విజయబాబు
హైదరాబాద్: ఐఏఎస్ అధికారుల పనితీరు, వారి వ్యవహార శైలిపై ఏపీ ఆర్టీఐ కమిషనర్ విజయబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసిన సమాచారాన్ని అధికారులు ఇవ్వడంలేదని చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ సహా అయిదుగురు కమిషనర్లు గవర్నర్ను కలిశారు. అనంతరం విజయబాబు మాట్లాడుతూ కొంతమంది ఐఏఎస్ అధికారులు కావాలనే ఆర్టీఐ చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్నారన్నారు. కొందరు అధికారులు తెంపరితనం చూపుతున్నారని విమర్శించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఆర్టీఐని నీరుగారుస్తున్నారన్నారు. ఈ విషయంలో చిత్తూరు జిల్లా కలెక్టర్ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
ఐఏఎస్ అధికారులు ఆర్టీఐ చట్టాలను నిర్వీర్యం చేయడంపై ఉదాహరణలతో సహా గవర్నర్కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. తమవైపు నుంచి తప్పు ఉంటే విచారణ చేపట్టాలన్నారు. ఐఏఎస్ల వ్యవహారశైలి చట్ట స్ఫూర్తికి అవమానకరమని ఆయన అన్నారు. కొంతమంది ఐఏఎస్ అధికారులు వారి ఆదాయాలకు, వారి స్థాయికి మించి భవనాలు కడుతున్నారని ఆరోపించారు. ఈ విషయాలన్నిటినీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకు కూడా వివరిస్తామని విజయబాబు చెప్పారు.