రూ.73 లక్షల పనులను విభజిస్తూ టెండర్లు
కలెక్టర్ చెప్పారంటూ నిబంధనలకు తూట్లు
మినిట్స్‌లో ఎక్కడా కనిపించని కలెక్టర్ మాటలు
ఇదీ చిత్తూరు కార్పొరేషన్‌లో అధికారుల నిర్వాకం
చిత్తూరు కార్పొరేషన్ అధికారులు నిబంధనలను తుంగలో తొక్కారు. కమీషన్లకు కక్కుర్తిపడి టెండర్ల ప్రక్రియనే మార్చేశారు. కలెక్టర్ చెప్పారంటూ రూ.73 లక్షల పనులను ఏడు విభాగాలుగా విడగొట్టి కొందరు కాంట్రాక్టర్లకు లబ్ధిచేకూర్చే విధంగా ప్రయత్నించడం
విమర్శలకు తావిస్తోంది.
చిత్తూరు (అర్బన్): చిత్తూరు కార్పొరేషన్ కార్యాలయంలో పాలన గాడి తప్పింది. ఇక్కడ టీడీపీ నాయకులు చెప్పిందే చెలామణి అవుతోంది. లోటుపాట్లను చెప్పాల్సిన అధికారులే నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు.
ఇదిగో సాక్ష్యం
చిత్తూరు నగరంలోని చర్చివీధిలో కాలువ పనులు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అధికారులు రోడ్డు ఆక్రమణలను సైతం తొలగించారు. అయితే చర్చివీధిలోని రోడ్డుకు రెండు వైపులా ఫుట్‌పాత్ (నడక దారి) నిర్మించాలని అధికారులు ప్రతిపాదనలు తయారుచేశారు. దీనిపై గత నెల మొత్తం రూ.73 లక్షల వ్యయంతో అంచనాలు రూపొదించారు. అయితే ఒకేసారి రూ.73 లక్షల పనులకు టెండర్లు పిలిస్తే బయటి ప్రాంతల నుంచి కాంట్రాక్టర్లు పాల్గొనే అవకాశం ఉందని, దీంతో ఇక్కడున్న కాంట్రాక్టర్లు నష్టపోతారని భావించిన అధికారులు ఈ పనులకు రూ.40 లక్షలుగా ఒకటి, రూ.33 లక్షలుగా మరొకటిగా విడదీశారు. ఈ పనులు చేపట్టడానికి ఈనెల 11న కార్పొరేషన్‌లో జరిగిన స్టాండింగ్ కమిటీ సమావేశం ఏకగ్రీవంగా తీర్మానిచింది. అయితే సమావేశం పూర్తయిన తరువాత మొత్తం రూ.73 లక్షల విలువైన పనులను రూ.10 లక్షల చొప్పున విభజిస్తూ 7 పనులుగా విడగొట్టారు. వాస్తవానికి రూ.15 లక్షల విలువైన పనులు చేయడానికి నెల్లూరులోని సూపరింటెండ్ ఇంజినీరు (ఎస్‌ఈ), రూ.15 లక్షలకు పైబడ్డ పనులకు రాష్ట్ర ఇంజినీరింగ్ అండ్ చీఫ్ (ఈఎన్‌సీ) ఆమోదం తప్పనిసరి. కేవలం చిత్తూరులో అధికారపార్టీకి చెందిన కాంట్రాక్టర్లకు కొమ్ము కాయడానికి చర్చివీధిలో రూ.73 లక్షల పనులను విభజించి అధికారులు అవినీతికి తెరతీశారు. ఏప్రిల్ 1న ఈ పనులకు టెండర్లు జరగనున్నాయి.
పేరు కలెక్టర్‌ది..
ఇటీవల ఆర్డీవో కార్యాలయంలో కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ సమక్షంలో జరిగిన కార్పొరేషన్ అభివృద్ధి సమావేశంలో నామినేషన్ పద్ధతిన కలెక్టరేట్ పనులను ఇవ్వమన్నారని చెబుతున్నారు. రూ.73 లక్షల పనులు పెద్ద కంపెనీ దక్కించుకుంటే నాణ్యతతో పాటు పనులు కూడా త్వరగా పూర్తవుతాయి. అలా కాకుండా కలెక్టర్ పనులను విడగొట్టమన్నారని అధికారులు దుష్ర్పచారం చేస్తున్నారు. కానీ ఆర్డీవో కార్యాలయంలో జరిగిన సమావేశానికి సంబంధించి అధికారులు రాసుకున్న తీర్మానం (మినిట్స్)లో ఎక్కడా కలెక్టర్ ఈ ప్రస్తావన చేసినట్లు రికార్డు కాకపోవడం విశేషం.
ప్రజల అవసరం దృష్ట్యా
చర్చివీధిలో పనులు త్వరగా పూర్తిచేయాలని కలెక్టర్ చెప్పారు. పెద్ద మొత్తంలో ఒకేసారి పనులు చేయాలంటే ఎస్‌ఈ, ఈఎన్‌సీ వద్దకు వెళ్లాలని పనులను విడగొట్టాం. అది కూడా స్టాండింగ్ కమిటీ నిర్ణయం మేరకే. పారదర్శకంగా ఉండటానికే ఆన్‌లైన్‌లో టెండర్లు నిర్వహిస్తున్నాం. - భాస్కరరావు, ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు, చిత్తూరు కార్పొరేషన్
అధికారుల ‘పచ్చ’ అజెండా
Published Wed, Mar 23 2016 2:02 AM | Last Updated on Mon, Aug 13 2018 3:23 PM
Advertisement
Advertisement