ఎస్పీ అశోక్‌కుమార్ బదిలీ
కడప అర్బన్ : జిల్లా ఎస్పీగా పనిచేస్తున్న జీవీజీ అశోక్‌కుమార్‌ను విజయవాడ అడ్మిన్ డీసీపీగా బదిలీ చేశారు. రాజకీయ కారణాలతో ఎనిమిదిన్నర నెలలకే ఆయనపై బదిలీవేటు పడింది. గత సంవత్సరం అక్టోబరు 30న బాధ్యతలు చేపట్టిన ఎస్పీ అశోక్‌కుమార్ తనదైన ముద్ర వేశారు. గత సంవత్సరం నుంచి సమైక్యాంధ్ర ఉద్యమం, స్థానిక, సార్వత్రిక ఎన్నికల్లో కూడా నిష్పక్షపాతంగా వ్యవహరించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి భద్రతా చర్యలు చేపట్టి ప్రశంసలు అందుకున్నారు. పోలీసు సిబ్బంది సంక్షేమం కోసం యోగా, ధ్యానం, ఆరోగ్య భద్రతలపై పోలీసు దర్బార్‌ను నిర్వహించారు.
గీవెన్‌సెల్‌ను నిర్వహించి తన దగ్గరికి వచ్చే వారి బాధలను ఓపికగా విచారించి సంబంధిత అదికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసేవారు. ఓబులవారిపల్లె మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన అగంతకుడు వెంకట రమణను అరెస్టు చేయడంలో ప్రత్యేక బృందాలతో అహర్నిశలు శ్రమించారు. ఇటీవల కాలంలో ఆరుగురిపై పీడీ యాక్టులను నమోదు చేసి పేరుమోసిన అంతర్జాతీయ, జాతీయ స్థాయి స్మగ్లర్లను రాజమండ్రికి తరలింపజేశారు.
పోలీసుల సంక్షేమంలో భాగంగా పోలీసు పెరేడ్ గ్రౌండ్‌లో అమర వీరుల స్థూపం నిర్మాణం, ప్రతి పోలీసుస్టేషన్ కంప్యూటరీకరణ చేయించడంలో కీలకపాత్ర వహించారు. డయల్ 100తోపాటు పీసీఆర్‌ను అనుసంధానం చేసి జిల్లా వ్యాప్తంగా ప్రతి ఫిర్యాదును స్వీకరించేలా చర్యలు తీసుకున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ‘శభాష్’ అనిపించుకున్నారు. అలాంటి ఎస్పీ బాధితులు చేపట్టిన ఎనిమిదిన్నర నెలలకే బదిలీ కావడం సర్వత్రా చర్చనీయాంశమైంది.
జిల్లా ఎస్పీగా నవీన్ గులాఠి
వైఎస్సార్ జిల్లా ఎస్పీగా నవీన్ గులాఠి నియమితులయ్యారు. ఈయన 2008 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన అధికారి. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా ఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇక్కడ పనిచేస్తున్న ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్ విజయవాడ అడ్మిన్ డీసీపీగా బదిలీ కావడంతో ఆయన స్థానంలో ఎస్పీగా బదిలీ అయ్యారు. రెండు, మూడు రోజుల్లో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు.