పల్లె రఘునాథరెడ్డి జిల్లాలో ఇంటర్, డిగ్రీ, పీజీ, ఫార్మసీ, మేనేజ్‌మెంట్, ఇంజనీరింగ్, బీఈడీ, డీఎడ్ కోర్సుల పేరుతో 26 కళాశాలలను స్థాపించారు.
గిరిధర్ (పేరు మార్చాం) హిందూపురంలో సప్తగిరి డిగ్రీ కళాశాల (పల్లె రఘునాథరెడ్డికి చెందిన విద్యా సంస్థ)లో 2013-14 విద్యా సంవత్సరంలో డిగ్రీ పూర్తి చేశాడు. ఇతడు మొదటి సంవత్సరంలో రూ.8 వేలు ఫీజు కళాశాలలో చెల్లించాడు. ద్వితీయ సంవత్సరంలో రూ.8 వేలు కట్టాడు. తృతీయ సంవత్సరంలో రూ.9 వేలు చెల్లించాడు. ఈ విద్యార్థికి ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద మూడేళ్లకు కలిసి రూ.27 వేలు మంజూరైంది. గిరిధర్ కట్టిన ఫీజు రూ.25 వేలు, రీయింబర్స్‌మెంట్ మొత్తం రూ.27 వేలు కలిపితే మొత్తం రూ.52 వేలు అవుతుంది. గిరిధర్‌కు ఈ మొత్తంలో కేవలం రూ.6 వేలు మాత్రమే వెనక్కు చెల్లించారు. ఇతడికి ఇంకా రూ.19 వేలు వెనక్కు రావాల్సి ఉంది. రేపు...మాపు అంటూ తిప్పుకుంటున్నారు తప్ప ఇంతవరకు చెల్లించలేదు.
- ఇది జిల్లాలో పల్లె రఘునాథరెడ్డికి చెందిన విద్యా సంస్థల్లో విద్యార్థులు ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం పడుతున్న అగచాట్లకో ఉదాహరణ.
ఎస్కేయూ/అనంతపురం ఎడ్యుకేషన్, న్యూస్‌లైన్ : పల్లె రఘునాథరెడ్డి జిల్లాలో ఇంటర్, డిగ్రీ, పీజీ, ఫార్మసీ, మేనేజ్‌మెంట్, ఇంజనీరింగ్, బీఈడీ, డీఎడ్ కోర్సుల పేరుతో 26 కళాశాలలను స్థాపించారు. ఆ కళాశాలల్లో 7,457 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. పేద విద్యార్థులకు అండగా ఉండేందుకు దివంగత నేత డాక్టర్ వైఎస్.రాజశేఖర్‌రెడ్డి 2008 నుంచి ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని అమలు చేశారు. ఈ పథకం లక్షలాది మంది విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపింది. ఎంతో మంది పేద విద్యార్థులు ఈ పథకం కింద ఉన్నత విద్యకు దగ్గరై ఉన్నత శిఖరాలను అధిరోహించారు. కాగా కొన్ని కళాశాలల యాజమాన్యాలు ఈ పథకాన్ని వరంగా మలుచుకున్నాయి.
పభుత్వం నుంచి మంజూరైన నిధులను కాజేసి పేద విద్యార్థుల కడుపులు కొడుతున్నాయి. ఓవైపు విద్యార్థుల నుంచి ఫీజు కట్టించుకుని..రీయింబర్స్‌మెంట్ వచ్చిన తర్వాత వెనక్కు ఇస్తామని చెబుతూ చివరకు చేతులెత్తేస్తున్నాయి. కోర్సు పూర్తయిన విద్యార్థులు ఒకటి రెండుసార్లు కళాశాలకు వెళ్లి అడిగి తర్వాత మిన్నకుండి పోతున్నారు. గట్టిగా అడిగిన వారిపై బెదిరింపులకు దిగుతున్నారు. ఈ విషయంలో పల్లె రఘునాథరెడ్డికి చెందిన విద్యా సంస్థలు ముందు వరుసలో ఉన్నాయి. విద్యార్థుల నుంచి ప్రారంభంలోనే ట్యూషన్ ఫీజు రూపంలో డబ్బులు వసూలు చేసి, ఆ మొత్తాన్ని ఫీజు రీయింబర్స్‌మెంట్ రూపంలో ప్రభుత్వం నుంచి తిరిగి పొందిన తర్వాత విద్యార్థులకు అప్పగించాలి. ‘పల్లె’ విద్యా సంస్థల్లో ఈ పరిస్థితి కనిపించడం లేదు. విద్యార్థులతో కట్టించుకున్న మొత్తం చెల్లించడం లేదు. గట్టిగా అడిగిన విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. 2009 నుంచి 2014 వరకు పల్లె రఘునాథ రెడ్డికి చెందిన అన్ని కళాశాలల్లోనూ సుమారు రూ.20 కోట్లకు పైగా ఫీజు రీయింబర్స్‌మెంట్ స్వాహా చేసినట్లు బహిరంగ ఆరోపణలు వినిపిస్తున్నాయి.
2008 నుంచే దోపిడీకి శ్రీకారం
ప్రారంభ రోజుల్లోనే పథకానికి తూట్లు పొడిచేందుకు పథకం రచించారు. అందులో భాగంగా విద్యార్థులకు ఈ నిధులు చేరకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసేసుకున్నారు. ఒక వైపు విద్యార్థులతో సన్నిహితంగా మెలుగుతూనే తన రాజకీయ జీవితానికి ఉన్నత బాటలు వేసుకున్న విద్యాసంస్థల అధినేత.. మరో వైపు దోపిడీకీ శ్రీకారం చుట్టారు. ఈ లావాదేవీల్లో తన పాత్ర లేనట్టుగా ప్రిన్సిపాళ్లను, అధ్యాపకులను అడ్డు పెట్టుకుని రూ.కోట్లు దండుకున్నారు. విద్యార్థులు ఈ విషయాన్ని పసిగట్టినా.. వారు నోరు తెరిచి అడిగే పరిస్థితి లేదు. 2008-2009 విద్యా సంవత్సరం నుంచి 26 కళాశాలల్లో విధులు నిర్వహిస్తున్న బోధన, బోధనేతర సిబ్బంది వ్యక్తిగత ఖాతాలను పరిశీలిస్తే ఈ మొత్తం అవినీతి బాగోతం బయటపడే అవకాశం ఉందని బాధితులు చెబుతున్నారు.
దోపిడీ పర్వం ఇలా
విద్యార్థితో ఫీజు మొత్తాన్ని విద్యా సంవత్సరం ప్రారంభంలోనే కట్టించుకుంటారు. ఆ తర్వాత ప్రభుత్వం నుంచి ఫీజు రీయింబర్స్‌మెంట్ వచ్చినా విద్యార్థి ఖాతాలో నేరుగా జమ చేయకుండా చేతికి ఇస్తామని చెబుతారు. రెండోది విద్యార్థి ఫీజును ‘ఖాతా చెక్కు’ రూపంలో కాకుండా తద్భిన్నంగా ‘బేరర్ చెక్’ రూపంలో ఇచ్చి నగదును యాజమాన్యమే డ్రా చేసుకుంటోందని విద్యార్థులు చెబుతున్నారు.
ఇవీ ‘పల్లె’ విద్యా సంస్థలు
బాలాజీ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, బాలాజీ డీఎడ్ కళాశాల, పీఆర్‌ఆర్ మేనేజ్‌మెంట్ కళాశాల, పీవీకేకే డిగ్రీ, పీజీ కళాశాల, పీవీకేకే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, సప్తగిరి డిగ్రీ కళాశాల(హిందూపురం), సప్తగిరి జూనియర్‌కళాశాల (హిందూపురం), ఎస్‌బీసీఆర్‌ఎం జూనియర్‌కాలేజ్ (కదిరి), ఎస్‌డీఆర్‌ఆర్ డిగ్రీ కళాళాల (ముదిగుబ్బ), ఎస్‌డీఆర్‌ఆర్ జూనియర్ కళాశాల (ముదిగుబ్బ), శ్రీబాలాజీ పీజీ కళాశాల (అనంతపురం), శ్రీబీఆర్‌ఎస్‌ఆర్ జూనియర్ కాలేజీ (కదిరి), శ్రీ సాయి డిగ్రీ కళాశాల (గుత్తి), శ్రీసాయి జూనియర్‌కళాశాల (గుత్తి), శ్రీవివేకానంద డిగ్రీ, పీజీ కళాశాల (కదిరి), శ్రీ వివేకానంద జూనియర్ కళాశాల (కళ్యాణదుర్గం), శ్రీనివాస డిగ్రీ, పీజీ కళాశాల (ధర్మవరం), స్వామి వివేకానంద డీఎడ్ కళాశాల (కళ్యాణదుర్గం), స్వామి వివేకానంద డిగ్రీ కళాశాల (కళ్యాణదుర్గం), స్వామి వివేకానంద బీఈడీ కళాశాల (కళ్యాణదుర్గం), వెంకటేశ్వర బీఈడీ కళాశాల (కదిరి), వెంకటేశ్వర డీఈడీ కళాశాల (కదిరి), శ్రీ బాలాజీ ఎంబీఏ కళాశాల (అనంతపురం), శ్రీ సత్యసాయి డీఈడీ కళాళాల (పెనుకొండ), శ్రీ సాయి డీఈడీ కళాశాల (గుత్తి).
గోల్‌మాల్ జరగలేదు
మా విద్యాసంస్థలకు సంబంధించి విద్యార్థులకు ప్రభుత్వం అందించే ఫీజు రీయింబర్‌సమెంట్ విషయంలో ఎటువంటి గోల్‌మాల్ జరగలే దు. ఒక వేళ జరిగినట్లు రుజువు చే స్తే నేను ఏ శిక్షకైనా సిద్ధమే. ప్రభుత్వం నుంచి విద్యార్థుల ఖాతాలకు చేరాల్సిన మొత్తం విద్యార్థులకే చేరుతుంది. కళాశాలకు చెందాల్సిన మొత్తం కళాశాలకే చెందుతుంది. ఇందులో గోల్‌మాల్ జరిగేందుకు అవకాశమే లేదు. రాజకీయ నాయకులు మీద ఆరోపణలు రావడం సహజమే. విద్యార్థుల సొమ్ము ను స్వాహా చేయాల్సిన అవసరం మాకు రాలేదు.
- పల్లె రఘునాథరెడ్డి,
మాజీ ఎమ్మెల్యే, పుట్టపర్తి