త్వరలో సబిత పాదయాత్ర | sabitha indra reddy padayatra soonly | Sakshi
Sakshi News home page

త్వరలో సబిత పాదయాత్ర

Published Sun, Dec 29 2013 3:08 AM | Last Updated on Wed, Mar 28 2018 10:59 AM

sabitha indra reddy padayatra soonly

సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: మహేశ్వరం నియోజకవర్గంలో మరోసారి పట్టు నిలుపుకునేందుకు మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి వ్యూహరచన చేస్తున్నారు. కొన్నాళ్లుగా స్తబ్దుగా ఉన్న ఆమె.. వచ్చే నెలాఖరులో నియోజకవర్గంలో పాదయాత్ర నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నారు. సీబీఐ కేసుల నేపథ్యంలో మంత్రి పదవికి రాజీనామా చేసిన చేవెళ్ల చెల్లెమ్మ... జిల్లా రాజకీయాల్లో కూడా మునుపటి తరహాలో చొరవ చూపడంలేదు. అయితే, ఇటీవల మహేశ్వరం నియోజకవర్గంలో టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు తీగల కృష్ణారెడ్డి, దేప భాస్కరరెడ్డి యాత్రలు నిర్వహించడంతోపాటు.. మూడు నెలల క్రితం జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఆ పార్టీలు మంచి ఫలితాలను సాధించాయి. మరోవైపు తెలంగాణ ఉద్యమం కూడా ఊపందుకోవడంతో నియోజకవర్గ పర్యటనకు కాసింత దూరం పాటించారు.

 కాగా, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో రాజకీయ సమీకరణలు మారిపోయాయి. రాష్ట్ర విభజనతో మళ్లీ అధికారం ఖాయమనే సంకేతాలు వస్తుండడంతో.. ఇదే అదనుగా ప్రతి పల్లెకు పాదయాత్ర చేపట్టాలని సబిత భావిస్తున్నారు. అసెంబ్లీలో తెలంగాణ బిల్లుపై జనవరి 23న చర్చ ముగిసిన అనంతర ం నియోజకవర్గ పర్యటనకు షెడ్యూల్ ఖరారు చేసుకునే దిశగా ఆలోచన చేస్తున్నారు. అప్పటినుంచి ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే వరకు ప్రజలతో మమేకం కావడం ద్వారా పూర్వవైభవం సంపాదించుకోవచ్చని అంచనా వేస్తున్నారు. అభివృద్ధి, తెలంగాణ అంశం తమను విజయతీరాలకు చేరుస్తుందని భావిస్తున్న ఆమె... వీటినే ప్రచారాస్త్రాలుగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని యోచిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement