
‘బస్సులో భోజనం’ షురూ
హైదరాబాద్, న్యూస్‌లైన్: దూరప్రాంత ప్రయాణికుల సౌకర్యార్థం ఉద్దేశించిన ‘ఆర్టీసీ డిన్నర్ ఆన్ బోర్డు’ (ప్రయాణంలో భోజనం) సదుపాయాన్ని ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ (ఆపరేషన్స్) జి.వి.రమణారావు శనివారం ఇక్కడ ఎంజీబీఎస్‌లో లాంఛనంగా ప్రారంభించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ఈ పథకాన్ని బెంగళూరు, పుణే, షిర్డీ, చెన్నై, విశాఖపట్నం, కాకినాడ, తిరుపతి ప్రాంతాలకు వెళ్లే వెన్నెల, గరుడ, గరుడ ప్లస్ బస్సులకు మాత్రమే పరిమితం చేశామని, ప్రయాణికుల నుంచి వచ్చే స్పందననుబట్టి దశలవారీగా మరిన్ని బస్సులకు విస్తరింపజేస్తామన్నారు. ప్రయాణికులు 4 గంటల ముందుగా 8688931666 నంబర్‌కు ఫోన్ చేసి రోటీ, బిర్యానీ, మీల్స్, శాండ్‌విచ్, పుల్లారెడ్డి స్వీట్లు, కరాచీ బేకరీ ఐటమ్స్‌తోపాటు వారు కోరుకున్న ఐటమ్స్‌ను ఆర్డర్ చేస్తే ఎంజీబీఎస్‌లో వారికి ఆయా పదార్థాలను అందిస్తామన్నారు.
కాగా, ఈ ఆహార పదార్థాలను సరఫరా చేసే ‘ఎలాంగ్ ది వే’ సంస్థ సీఈవో సురేంద్ర లింగారెడ్డి మాట్లాడుతూ ప్రయాణికులకు రుచి, శుచితో కూడిన వేడివేడి ఆహార పదార్థాలను అందించినందుకుగాను మార్కెట్ ధరకన్నా 20 శాతం అధికంగా సర్వీసు చార్జీలను వసూలు చేస్తామన్నారు. అనంతరం విశాఖపట్నం, షిర్డీ, విజయవాడ, బెంగళూరులకు వెళ్లే బస్సుల్లోని ప్రయాణి కులకు ఉచితంగా తొలిరోజు డిన్నర్ ప్యాకెట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రేటర్ హైదరాబాద్ జోన్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ ఎ.కోటేశ్వరరావు, రంగారెడ్డి జిల్లా రీజినల్ మేనేజర్ సి.వినోద్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.