జెనథ్/తాంసి, న్యూస్‌లైన్ : ఆంధ్రా-మహారాష్ట్ర సరిహద్దుల్లోని జైనథ్ మండలం డొల్లరా గ్రామం గుండా మహారాష్ట్రకు వెళ్లె రహదారిపై ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు చిన్నారులు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఇందులో ఇద్దరు ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలం అర్లి(టి) గ్రామానికి చెందిన స్నేహితులు కాగా, మరో ఇద్దరు మహారాష్ర్టలోని పిప్పల్‌కోటి గ్రామానికి చెందిన అన్నాచెల్లెళ్లు. వివరాలిలా ఉన్నాయి.
తాంసి మండలం అర్లి(టి) గ్రామానికి చెందిన సునీల్, సాయి, అనుకుంటకు చెందిన రజనీకాంత్ పెన్‌గంగా జాతర కోసం మహారాష్ట్రలోని పిప్పల్‌కోటికి శనివారం వెళ్లారు. తమ బంధువులైన పుండ్రువార్ ఆశన్న ఇంటికి చేరుకున్నారు. ఆదివారం ఉదయం ఆశన్న ఇద్దరు పిల్లలు చరణ్, తేజస్వినితో కలిసి సునీల్, సాయి, రజనీకాంత్ కటింగ్ కోసం బైక్‌పై మహారాష్ట్రలోని బోరికి బయలుదేరారు. తమ ఊరిలో వీరికి కటింగ్ ఎవరూ చేయకపోవడంతో వెళ్లారు. కటింగ్ చేయించుకున్న తర్వాత ఈ ఐదుగురు బైక్‌పై తిరుగుపయనమయ్యారు.
రెండు నిమిషాల్లో ఇంటికి చేరుకునేలోపే ఆదిలాబాద్ నుంచి వేగంగా వస్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో పుండ్రువార్ చరణ్(5), తేజస్విని(3), సాక్పెల్లి సునీల్(15), కానపెల్లి సాయి(15) అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఇదే ప్రమాదంలో కదరపువార్ రజనీకాంత్ తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు మృతులను పోస్టుమార్టం కోసం పాండర్‌కౌడకు, గాయపడిన రజనీకాంత్‌ను చికిత్సల నిమిత్తం జిల్లా కేంద్రంలోని రిమ్స్‌కు తరలించారు. రజనీకాంత్ పరిస్థితి విషమంగా ఉందని బంధువులు తెలిపారు.
అన్నాచెల్లెళ్ల మృత్యువాత
మహారాష్ర్టలోని పిప్పల్‌కోటికి చెందిన ఆశన్నకు ఒక కుమారుడు, ఒక కూతురు. భార్య పిల్లలతో వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నారు. బాలుడు చరణ్ జైనథ్ మండలంలోని పిప్పర్‌వాడలో ఎల్‌కేజీ చదువుతున్నాడు. తేజస్విని ఇంట్లోనే ఉంటోంది. ఇద్దరు చిన్నారులు చనిపోవడంతో తల్లిదండ్రులు కన్నీటి సంద్రమయ్యారు. ఉన్న ఇద్దరు బిడ్డలు చనిపోవడంతో వారి వేదనకు అంతులేదు. చిన్నారులపై ఏడ్చిన తీరు అందరిని కంటతడి పెట్టించింది. అక్కడకు వచ్చిన వారంతా కన్నీటి పర్యంతమయ్యారు. ఇద్దరు చిన్నారులు కలిసి మెలిసి ఉండేవారని, మృత్యువులోనూ ఇద్దరు కలిసిపోవడం అందరిని కలిచి వేసింది.
మృత్యువులోనూ వీడని స్నేహం
తాంసి మండలం అర్లి(టి)కిచెందిన సత్‌పెల్లి గంగన్న కుమారుడైన సునీల్, కాంపెల్లి ధర్మన్న కుమారుడైన సాయికుమార్ ఇద్దరు మంచి స్నేహితులు. స్థానిక ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నారు.సంక్రాంతి సెలవులు కావడం, మహారాష్ట్రలో గంగాజాతర ఉండటంతో శనివారం సాయంత్రం మహారాష్ట్రలోని పిప్పల్‌కోటిలోని సాయికుమార్ బంధువుల ఇంటికి ఇద్దరు కలిసి వెళ్లారు.
జాతర అనంతరం ఆదివారం ఉదయం కటింగ్ చేయించుకుని తిరిగి వస్తుండగా ఈ సంఘటన జరిగింది. వీరిద్దరి మంచి స్నేహితులు. ఒకే పాఠశాల. ఒకే తరగతి. ఒకటే బెంచీపై కూర్చొని చదువుకునే వారు. ఇద్దరు కూడా మృత్యువులోనూ కలిసే వెళ్లారు. ఇద్దరు స్నేహితులు చనిపోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఉపాద్యాయులు, తోటి విద్యార్థులు, గ్రామస్థులు కడసారి చూపుకోసం తరలివచ్చారు.
బాగా చదివిద్దామనుకున్నా.. : తల్లిదండ్రులు
తన కూతురు పదో తరగతిలో పాఠశాలలో టాపర్‌గా నిలిచి ఆదిలాబాద్‌లోని గురుకుల కళాశాలలో ఇంటర్ చదువుతోంది. చదువులో ముందుండే కొడుకు సాయి కుమార్‌ను కూడా పదో తరగతి తర్వాత ఉన్నత చదువులు చదివించి ప్రయోజకుడిని చేద్దామనుకున్నా. ఉన్న ఒక్క కొడుకు ఇలా అయిపోతాడనుకోలేదు. సెలవులుండటంతో జాతరకు వెళ్తామంటే సరే నని పంపించాం, ఇలా రోడ్డుపై ప్రాణాలు పోతాయనుకోలేదంటూ సాయికుమార్ తల్లిదండ్రులు రోదించడం అక్కడున్న పలువురిని కంటి తడిపెట్టించాయి.
దోస్తుతో పోతానంటే సరేనన్నాం..
రోజు ఇంట, బయట కలిసి తిరిగే స్నేహితుడు సాయికుమార్‌తో కలిసి జాతరకు వెళ్తానంటే సరేనన్నాం. కానీ వారిరువురు శాశ్వతంగా అటే పోతారనుకోలేదంటూ సునీల్ తండ్రి గంగన్న హృదయ విదారకంగా రోదించారు. ఎప్పుడూ కలిసుండే ఇరువురు స్నేహితుల శవాలను ఒకేసారి దహన సంస్కారాలకు తీసుకెళ్తుండగా వారి స్నేహం గురించి పలువురు పలు విదాలుగా చర్చించుకుంటూ కంటతడి పెట్టడంతో గ్రామంలో విషాదం నెలకొంది.
గర్భశోకం
Published Mon, Jan 20 2014 4:12 AM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM
Advertisement
Advertisement