
విజయసాయి రెడ్డి, విష్ణుదేవసాయి
సాక్షి, న్యూఢిల్లీ : విశాఖ ఉక్కు కర్మాగారం(రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్)ను మళ్ళీ లాభాల బాట పట్టించడానికి కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తున్నట్లు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి విష్ణు దేవ సాయి బుధవారం రాజ్య సభలో వెల్లడించారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యుడు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. సెయిల్, ఆర్‌ఐఎన్‌ఎల్‌ను పటిష్టం చేసి వాటిని లాభాల్లోకి తెచ్చే ప్రణాళిక రూపకల్పన కోసం 2017లో నిపుణుల కమిటీని ఏర్పాటు చేసినట్లు మంత్రి చెప్పారు.
ఆర్‌ఐఎన్‌ఎల్‌కు సొంతంగా గనులు కేటాయించాలన్న డిమాండ్ చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న వాస్తవాన్ని మంత్రి అంగీకరించారు. మైనింగ్ లీజుల కేటాయింపు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు కేటాయించినందున, కేంద్రం ఆ విషయంలో జోక్యం చేసుకోదని ఆయన స్పష్టం చేశారు. ఉక్కు గనులను ఆపరేట్ చేస్తున్న ఒడిశా మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్(ఓఎండీసీ) ఆధ్వర్యంలోని గనులు మూతపడినందున ఆర్‌ఐఎన్‌ఎల్‌కు ఖనిజ సరఫరా జరగలేదని మంత్రి వివరించారు.
లాభదాయకత ప్రాతిపదికన పెన్షన్
విజయసాయి రెడ్డి అడిగిన మరో ప్రశ్నకు కూడా ఉక్కు శాఖ మంత్రి వివరణ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో పని చేసే సిబ్బందికి పదవీ విరమణ ప్రయోజన పథకంలో భాగంగా తమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పెన్షన్ స్కీమ్‌లను ప్రవేశపెట్టే ప్రతిపాదనలు ఉన్నాయని తెలిపారు. ఈ ప్రతిపాదనల పరిశీలనకై ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. కమిటీ సూచనల ప్రకారం కంపెనీ లాభదాయకత ప్రాతిపదికన, డిపార్ట్‌మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ మార్గదర్శకాలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో పని చేసే సిబ్బందికి పెన్షన్ స్కీమ్‌ను ప్రవేశపెట్టే దిశగా కేంద్రం యోచిస్తోందని మంత్రి వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment