బాబు ఒక రోజు ఢిల్లీ దీక్షకు రూ.10 కోట్లు | Rs 10 crores expenditure for a day in ap cm Delhi Inmates | Sakshi
Sakshi News home page

బాబు ఒక రోజు ఢిల్లీ దీక్షకు రూ.10 కోట్లు

Published Sat, Feb 9 2019 2:13 AM | Last Updated on Sat, Feb 9 2019 8:32 AM

 Rs 10 crores expenditure for a day in ap cm Delhi Inmates - Sakshi

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక రోజు ఢిల్లీలో ఈనెల 11వ తేదీన చేస్తున్న దీక్షకు ఏకంగా పది కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు అదనపు నిధులను మంజూరు చేస్తూ ఆర్థిక శాఖ ఇంచార్జి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.రవిచంద్ర జీవో జారీ చేశారు. సర్కారు సొమ్ములతో ఇప్పటి వరకు రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో  ధర్మపోరాట దీక్షల పేరుతో కోట్ల రూపాయలు వ్యయం చేసిన చంద్రబాబు సర్కారు.. ఇప్పుడు ఢిల్లీలో ఒక రోజు దీక్షకు పది కోట్ల రూపాయలను వ్యయం చేయడాన్ని అధికార యంత్రాంగం విస్మయం వ్యక్తం చేస్తోంది. రాజకీయ దీక్షలకు ముఖ్యమంత్రి ప్రభుత్వ సొమ్ములను ఏ విధంగా వ్యయం చేస్తారని ఉన్నతాధికార వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. అంతే కాకుండా ఇప్పటికే ధర్మపోరాట దీక్షల పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యక్తిగత ప్రతిష్ట పెంచుకోవడానికి ఖజానా నుంచి ప్రచారం కోసం 13.77 కోట్ల రూపాయలు వ్యయం చేయడాన్ని కాగ్‌ తప్పు పట్టిన విషయం తెలిసిందే. అంతే కాకుండా ఈ విధంగా ప్రజాధనాన్ని రాజకీయంగా అధికార పార్టీ ప్రయోజనం కోసం వ్యయం చేయడం సుప్రీం కోర్టు తీర్పు నిబంధనలకు విరుద్ధమని కూడా కాగ్‌ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అయినా సరే ఇవేమీ లెక్క చేయకుండా ఈ నెల 11వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక రోజు దీక్ష ఏర్పాట్ల కోసం ప్రాథమికంగా పది కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసింది.

ఈ పది కోట్ల రూపాయల్లో ఏర్పాట్ల కోసం 8 కోట్ల రూపాయలను, రవాణా సౌకర్యం కోసం రెండు కోట్ల రూపాయలుగా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మరో పక్క ఇది పక్కా రాజకీయ దీక్ష అని అలాంటి దీక్షకు ఖజానా నుంచి నిధులు వినియోగం అంటే దుర్వినియోగం చేయడమేనని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. అంతటితో ఆగకుండా రాజకీయ దీక్షకు ఉద్యోగులందరూ తరలి రావాలంటూ ఆదేశాలు జారీ చేయడం అంటే అధికార దుర్వినియోగమేనని ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. దీక్ష ఏర్పాట్లతో పాటు వివిధ ప్రాంతాల నుంచి దీక్షకు హాజరయ్యే వారికి రవాణా సౌకర్యం కల్పించడానికి పది కోట్ల రూపాయలు వ్యయం చేయాలని ఉత్తర్వుల్లో ఆర్థిక శాఖ పేర్కొంది. వివిధ ప్రాంతాల నుంచి దీక్షకు ఉద్యోగులను తరలించేందుకు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ దీక్షలో రాజకీయ పార్టీలతో పాటు ఉద్యోగ సంఘాలు పాల్గొంటాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఉద్యోగులను ఢిల్లీకి తరలించేందుకు శ్రీకాకుళం నుంచి, అనంతపురం నుంచి ప్రత్యేక రైళ్లును ఏర్పాటు చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం దక్షిణ మధ్య రైల్వేను కోరింది. దీని కోసం దక్షిణ మధ్య రైల్వేకు 1,12,16,465 రూపాయలను చెల్లించేందుకు సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి ఎన్‌. శ్రీకాంత్‌ జీవో జారీ చేశారు.

ఈ నెల 8వ తేదీన శ్రీకాకుళం జిల్లా నుంచి మధ్యాహ్నాం 12 గంటలకు, అనంతపురం జిల్లా నుంచి 8వ తేదీ ఉదయం 10 గంటలకు ప్రత్యేక రైళ్లు బయలు దేరి ఈ నెల 10వ తేదీ ఉదయం 10 గంటలకు చేరుకుంటాయని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఆఘమేఘాల మీద ఇందుకు సంబంధించిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం గమనార్హం. ఈ నెల 6వ తేదీన సీఎం కార్యాలయం ఆదేశాల మేరకు సాధారణ పరిపాలన శాఖ ఆర్థిక శాఖకు లేఖ రాసింది. ఆ లేఖ ఆధారంగా అదే రోజు ఆర్థిక శాఖ పది కోట్ల రూపాయలను విడుదల చేస్తూ జీవో జారీ చేసింది. అదే రోజు ప్రత్యేక రైళ్ల ఏర్పాటునకు నిధులను విడుదల చేస్తూ సాధారణ పరిపాలన శాఖ జీవో జారీ చేసింది.  

అసోసియేషన్‌కు రెండు విమాన టికెట్లు
ఇదిలా ఉంటే.. ఢిల్లీ ధర్నాలో పాల్గొనాలంటూ ముఖ్యమంత్రి కార్యాలయం.. ఉద్యోగులపై తీవ్ర ఒత్తిడి తీసుకువస్తోంది. ఇందులో భాగంగా చిన్నచితకా రాజకీయ పార్టీలతో పాటు అన్ని ఉద్యోగ సంఘాలకు రెండేసి చొప్పున విమాన టికెట్లను పంపుతోంది. మరోవైపు.. శ్రీకాకుళం, అనంతపురం నుంచి బయల్దేరే రైళ్లల్లో ఏఏ స్టేషన్లలో ఎవరెవరు ఎక్కుతారో ఆ వివరాలివ్వాలని సీఎంవో కార్యాలయం ఒత్తిడి చేస్తుండడంపై ఉద్యోగులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ పార్టీలకు దూరంగా ఉండాల్సిన తమను ఎన్నికల ప్రయోజనాల కోసం ఇలా వాడుకోవడంపై ఉద్యోగ సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. 

ఇప్పటివరకు ప్రచార ఖర్చు ఇలా...
►గత ఏడాది నుంచి ఇప్పటివరకు రంజాన్, ఏరువాక, జలహారతి, యువనేస్తం, పోలవరం తదితర ఈవెంట్ల ప్రచార ప్రకటనల వ్యయం : రూ.60.18 కోట్లు 
►బాబుగారి ఒక రోజు నవనిర్మాణ దీక్ష  హోర్డింగ్స్‌కు : రూ.13.76 కోట్లు ఖర్చు
​​​​​​​►సీఎం నిర్వహించిన ఒక్కరోజు నవ నిర్మాణ దీక్ష ప్రచార ఖర్చు : రూ.8.67 కోట్లు
​​​​​​​►బాబు ధర్మపోరాట దీక్ష హోర్డింగ్స్‌కు : రూ.3.99 కోట్లు
​​​​​​​►ఇప్పటికే గత ఏడాది నుంచి ఇప్పటివరకు ఔట్‌డోర్‌ ప్రచారం పేరుతో చేసిన ఖర్చు : రూ.30.26 కోట్లు 
​​​​​​​►అంబేద్కర్‌ ఆశయం–చంద్రన్న ఆచరణ ఈవెంట్‌  ప్రచార ఖర్చు : రూ.3 కోట్లు
​​​​​​​►1500 రోజుల పాలన పూర్తి పేరుతో ప్రచార ఖర్చు : రూ.17.79 కోట్లు
​​​​​​​►1500 రోజుల పాలన పూర్తి నేపథ్యంలో  హోర్డింగ్స్‌ ఖర్చు : రూ.12 కోట్లు  
​​​​​​​►ఇందులో స్వచ్ఛ భారత్, సంక్రాంతి సంబరాలు  హోర్డింగ్స్‌కు : రూ.7.67 కోట్లు
​​​​​​​►సామూహిక గృహ సముదాయాల ఈవెంట్ల ప్రచారానికి  హోర్డింగ్స్‌ ఖర్చు : రూ.4.59 కోట్లు  
​​​​​​​►ఇక యువనేస్తం హోర్డింగ్స్‌ ద్వారా ప్రచారానికి : రూ.6 కోట్లు  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement