కందికుంట ప్రసాద్.. దేశంలో అత్యంత అధిక నేరచరిత్ర ఉన్న పది మంది ఎమ్మెల్యేల్లో ఒకరు. వరదాపురం సూరి.. ఓ రౌడీషీటర్. జేసీ ప్రభాకర్‌రెడ్డి.. మరో రౌడీషీటర్. నందమూరి బాలకృష్ణ.. ఇంకో నేరచరితుడు.
కందికుంట ప్రసాద్.. దేశంలో అత్యంత అధిక నేరచరిత్ర ఉన్న పది మంది ఎమ్మెల్యేల్లో ఒకరు. వరదాపురం సూరి.. ఓ రౌడీషీటర్. జేసీ ప్రభాకర్‌రెడ్డి.. మరో రౌడీషీటర్. నందమూరి బాలకృష్ణ.. ఇంకో నేరచరితుడు. ఇదేదో నేరచరితులు, రౌడీషీటర్ల జాబితా కాదు.. ఈ సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరఫున అనంతపురం జిల్లాలో పోటీ చేస్తున్న అభ్యర్థుల జాబితా.
పజల్లో ఆదరణ లేదని స్పష్టమవడంతో రౌడీయిజం ద్వారా విజయం చేజిక్కించుకోవడానికి చంద్రబాబు వేసిన ఎత్తుగడ బెడిసికొడుతోంది. నేర చరిత ఎక్కువగా ఉన్న వారు, రౌడీషీటర్లకు టికెట్ ఇవ్వవద్దని మొత్తుకుంటున్నా మొండిగా వ్యవహరించిన చంద్రబాబు తీరును ఆ పార్టీ శ్రేణులే ఇపుడు బాహాటంగా విమర్శిస్తుండటం గమనార్హం. వివరాల్లోకి వెళితే.. పదేళ్లగా వరుస పరాజయాలతో టీడీపీ బక్క చిక్కిపోయింది. శ్రేణుల్లో నైతికస్థైర్యం దెబ్బతినడంతో సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కోవడం బాబుకు సవాల్‌గా మారింది.
తొమ్మిదేళ్లు అధికారపక్షం..పదేళ్ల ప్రతిపక్షం వహించిన చంద్రబాబు ప్రజాసంక్షేమం కోసం ఏనాడూ పోరాడిన దాఖలాలు లేవు. ఇది టీడీపీపై ప్రజావ్యతిరేకతను పెల్లుబికేలా చేస్తోంది. దీంతో సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించలేమని చంద్రబాబు ఆందోళన చెందారు. ధనబలం.. కండబలం.. నేరచరిత్ర ఉన్న నేతలనే అభ్యర్థులుగా ఎంపిక చేస్తే ప్రజావ్యతిరేకతకు అడ్డుకట్ట వేయవచ్చునని వ్యూహం రచించారు. ఎన్నికల్లో విచ్చలవిడిగా డబ్బు వెదజల్లి ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడం.. దనాస్త్రానికి లొంగని ప్రాంతాల్లో దౌర్జన్యం చేసి ఓటర్లను భయోత్పాతానికి గురిచేయడం వల్ల ప్రజావ్యతిరేకత నుంచి తప్పించుకుని దొడ్డిదారిన విజయం సాధించవచ్చునన్నది టీడీపీ అధినేత చంద్రబాబు ఎత్తుగడ.
ధనబలం.. కండబలం.. నేరచరిత్ర ఉన్న వారిని నేరుగా అభ్యర్థులుగా ఎంపిక చేస్తే.. పార్టీలో వ్యతిరేకత వ్యక్తమవుతుందని భావించిన చంద్రబాబు మరో కుట్రకు పదును పెట్టారు. ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్ (ఐవీఆర్‌ఎస్) పద్ధతిలో ప్రజాభిప్రాయాన్ని సేకరించి అభ్యర్థులను ఎంపిక చేస్తానని సెలవిచ్చారు. తద్వారా తాను అనుకున్న అభ్యర్థిని ఎంపిక చేయవచ్చునని భావించారు. జిల్లాలో రెండు లోక్‌సభ, 14 శాసనసభ స్థానాలకు అదే పద్ధతిలో అభ్యర్థులను ఎంపిక చేశారు.
నేరచరితులకే పెద్దపీట
చంద్రబాబు ఎంపిక చేసి, పోటీకి దించిన అభ్యర్థుల చరిత్రను ఒక్కసారి పరిశీలిస్తే.. అధిక శాతం మందిపై కేసులు ఉన్నాయి. అభ్యర్థుల్లో కొందరైతే రౌడీషీటర్లు ఉన్నారు. మరికొందరు 420లుగా ముద్రపడ్డారు. ధనబలం ఉన్న వారు అధికంగా ఉన్నారు. టీడీపీ అభ్యర్థులు నామినేషన్ల సమయంలో ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్లను పరిశీలిస్తే ఇది వెల్లడవుతోంది. ప్రజాబలం కన్నా ధన, కండ బలం, నేరచరిత్ర ఉన్న వారికే చంద్రబాబు పెద్దపీట వేసినట్లు స్పష్టమవుతోంది.
దేశంలో అత్యంత నేరచరితులైన పది మంది ఎమ్మెల్యేల జాబితాలో కదిరి ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్ కూడా స్థానం పొందారు. అసోషియేషన్ ఫర్ డెమెక్రటిక్ రిఫార్మ్స్ సంస్థ దేశ వ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో ఇది వెల్లడైంది. కందికుంటప్రసాద్‌పై వివిధ పోలీసుస్టేషన్లలో ఏడు కేసులు నమోదయ్యాయి. కందికుంట ప్రసాద్‌పై వివిధ కేసుల్లో ఐపీసీ 120(బి), 324, 307, 302, 353, 420 వంటి తీవ్రమైన సెక్షన్లు ఉండటం గమనార్హం. నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టులో కందికుంట ప్రసాద్‌పై నమోదు చేసిన రెండు కేసులు విచారణలో ఉండటం గమనార్హం.
ధర్మవరం నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి గోనుగుంట్ల సూర్యనారాయణ అలియాస్ వరదాపురం సూరి ఓ రౌడీషీటర్. సూరిపై బత్తలపల్లి పోలీసుస్టేషన్‌లో జనవరి 1, 2006న రౌడీషీట్ (నంబర్ : 27/ఏఎన్ ) తెరిచారు. వివిధ పోలీసుస్టేషన్‌లలో పదికిపైగా కేసులు నమోదయ్యాయి.
తాడిపత్రి నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి జేసీ ప్రభాకర్‌రెడ్డి కూడా ఓ రౌడీషీటర్. ఈ అంశాన్ని ఆయన అనేక సందర్భాల్లో అంగీకరించారు కూడా. తాడిపత్రి టౌన్ పోలీసుస్టేషన్‌లో డిసెంబర్ 1, 1993న జేసీ ప్రభాకర్‌రెడ్డిపై రౌడీషీట్ (నంబర్ : 240/ఏఎన్) తెరిచారు. ఈయనపై రౌడీషీటే కాదు పదుల సంఖ్యలో వివిధ పోలీసుస్టేషన్‌లలో కేసులు కూడా నమోదయ్యాయి.
హిందూపురం టీడీపీ అభ్యర్థి నందమూరి బాలకృష్ణపై కూడా మూడు కేసులు నమోదయ్యాయి. లక్ష్మీనరసింహ చిత్ర నిర్మాత బెల్లంకొండ సురేష్‌పై బాలకృష్ణ ఆరు రౌండ్ల కాల్పులు జరపడం అప్పట్లో సంచలనం రేపింది. దీనిపై పోలీసులు కేసును నమోదు చేసి విచారించారు.. తన మానసిక స్థితి బాగోలేదని నిమ్స్ వైద్యులతో సర్టిఫికెట్ పొందిన బాలకృష్ణ.. ఆ కేసు నుంచి తప్పించుకున్నారనే బలమైన ఆరోపణలు ఉండటం గమనార్హం.
భయోత్పాతం సృష్టిస్తోన్న వైనం
టీడీపీ తరఫున బరిలోకి దిగిన వారిలో అధిక శాతం మందిపై ఏదో ఒక కేసు నమోదు కావడం గమనార్హం. నేరచరితులు, రౌడీషీటర్లు అభ్యర్థులుగా బరిలోకి దిగడంతో ఓటర్లు ఆందోళన చెందుతున్నారు. అధిక శాతం నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు వాడిగా ధనాస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు. ధనాస్త్రానికి లొంగని నేతలు, ఓటర్లపై రౌడీయిజం చేస్తున్నారు. అనంతపురం లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీలతోపాటూ ధర్మవరం, రాప్తాడు, హిందూపురం, కదిరిలో బెదిరింపుల తీవ్రత అధికమైంది. పోలింగ్‌కు ముందే ఓటర్లను భయోత్పాతానికి గురిచేసి ఓటింగ్ శాతాన్ని తగ్గించాలన్నది టీడీపీ ఎత్తుగడ. భయోత్పాతం సృష్టించి పోలింగ్‌కు రా కుండా ఓటర్లను అడ్డుకుని సైక్లింగ్ ద్వారా రిగ్గింగ్ చేసుకోవడానికి ఎత్తులు వేస్తున్నారు.