సాక్షి, అమరావతి: గత ఎన్నికలతో పోలిస్తే.. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో జరిగిన హింసాత్మక ఘటనలు తక్కువేనని ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకుర్ స్పష్టం చేశారు. ఈ మేరకు గురువారం రాత్రి ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. గత ఎన్నికల్లో రాష్ట్రంలో చోటుచేసుకున్న ఘటనల్లో ఆరుగురు మృతి చెందారని, ఈసారి ఇద్దరు మరణించారని పేర్కొన్నారు. 2014లో హింసాత్మక ఘటనలు 276 జరుగగా, ఈసారి 84 హింసాత్మక ఘటనలు జరిగాయని తెలిపారు. గతంలో ఐదు ఈవీఎంలు ధ్వంసం చేస్తే ఈసారి ఆరు ధ్వంసం చేశారని పేర్కొన్నారు. ఎన్నికల పర్యవేక్షణ, లైవ్ రిలే కోసం 140 డ్రోన్స్ ఉపయోగించామని, ఎన్నికల నిర్వహణను డీజీపీ ప్రధాన కార్యాలయం నుంచి పర్యవేక్షించామని పేర్కొన్నారు.
బాడీవోర్న్ కెమెరాలను ఉపయోగించి నేరుగా ఎన్నికల సరళిని పరిశీలించినట్టు డీజీపీ తెలిపారు. ఈ ఎన్నికల్లో 100 సెంట్రల్ సాయుధ పారా మిలటరీ ఫోర్స్ కంపెనీల కొరత ఉన్నప్పటికీ..బందోబస్తును సమర్థంగా నిర్వహించినట్లు పేర్కొన్నారు. గత ఎన్నికల్లో తెలంగాణ ఎన్నికలు పూర్తయ్యాక ఏపీ ఎన్నికలు జరగడంతో, ఆ రాష్ట్రానికి చెందిన 28,000 తెలంగాణ పోలీసు దళాలు వచ్చాయని, ఈసారి రెండు రాష్ట్రాల్లో ఏకకాలంలో ఎన్నికల వల్ల ఆ రాష్ట్రం నుంచి బలగాలు అందుబాటులో లేవని పేర్కొన్నారు. తాము ఆదేశాలు ఇచ్చే వరకు ఎన్నికల సందర్భంగా ఏర్పాటు చేసిన పోలీసు బందోబస్తును కొనసాగించాలని ఆదేశాలు ఇచ్చినట్టు డీజీపీ ఆ ప్రకటనలో స్పష్టం చేశారు.
డీజీపీతో సీఎస్ అత్యవసర భేటీ..
సార్వత్రిక ఎన్నికల సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా పలు హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవడంతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్‌వీ సుబ్రమణ్యం డీజీపీ ఠాకుర్‌తో అత్యవసర భేటీ నిర్వహించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను సమీక్షించేందుకు డీజీపీని తన వద్దకు రావాలని కోరితే విధులకు అంతరాయం ఏర్పడుతుందని భావించిన సీఎస్ నేరుగా ఆయనే పోలీస్ ప్రధాన కార్యాలయానికి వెళ్లినట్టు సమాచారం. దాదాపు అరగంట పాటు డీజీపీతో సమావేశమైన సీఎస్ రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిని సమీక్షించారు.
గత ఎన్నికలతో పోల్చితే హింసాత్మక ఘటనలు తక్కువ: డీజీపీ
Published Fri, Apr 12 2019 4:27 AM | Last Updated on Fri, Apr 12 2019 4:27 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment