రవాణా శాఖలో కలకలం
ఆర్టీవో, మరో ఇద్దరు సస్పెన్షన్
ట్రాన్స్‌పోర్ట్ లెసైన్స్ బ్యాడ్జిల జారీలో అవినీతి
విద్యార్హతలను పరిశీలించకుండా మంజూరు
నెలరోజులుగా విజిలెన్స్ దర్యాప్తు
అనకాపల్లి : వాహనాన్ని నడుపుతున్నప్పుడు అప్రమత్తంగా వ్యవహరించాలి. ముఖ్యమైన కూడళ్లలో సిగ్నల్స్‌ను గమనించాలి. మలుపుల్లో ప్రమాద హెచ్చరికలను అర్థం చేసుకోవాలి. అందుకే ట్రాన్స్‌పోర్ట్ లెసైన్స్ బ్యాడ్జి పొందాలంటే కనీస విద్యార్హత ఉండాలి. కానీ ఈ నిబంధన ఎక్కడా అమలు కాదు. డబ్బులిస్తే చాలు విద్యార్హతలను పరిశీలించరు. క్షేత్రస్థాయి దర్యాప్తు జరపరు. ట్రాన్స్‌పోర్టు లెసైన్స్‌లు జారీ చేస్తారు. అనకాపల్లి ఆర్టీవో కార్యాలయంలో కొన్నాళ్లుగా జరుగుతోందిదే. ఆర్టీవో మహ్మద్ సలీమ్ సహా కార్యాలయ పరిపాలనాధికారి నర్సింహులు, సీనియర్ అసిస్టెంట్ నాగమణిల సస్పెన్షన్‌కు కారణమిదే. వీరిని సస్పెండ్ చేస్తూ రవాణా శాఖ కమిషనర్ శుక్రవారం జారీ చేసిన ఉత్తర్వులతో కలకలం రేగింది.
అక్రమాలపై కమిషనర్‌కు ఫిర్యాదు: ట్రాన్స్‌పోర్టు లెసైన్సుల జారీలో సంబంధీకుల విద్యార్హత ధ్రువీకరణ పత్రాలపై క్షేత్రస్థాయి దర్యాప్తు జరపకుండా బ్యాడ్జీలను ఇస్తున్నారని ఓ వ్యక్తి నేరుగా ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ సుబ్రహ్మణ్యంకు ఫిర్యాదు చేశారు. ఆశాఖ ఉన్నతాధికారులృబందం అనకాపల్లి కార్యాలయంలో విచారణ చేపట్టింది. ఇటీవల విశాఖ పర్యటనకు వచ్చిన కమిషనర్ కూడా పరిస్థితిపై ఆరా తీశారు. ప్రధానంగా జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో జారీ చేసిన 312 లెసైన్సులకు సంబంధించిన 97 ఫైళ్ల అదృశ్యంపై ఉన్నతాధికారులు, విజిలెన్స్‌ృబందం నెలరోజులపాటు దర్యాప్తు చేపట్టారు.
అధిక సంఖ్యలో లెసైన్స్‌ల బ్యాడ్జీ నంబర్‌లు నిబంధనలకు విరుద్ధంగా మంజూరు చేసినట్టు గ్రహించారు. విచారణలో నివేదికలనుబట్టి ఇందులో అనకాపల్లి ఆర్టీవో మహ్మద్ సలీమ్, ఏవో నర్సింహులు, సీనియర్ అసిస్టెంట్ నాగమణిల ప్రమేయం ఉన్నట్టు రుజువైంది. లెసైన్స్ బ్యాడ్జీల నంబర్‌ల మంజూరులో అక్రమాల డొంక బయటపడే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. బ్యాడ్జి నంబర్ల అవినీతి అనకాపల్లి కార్యాలయానికి పరిమితం కాదని అన్ని కార్యాలయాలలో ఇదే పరిస్థితి ఉందని బహిరంగంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. మూడేళ్లుగా రికార్డులు పరిశీలిస్తే నిబంధనలకు విరుద్ధంగా వందల సంఖ్యలో బ్యాడ్జీ నంబర్‌ల జారీ ఉంటుందన్న వాదన వ్యక్తమవుతోంది. అయితే కమిషనర్ బ్యాడ్జీ నంబర్‌లపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించారని తెలిసింది. విశాఖ, గాజువాక కార్యాలయాలలో ఆరా తీసే అవకాశం ఉందని సమాచారం.
నా తప్పేమీ లేదు: ఆర్టీవో సలీం : బ్యాడ్జీల వివాదంలో తన తప్పులేదని ఆర్టీవో సలీం పేర్కొన్నారు. కిందిస్థాయిలో జరుగుతున్న అవకతవకలను గుర్తించి వెలుగులోకి తీసుకువచ్చానన్నారు. అయినా తనను శిక్షించారని, దేవుడే ఈ సమస్యకు పరిష్కారం చూపుతాడన్నారు. కాలమే సమాధానం చెబుతుందన్నారు.
అడ్డగోలుగా రైట్ రైట్..
Published Sat, May 30 2015 3:31 AM | Last Updated on Sun, Sep 3 2017 2:54 AM
Advertisement