
రాజకీయ రంగంలో సరికొత్త అధ్యాయాన్ని సృష్టిస్తూ.. వేల కిలోమీటర్ల దూరాన్ని సునాయాసంగా నడిచేస్తూ...2017 నవంబర్ 6వ తేదీన ఇడుపులపాయలో ఒక్క అడుగుతో ప్రారంభమైన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర మంగళవారానికి (నేడు) ఏడాది పూర్తి చేసుకుంటోంది. ప్రజల ప్రేమాభిమానాలే ఇంధనంగా అప్రతిహతంగా నడక కొనసాగిస్తూ తెలుగునాట రాజకీయాల్లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కేంద్రబిందువుగా మారారు.
సాక్షి ప్రతినిధి, ఏలూరు: జగన్ పాదయాత్ర... జన జాతరలా మారి పోయింది. ప్రజాభిమానం సంద్రంలా ఉప్పొంగుతుంటే ఆ ఉప్పెనలో తాము కొట్టుకుపోవటం ఖాయమనే ఆందోళన అధికార టీడీపీ వర్గాల్లో సుస్పష్టంగా కన్పిస్తోంది. ఇటీవల విశాఖలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై టీడీపీ నేతల కనుసన్నలో జరిగిన హత్యాయత్నమే ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. జగన్‌పై జరిగిన హత్యాయత్నంతో పాదయాత్రకు కొంత విరామం ప్రకటించాల్సి వచ్చింది. జగన్‌కువస్తున్న జనాభిమానాన్ని చూసి ఓర్వలేకే ఈ కుట్రలు పన్నారని సామాన్యుల నుంచి మేధావుల వరకూ అభిప్రాయపడుతున్నారు. ఉన్నతమైన కుటుంబంలో పుట్టినా ప్రజల కోసం తన ఆరోగ్యాన్ని కూడా లెక్కచేయకుండా రాత్రి, పగలు తేడా లేకుండా ప్రజల మధ్య గడుపుతున్న జగన్‌పై జరిగిన కుట్ర తమకు బాధ కలిగించిందని వారు స్పష్టం చేస్తున్నారు.
పశ్చిమలో ప్రజాసంకల్పం
ప్రజా సంకల్ప పాదయాత్ర పశ్చిమలో ప్రవేశించిన నాటినుంచీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. పట్టణాలు, పల్లెలు వైఎస్ జగన్ కోసం పరవశించాయి. కృష్ణా జిల్లా నుంచి పాదయాత్ర 160వ రోజు మే 13వ తేదీన జిల్లాలోకి వేలాదిమంది అభిమానులు, కార్యకర్తలు, జనసందోహం మధ్య ప్రవేశించింది. కొల్లేరు ప్రాంతం కోలాహలంగా మారింది. ఏలూరు నియోజకవర్గం సుంకరవారితోట ప్రాంతంలో జగన్ పాదయాత్ర 2వేల కిలోమీటర్ల మైలురాయిని అధిగమించింది. అక్కడ భారీ పైలాన్‌ను జగన్ ఆవిష్కరించి ముందుకు సాగారు. ఏలూరు పాతబస్టాండ్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు నేల ఈనిందా అన్న చందంగా జనం హాజరయ్యారు.
టీడీపీ ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అవినీతి, అక్రమాలపై ధ్వజమెత్తుతూ వైఎస్ జగన్ చేసిన ప్రసంగానికి ప్రజలు ఈలలు, హర్షద్వానాలతో మద్దతు తెలిపారు. బహిరంగ సభలో ఆటోడ్రైవర్లకు ఏడాదికి రూ.10వేలు ఆర్థిక సహాయం అందజేస్తానని జగన్ చేసిన ప్రకటన ఆ వర్గాలను ఆనందంలో ముంచెత్తింది. దెందులూరు నియోజకవర్గంలో టీడీపీ నేతలు ప్రజలను పాదయాత్రకు వెళ్ళకుండా అడ్డుకున్నా ప్రజాసంకల్పాన్ని నిలువరించలేకపోయారు. దెందులూరులో రైతన్నలతో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో రైతులపై జగన వరాల జల్లు కురిపించారు. నాయీ బ్రాహ్మణులు నిర్వహించే హెయిర్ సెలూన్లలో విద్యుత్ బిల్లులపై రాయితీ ప్రకటించటంపై ఆ వర్గాల్లో హర్షం వ్యక్తమయింది.
ఉండి నియోజకవర్గం చినకాపవరంలో ఆక్వా రైతులు తాము పడుతోన్న కష్టాలను వైఎస్ జగన్‌కు వివరించారు. ఆక్వా రైతులకు విద్యుత్ చార్జీల్లో యూనిట్ రూ.1.50కి అందిస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా ఆక్వా ఉత్పత్తులను నిల్వ ఉంచేందుకు ప్రతీ మండలంలోనూ కోల్డ్ స్టోరేజీలు నిర్మిస్తానని వైఎస్ జగన్ ఆక్వా రైతుల ఆత్మీయ సమావేశంలో ప్రకటించారు. నరసాపురం నియోజకవర్గంలో మత్స్యకారులపై జగన్ వరాల జల్లు కురిపించారు. మత్స్యకారులకు కొత్తబోట్లు రిజిస్ట్రేషన్లు చేయించటంతోపాటు, డీజిల్‌ను సబ్సిడీకి అందిస్తామన్నారు. వేట విరామ సమయంలో ప్రతి కుటుం బానికీ రూ.10వేలు ఇస్తామని హామీ ఇచ్చారు.
నిండు నూరేళ్ళూ చల్లగా ఉండాలి
ఆటో కార్మికుల కష్టాలు చూసిన జగన్‌మోహనరెడ్డి అడగకుండానే వరాలు కురిపించారు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన రుసుముల్లో 50 శాతం తగ్గిస్తానని, ఆటోవాలాలను ఆర్థికంగా ఆదుకోవడానికి ఏడాదికి రూ.10 వేలు ఇచ్చే ఏర్పాటు చేస్తాననడం జగన్ ప్రజా సంక్షేమం కోసం ఎంతగా తపన పడుతున్నారో తెలుపుతోంది. అటువంటి మహోన్నత వ్యక్తిపై హత్యాప్రయత్నం జరగడం దారుణం. ప్రజా సంక్షేమం కోసం నిత్యం ప్రజల్లో ఉంటున్న వ్యక్తి నేడు ఆసుపత్రిపాలుకావడం దురదృష్టకరం.
– బుద్దా నాగ సూరిబాబు,ఏఐటీయూసీ అనుబంధ ఆటో యూనియన్ జిల్లా అధ్యక్షుడు
జగనన్న త్వరగా కోలుకోవాలి
ఎండనకా, వాననకా, రేయనకా, పగలనకా, ప్రజల సమస్యలు తెలుసుకోవడమే లక్ష్యంగా సంవత్సర కాలంపాటు ముఖంలో చిరునవ్వు తగ్గకుండా నిత్వం ప్రజల్లో ఉంటూ పాదయాత్ర చేస్తున్న మా జగనన్న కత్తి దాడిలో గాయపడ్డాడని తెలిసి నా మనస్సు చెప్పలేని బాధపడింది. కత్తిపోటు బాధ చెప్పుకోలేనిది. ఉన్నతమైన కుటుంబంలో పుట్టిన జగన్ ఇప్పటికే ప్రజల కోసం తన ఆరోగ్యాన్ని కూడా లెక్కచేయకుండా రాత్రి, పగలు తేడా లేకుండా ప్రజల కోసం పనిచేస్తున్నారు. కత్తిపోటుతో బాధపడుతూ ఏ స్థితిలో ఉన్నారో అర్థం కావడంలేదు. ఆయన త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నా.
– ధర్ముల బాబురావు, గిరిజనుడు, సిద్ధప్పగూడెం
మాట తప్పని కుటుంబం
వైఎస్ కుటుంబం మాట తప్పనిది. వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్రలో జిల్లాకు వచ్చినప్పుడు పశ్చిమ డెల్టాలో నీటి కాలుష్యం గురించి వివరించాం. వినతిపత్రం అందజేశాం. ముఖ్యమంత్రి అయిన వెంటనే వెంకయ్య వయ్యేరు కాలువ కాలుష్యం నుండి ప్రజల్ని రక్షించేందుకు రూ.30 కోట్ల పైప్‌లైన్ నిర్మాణానికి మంజూరు చేశారు. పనులు నేటికీ నత్తనడకన సాగుతున్నాయి. వైఎస్.జగన్ దృష్టికి ఇదే విషయాన్ని తీసుకువెళ్లగా తమ ప్రభుత్వం వచ్చిన తరువాత మంచినీటి వ్యవస్థను మెరుగు పరుస్తామని చెప్పారు. జగన్‌పై హత్యాయత్నం జరగడం దారుణం.
– మోటుపల్లి గంగాధరరావు, సీనియర్ నాయకుడు, ఆకివీడు
Comments
Please login to add a commentAdd a comment