్నారు. ఇప్పటికైనా శాతవాహన వీసీ, ఎగ్జామినేషన్ బ్రాంచీలో దొర్లుతున్న తప్పుల విషయంలో చర్యలు తీసుకుని న్యాయం చేయాలని విద్యార్థులు కోరుతున్నారు. గతంలో సైతం ఇలాంటి పొరపాట్లు జరిగాయని, ప్రస్తుతం జరుగుతున్నాయని, భవిష్యత్‌లో తప్పులు జరగకుండా తీసుకునే చర్యలను బహిర్గతం చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
న్యాయం చేయండి
- సిహెచ్.రాజు, మాధురి, శ్రుతి, నౌష్, వేణు
వివిధ పీజీ కళాశాలల్లో ఎమ్మెస్సీ కెమిస్ట్రీ చదువుతున్న విద్యార్థులమైన మాకు న్యూసిలబస్ పేపర్‌కు బదులు, ఓల్డ్ సిలబస్ పేపర్ ఇచ్చారు. దీంతో పరీక్షలలో అనుకున్న స్థాయిలో పరీక్షలు రాయలేకపోయాం. వీసీ గారు స్పందించి మాకు న్యాయం చేయాలి.
పొరపాటును విన్నవించాం..
- వాణి నికేతన్ కళాశాల
తమ కళాశాల కేంద్రంలో పరీక్ష పత్రం మారిన విషయాన్ని వర్సిటీ ఎగ్జామినేషన్ కంట్రోలర్‌కు ఇప్పటికే విన్నవించాం. కళాశాలలో ఏ.ప్రశాంత్, జి.రాజు, చిరంజీవి, కే.స్రవంతి, ఎల్.ప్రభాకర్, కె.వాణీ ఒక పేపర్‌కు బదులు మరో పేపర్ రాసిన వారిలో ఉన్నారని తెలియజేశాం.
మా తప్పు కాదు
- టి.భరత్, ఎగ్జామినేషన్ కంట్రోలర్
పరీక్ష నిర్వహణ కోసం రెండు రకాల పరీక్ష పత్రాలను సంబంధిత కళాశాలలకు పంపాం. విద్యార్థులు వారికిచ్చిన ప్రశ్న పత్రాన్ని చూసుకుని రాయాలి కనీసం అది తెలియకుండా రాస్తే ఎలా? ఈ విషయంలో ఇప్పటికే వినతులను స్వీకరించాం. త్వరలో న్యాయం చేస్తాం.
పదే పదే తప్పులు
Published Fri, Jan 3 2014 2:59 AM | Last Updated on Sat, Sep 2 2017 2:13 AM
Advertisement
Advertisement