సాక్షి ప్రతినిధి, ఒంగోలు:
ఒంగోలు డెయిరీని అప్పుల్లో ముంచి సంక్షోభంలోకి నెట్టిన పాలకవర్గానికి అధికార పార్టీ ప్రజాప్రతినిధులు మద్దతుగా నిలవడంపై సొంత పార్టీ వర్గాల నుంచే వ్యతిరేకత పెల్లుబుకుతోంది. డెయిరీ విషయంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు దామచర్ల జనార్దన్‌తోపాటు అధికార పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేల వ్యవహార శైలిపై అధికార పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలే బహిరంగ విమర్శలకు దిగుతున్నారు. ఇక సాక్షాత్తు టీడీపీ అనుబంధ సంఘాలైన తెలుగు రైతు, టీఎన్‌టీయూసీలు సైతం అధికార పార్టీ శాసనసభ్యుల తీరుపై విమర్శలు గుప్పిస్తుండటం ఆ పార్టీ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది. డెయిరీని సంక్షోభం నుంచి గట్టెక్కించి వేలాది మంది రైతులు, ఉద్యోగులను ఆదుకోవాల్సిన పార్టీ నేతలు వారి గోడు పట్టించుకోకుండా డెయిరీ చైర్మన్‌కు ఆర్థిక సాయం అందించి, లాభం ఆర్జించి పెట్టేందుకు ప్రయత్నించడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
బుధవారం కొందరు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు డెయిరీ చైర్మన్ చల్లా శ్రీనివాసరావును ముఖ్యమంత్రి వద్దకు తీసుకెళ్లి డెయిరీకి ఆర్థిక సాయం చేయాలంటూ విన్నవించినట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న కొందరు టీడీపీ నేతలు, కార్యకర్తలు ప్రజాప్రతినిధుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘చైర్మన్ చల్లా శ్రీనివాసరావు పాలనలో ఒంగోలు డెయిరీ పతానవస్థకు చేరింది. 2014 వరకు లాభాల్లో ఉన్న డెయిరీ గత మూడేళ్లలో రూ.80 కోట్ల అప్పుల్లో కూరుకుపోయింది. పాల రైతులకు, ఉద్యోగులకు జీతాలిచ్చే పరిస్థితి లేకుండా పోయింది. దీనికి పాలకవర్గం అవినీతి అక్రమాలే కారణం’ అని సాక్షాత్తు అధికార పార్టీకి చెందిన తెలుగు రైతు, టీఎన్‌టీయూసీ నేతలు బహిరంగంగా విమర్శిస్తున్నారు. డెయిరీలో ప్రతిపక్ష పార్టీలు, ప్రజాసంఘాల పెత్తనం లేదు. అంతా అధికార పార్టీ పెత్తనమే. ఇక్కడి ఉద్యోగులు సైతం అధికార పార్టీ అనుబంధ సంఘం టీఎన్‌టీయూసీ పరిధిలో పని చేస్తున్నారు.
డెయిరీని ముంచింది ‘చల్లా’నే..
డెయిరీ పతానవస్థను కళ్లారా చూసిన ఉద్యోగులు, రైతులు చైర్మన్ చల్లా శ్రీనివాసరావు అవినీతికి పాల్పడ్డారని ఆరోపిస్తున్నారు. బహిరంగ విమర్శలకు సైతం దిగారు. డెయిరీలో జరిగిన అవినీతిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. గత 17 రోజులుగా టీఎన్‌టీయూసీ డెయిరీ వద్దే దీక్షలకు దిగింది. ఇంకా దీక్షలు కొనసాగుతున్నాయి. మరో వైపు రైతులు సైతం తమకు బకాయిలు చెల్లించకుండా పాలకవర్గం డెయిరీ ఆస్తులను కొల్లగొడుతోందని ఆరోపిస్తున్నారు.
తెలుగు రైతు, టీఎన్‌టీయూసీ మొర అరణ్య రోదన
అధికార పార్టీకి చెందిన తెలుగు రైతు, టీఎన్‌టీయూసీలు ఆరోపిస్తున్నా.. ఆ పార్టీ ప్రజాప్రతినిధులు వారి మొర ఆలకించడం లేదు. రైతులు, ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు ఇప్పించే ప్రయత్నం చేయడం లేదు. డెయిరీని తిరిగి సహకార చట్టంలోకి మార్చాలన్న వారి డిమాండ్‌ను పట్టించుకోవడం లేదు. మూడేళ్లలోనే డెయిరీ రూ.80 కోట్ల అప్పుల్లో మునగడానికి పాలకవర్గం అవినీతి అక్రమాలే కారణమని తెలిసినా అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, ఆ పార్టీ అధిష్టానం ఏ మాత్రం స్పందించడం లేదు. పైపెచ్చు డెయిరీ సంక్షోభానికి కారణమైన చల్లా శ్రీనివాస్‌ను ఆదుకునేందుకు వారు ప్రయత్నిస్తున్నారు తప్పితే రైతులను, ఉద్యోగులకు బాసటగా నిలిచి భవిష్యత్తులో మళ్లీ అవినీతి, అక్రమాలు జరగకుండా చూసే ప్రయత్నాలు చేయడం లేదు. ప్రజాప్రతినిధుల తీరుపై రైతులు, ఉద్యోగులతోపాటు అధికార పార్టీ కార్యకర్తలే ఆగ్రహం వ్యక్తం చేస్తుండటం గమనార్హం.
అధికారం.. అవినీతి పక్షమా!
Published Fri, Sep 29 2017 9:13 AM | Last Updated on Fri, Sep 29 2017 9:13 AM
Advertisement
Advertisement