సాక్షి, కాకినాడ : త్యాగాలకు వెనుకాడకుండా సమైక్య రాష్ట్రం కోసం ఉద్యమించాలని సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక పిలుపునిచ్చింది. సమైక్యాంధ్ర ఉద్యమానికి దిశానిర్దేశం చేసేందుకు జిల్లా స్థాయిలో ఏర్పాటైన సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక తొలి కార్యక్రమం కాకినాడలో సోమవారం జరిగింది. జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన వివిధ వర్గాల ప్రజలు, అన్ని శాఖల ఉద్యోగులు జేఏసీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ నుంచి భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం బాలాజీచెరువు సెంటర్‌లో జరిగిన సభలో జేఏసీ చైర్మన్ బూరిగ ఆశీర్వాదం మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, 12లోగా రాజీనామాలు సమర్పించి ‘సైమైక్య’ ఉద్యమ బాట పట్టకుంటే అదేరోజు అర్ధరాత్రి నుంచి మెరుపు సమ్మెకు దిగుతామన్నారు. కార్యదర్శి పితాని త్రినాథరావు మాట్లాడుతూ రాష్ట్రాన్ని విడగొట్టాలన్న ఆలోచనకు జేఏసీ చెక్ పెడుతుందన్నారు. మెరుపుసమ్మె తో అత్యవసర సర్వీసులు మినహా పరిపాలనను స్తంభింపజేస్తామన్నారు. కమిటీలు వేసి డివిజన్‌స్థాయిలో ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామన్నారు. కాంగ్రెస్ అనుచిత నిర్ణయం వల్ల వారంరోజుల వ్యవధిలో 42 మంది మరణించారన్నారు. ప్రజలు బియ్యం, కిరాణా సామాన్లు ముందుగానే కొనుగోలు చేసుకుని సమ్మెకు సహకరించాలన్నారు.
విభజించి పాలించడమే కాంగ్రెస్ నీతా?
మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ విభజించిన రోజునుంచే రాష్ట్రానికి దుర్దినాలు ప్రారంభమయ్యాయన్నారు. ఎన్నికల్లో లబ్ధి కోసం ఏకపక్ష కుట్రతో విభజనకు పాల్పడ్డారని ధ్వజమెత్తారు. కొత్త రాజధాని ఎక్కడనేది చెప్పలేని ప్రభుత్వం రాష్ట్ర ఏర్పాటుకు ఆతృత ప్రదర్శించడం సిగ్గుచేటన్నారు. సామాన్యుడు జబ్బు పడితే తెల్లకార్డుతో నిమ్స్‌కు వెళ్లి చికిత్స కూడా చేయించుకోలేని దుస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉత్తుత్తి రాజీనామాలు చేస్తున్నారని ఆరోపించారు. రాజీనామా పత్రం ఎవరికి ఇవ్వాలో తెలియని అజ్ఞానంలో కొందరు నేతలు ఉండడం దురదృష్టకరమన్నారు. విభజన విషయంలో చంద్రబాబు నాయుడు పాత్ర అనుమానాస్పదంగా ఉందన్నారు. పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యుడు జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు ఆత్మత్యాగంతో ఏర్పడిన రాష్ట్రాన్ని రాజకీయ దురుద్దేశంతో రెండు ముక్కలు చేస్తే సహించేది లేదన్నారు. విభజనతో రాష్ట్రం దుస్థితికి నెట్టివేయబడుతుందన్నారు.
ఒక ఉద్యమకారునిగా జేఏసీకి మద్దతు పలుకుతున్నానన్నారు. కాకినాడ తాజా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ ఉద్యమ కసి రగలాలంటే మంత్రు లు, ఎంఎల్‌ఏలు స్పీకర్ ఫార్మేట్‌లో రాజీనామాలు చేయాలన్నారు. జేఏసీ ఉద్యమాలకు పార్టీ జెండా లు పక్కనబెట్టి నాయకులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. సుజనాచౌదరి వంటి నేతలు రాజీనామాలు చేసినా రెండు రాష్ట్రాలు ఉండడం తప్పుకాదంటున్నారని, ఇది తెలుగుదేశం పార్టీ నైజాన్ని బయటపెడుతోందని విమర్శించారు. జేఏసీ కార్యక్రమాలకు తమ తోడ్పాటు అందిస్తామన్నారు. టీడీపీ, కాంగ్రెస్ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే పదవులకు రాజీ నామా చేసి ఉద్యమంలోకి రావాలన్నారు. ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూని యన్ ప్రతినిధి ఖాన్ మాట్లాడుతూ ఆరీ్టిసీలోని సంఘాలన్నీ ఉమ్మడి కార్యచరణతో సమ్మె చేస్తాయని ప్రకటించారు. ఆర్టీసీకి నష్టం కలగకుండా ఉద్యమాన్ని సాగించాలన్నారు. టీడీపీ నేత పోతుల విశ్వం సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతు ప్రకటించారు.
తన విద్యా సంస్థలలో 7వేల మంది విద్యార్థులు జేఏసీ ఎప్పుడు పిలిచినా వస్తారన్నారు. మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మాట్లాడుతూ జేఏసీ నిర్ణయం మేరకు ఉద్యమంలో పాల్గొంటామన్నారు. జేఏసీ మాజీ అధ్యక్షుడు ఆచంట రామారాయుడు, ఎమ్మె ల్సీ బొడ్డు భాస్కరరామారావు, వైఎస్సార్‌సీపీ జిల్లా కన్వీనర్ కుడుపూడి చిట్టబ్బాయి, పార్టీ పార్లమెంట్ నియోజకవర్గ నాయకుడు చలమలశెట్టి సునీల్, నగర కన్వీనర్ ఫ్రూటీకుమార్, జెడ్పీ మాజీ చైర్మన్ చెల్లుబోయిన వేణు, వైఎస్సార్ సీపీ కోఆర్డినేటర్లు చింతా కృష్ణమూర్తి, మిండగుదిటి మోహన్, కొండేటి చిట్టిబాబు, విప్పర్తి వేణుగోపాల్, తోట సుబ్బారావునాయుడు, వివిధ విభాగాల కన్వీనర్లు కర్రి పాపారాయుడు, గుత్తుల రమణ, శెట్టిబత్తుల రాజబాబు, రావూరి వెంకటేశ్వరరావు, అధికారప్రతినిధి పి.కె. రావు, జేఏసీ ప్రతినిధులు పిల్లి సత్యనారాయణమూర్తి, సుబ్బారావు, ఉదయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
త్యాగాలకు సిద్ధం కండి
Published Tue, Aug 6 2013 2:15 AM | Last Updated on Fri, Sep 1 2017 9:40 PM
Advertisement
Advertisement