లింగసముద్రం రెవెన్యూ అధికారుల అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. అడ్డూ అదుపు లేకుండా ఇష్టా్టరీతిన ఆన్‌లైన్ మోసాలు బహిర్గతమవుతున్నాయి. ప్రభుత్వ భూముల అన్యాక్రాంతం విషయంలో స్థానిక రెవెన్యూ అధికారులపై చర్యలకు రంగం సిద్ధమైనట్లు సమాచారం. మండల పరిధిలో పెద్ద ఎత్తున భూ ఆక్రమణలు జరగడం, భూముల ఆన్‌లైన్ చేయడం.. వంటి మోసాలను ఇప్పటికే జిల్లా స్థాయి ఉన్నతాధికారులు గుర్తించారు. బాధ్యులపై వేటు వేసేందుకు ఉన్నతాధికారులు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
కందుకూరు: లింగసముద్రం మండలంలో రెవెన్యూ అధికారుల అక్రమాలకు అంతేలేకుండా పోయింది. ఒకరి పేరుపై ఉన్న భూములను మరొకరి పేరుపై ఆన్‌లైన్ చేయడం, ప్రభుత్వ భూములను అప్పన్నంగా ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టడం వంటివి జోరుగా సాగాయి. వీటిలో ప్రధానంగా తూనుగుంట గ్రామానికి చెందిన కరణం చినమాలకొండయ్య అనే వ్యక్తిపై ఉన్న భూమిని బాసం చినచెంచయ్య అనే వ్యక్తి పేరుపై ఆన్‌లైన్ చేశారు. ఇది పక్కాగా ప్రైవేట్ వ్యక్తికి చెందిన పట్టాభూమి. మరొకరి పేరుపై ఆన్‌లైన్ చేశారు. దీనిపై ఫిర్యాదులు అందడంతో ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు.
ఈ విచారణలో ఆన్‌లైన్ అక్రమాలు జరిగినట్లు రుజువైంది. ఈ విధంగా మండలంలో భూముల ఆన్‌లైన్ విషయం అధికారులు ఇష్టారీతిగా మారింది. ఈ విషయంలోనే ఓ అధికారి తప్పు రుజువు కావడంతో చర్యలు తీసుకునేందుకు ఉన్నతాధికారులు సిద్ధమయ్యారు. ఇక పెదపవనిలో అధికార పార్టీ నేత, మాజీ వీఆర్వో పట్టాభిరామ్మూర్తి సాగించిన భూదందా అంతా ఇంత కాదు. ఏకంగా 65 ఎకరాలకుపైగా ప్రభుత్వ భూములు తన కుటుంబ సభ్యుల పేరుపై తీసుకున్నాడు. ఈ భూ ఆక్రమణలపై కలెక్టర్‌కు అనేక సార్లు ఫిర్యాదులు అందాయి. దీనిపై ఆర్డీఓని కలెక్టర్ నివేదిక కోరడం, భూ ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలని పలుమార్లు స్వయంగా కలెక్టర్ ఆదేశించడం ఇదివరకే జరిగింది. అధికార పార్టీ నేత కావడంతో భూములు స్వాధీనం చేసుకోవడంలో రెవెన్యూ అధికారులు తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించారు.
ఈ నేపథ్యంలో గత నెల 19వ తేదీన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ మంత్రి మానుగుంట మహీధర్‌రెడ్డి స్వయంగా తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. భూ ఆక్రమణలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని అధికారులను నిలదీశారు. ఇది అధికార వర్గాల్లో పెద్ద చర్చనీయాంశమైంది. స్వయంగా ఓ మాజీ మంత్రి రెవెన్యూ అక్రమాలకు ఆందోళనకు దిగడం, మండలంలో జరిగిన ప్రభుత్వ భూ ఆక్రమణలు, ఆన్‌లైన్ మోసాలను ఆధారాలతో సహా బయట పెట్టడంతో ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి రెవెన్యూ అధికారులది. దీనిపై లింగసముద్రం తహసీల్దార్‌ను ఉన్నతాధికారులు నివేదిక కోరారు. ఆ నివేదికలోనూ ఆమె స్పష్టమైన సమాచారం ఇవ్వనట్లు తెలిసింది. అక్రమాలకు జరిగాయని ఆధారాలున్నా ఏం చర్యలు తీసుకున్నారో చెప్పకుండా ఉన్నతాధికారులను మాయ చేసే ప్రయత్నం చేసినట్లు స్పష్టమవుతోంది.
వందల ఎకరాలు అన్యాక్రాంతం
లింగసముద్రం మండలంలో సాగిన భూదోపిడీ అంతా ఇంతా కాదు. వందల ఎకరాల ప్రభుత్వ భూములను అప్పన్నంగా ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టారు. లింగసముద్రం ఎంపీపీ కల్పనకు స్వయంగా మామ, మాజీ వీఆర్వో పట్టాభిరామ్మూర్తి ఒక్కడే 65 ఎకరాల ప్రభుత్వ భూములను కొట్టేసి కుటుంబ సభ్యుల పేరుతో ఆన్‌లైన్ ఎక్కించాడు. వీటిలో ప్రధానంగా సర్వే నంబర్–3లోని 536 ఎకరాల గ్రేజింగ్ పోరంబోకు భూములను చెట్టుపట్టాల పేరుతో అధికార పార్టీ నేతలు కొట్టేశారు. ఇక పెదపవనిలో సర్వే నంబర్ 389లో కాల్వ పోరంబోకు 17.86 సెంట్లు గూడూరి పట్టాభిరామ్మూర్తి, 206/1లో పౌరోహిత్యం 3.06 ఎకరాలు రామూర్తి కుమారుడు రంగనా«థ్ పేరుపై ఆన్‌లైన్ చేశారు. సర్వే నంబర్ 352/1లో3.12 ఎకరాలు, 364/3లో 3.48 ఎకరాలు ఇండ్ల లక్ష్మయ్య, ఇండ్ల రామయ్య పేరుతో ఇచ్చిన అసైన్‌మెంట్‌ను గూడూరి రంగనాథ్ తన పేరుపై ఆన్‌లైన్ ఎక్కించాడు.
అలాగే 492/3లో పీర్లమాన్యం 0.90 సెంట్లు రంగనా«థ్, 402లో గయాళు, 4.26 ఎకరాలు గూడూరి నాగభూషణం, 492/3లోని పీర్లమాన్యం 0.45 సెంట్లు, 860/1లో గయాళు 1.96 ఎకరాలు, 860/2లో గయాళు 4.65 ఎకరాలును రామ్మూర్తి భార్య సుజాత పేరుపై మార్చారు. 206/1లో పౌరోహిత్యం 1.04 ఎకరాలు రామ్మూర్తి ఇలా ఇంకా పలు సర్వే నంబర్‌ల్లోని మొత్తం 65 ఎకరాలకుపైగా ఒక్క రామ్మూర్తే ఆక్రమించాడు. రాళ్లపాడులో 48/1లో గ్రేజింగ్ పోరంబోకు 2.58 ఎకరాలు బోడి శివకుమారి పేరుపై, 106/3లో గ్రేజింగ్ పోరంబోకు 66 సెంట్లు ఆక్రమణ, పెంట్రాలలో సర్వే నంబర్ 36లోని కోదండరామస్వామి మాన్యాన్ని నివేశన స్థలాలకు ఇచ్చారు. మొగిచర్లలోని 356లోని కాల్వపోరంబోకు 0.84 సెంట్లు వేముల రవీంద్రనా«థ్, 215లో అనాధీనం 1.73 ఎకరాలు, 220/2లో 3 ఎకరాలు చొప్పర నరసింహం పేరుపై, 152/1లో అనాధీనం 5.06 ఎకరాలు, 505లోని ఎకరా అనాధీనం భూమిని కామినేని పుల్లమ్మ, 152/2లో అనాధీనం 2.53 ఎకరాలు వేముల పద్మ పేర్లతో రికార్డులు మార్పిడి జరిగింది. ఇలా మండలంలో జరిగిన ప్రభుత్వ భూముల అన్యాక్రాంతానికి అడ్డూ అదుపూ లేకుండా పోయింది.
Comments
Please login to add a commentAdd a comment