‘దీపం’ పేరుతో దోపిడీ
తిరువూరు : తెలుగు మహిళలు కట్టెల పొయ్యిపై వంట చేయడం చూడలేక అందరికీ దీపం పథకం కింద వంటగ్యాస్ కనెక్షన్లు మంజూరు చేస్తున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెబుతుండగా, ఆ కనెక్షన్లకు అధిక ధరలు వసూలు చేస్తూ తెలుగు తమ్ముళ్లు మహిళల్ని మోసగిస్తున్నారు. ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు రూ. 1600 సబ్సిడీపై దీపం కనెక్షన్లను మంజూరు చేస్తుండగా, లబ్ధిదారులు కేవలం రూ.920 మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది. జిల్లాలోని ప్రతి మండలంలో 200 నుంచి 350 మంది డ్వాక్రా గ్రూపుల మహిళల్ని ఎంపిక చేసి గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు వంటగ్యాస్ కనెక్షన్లు ఇవ్వడానికి అధికారులు నిర్ణయించగా, ఇంతవరకు పంపిణీ పూర్తికాలేదు. సాధారణంగా గ్యాస్ ఏజెన్సీల నుంచి నేరుగా కొనుగోలు చేసినా రూ.2,500 మించి ధర ఉండదు. అదీకాకుండా అదనంగా మరో రూ.వెయ్యి దండుకుంటున్న వైనంపై అధికారులు సైతం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు.
అధిక రేట్ల వసూలు
ప్రభుత్వం నిర్ణయించిన ధరకు రెట్టింపు వసూలు చేస్తూ దళారులు సొమ్ము చేసుకుంటున్నారు. వంటగ్యాస్ రీఫిల్లింగ్, పాస్‌బుక్, ఇన్‌స్టాలేషన్ రుసుం మాత్రమే లబ్ధిదారు చెల్లించాల్సి ఉండగా, అదనంగా గ్యాస్ స్టవ్‌ను డీలర్లు అంటగడుతున్నారు. దీని ధర రూ.900 లోపే ఉన్నప్పటికీ రెట్టింపు ధర వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవల గంపలగూడెంలో లబ్ధిదారులు గ్యాస్ ఏజెన్సీలో అధిక ధరలు వసూలు చేయడంపై ఫిర్యాదు చేయడంతో అధికారులు నిర్ణీత ధరలను ప్రకటించారు. అయితే, గ్యాస్ ఏజెన్సీల వద్ద ఈ ధరలను ప్రదర్శిస్తే అదనపు వసూళ్లను అరికట్టవచ్చని పలువురు భావిస్తున్నారు.
డ్వాక్రా మహిళలకు బురిడీ
దీపం పథకం కింద ఎంపికైన లబ్ధిదారులకు మాయమాటలు చెప్పి కొందరు తెలుగు తమ్ముళ్లు వారినుంచి అధిక మొత్తంలో వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వం తక్కువ ధరకు వంటగ్యాస్ కనెక్షన్లు మంజూరు చేస్తోందని, ఈ అవకాశం వదులుకుంటే మళ్లీ మంజూరు చేయరని చెబుతూ అదనపు వసూళ్లకు పాల్పడుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి. తహశీల్దారు, ఎంపీడీవో, ఇందిరా క్రాంతి పథం అధికారులతో త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసి దీపం పథకం సజావుగా అమలయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని లబ్ధిదారులు కోరుతున్నారు.