హైదరాబాద్ : రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి కృషి చేసిన నాయకుడు డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి అని మంత్రి దానం నాగేందర్ అన్నారు. ఎన్నో వినూత్న పథకాలతో బడుగు, బలహీన వర్గాలను ఆదుకున్న నాయకుడు వైఎస్ మాత్రమేనని అన్నారు. మహానేత వైఎస్ఆర్ నాలుగో వర్థంతి సందర్భంగా మంత్రులు దానం నాగేందర్, వట్టి వసంతకుమార్, ఎంపీ కేవీపీ రామచంద్రరావు తదితరులు సోమవారం హైదరాబాద్ పంజాగుట్టలోని వైఎస్‌ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు వెళుతూ సరిగ్గా నాలుగేళ్ల కిందట కానరాని లోకాలకు వెళ్లిపోయారని నాగేందర్ తెలిపారు. ఆయన లేని లోటు తీర్చలేనిదని... ఆ మహానేత అడుగుజాడల్లో తాము నడుస్తామని చెప్పారు. మరోవైపు గాంధీభవన్లోనూ వైఎస్ వర్థంతి కార్యక్రమం జరిగింది.