నేడే ‘సమైక్య’ సభ
సమైక్యవాదం వినిపించటానికి సీమాంధ్ర ఉద్యోగులు శనివారం ఎల్‌బీ స్టేడియంలో నిర్వహించతలపెట్టిన ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభకు.. ఉద్రిక్త వాతావరణం మధ్య భారీ భద్రతతో సహా ఏర్పాట్లు పూర్తయ్యాయి. మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కానున్న సభను సాయంత్రం ఐదు గంటల కల్లా ముగించాలని పోలీసులు గడువు విధించారు. గడువులోగా సభను ముగించటానికి ప్రయత్నించాలని.. సాధ్యం కాకుంటే గడువు పొడిగించేందుకు అప్పటికప్పుడు పోలీసులకు విజ్ఞప్తి చేయాలని ‘సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక’ సమన్వయ కమిటీ నిర్ణయించింది. సభను కేవలం ఉద్యోగులకే పరిమితం చేశారు. ఉద్యోగులు తమ గుర్తింపు కార్డుతో పాటు నిర్వాహకులు ఇచ్చిన ప్రత్యేక కార్డు చూపించిన తర్వాతే పోలీసులు సభా ప్రాంగణంలోనికి అనుమతిస్తారు. సభా ప్రాంగణంలోకి వెళ్లటానికి రెండు గేట్లు ఉన్నాయి. సగం జిల్లాలను ఒక గేట్ నుంచి, మిగతా జిల్లాలను మరో గేట్ నుంచి ఉద్యోగులు ప్రవేశించాలని జేఏసీ నేతలు ఆయా జిల్లాల నేతలకు సూచించారు. రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులను కూడా సభకు అనుమతించరు.
సమన్వయ కమిటీలో ఉన్న ఉద్యోగ, కార్మిక సంఘాల నేతలతో పాటు.. ‘విభజన’ వల్ల జరిగే నష్టాలను వివరించేందుకు కొంతమంది వివిధ రంగాల నిపుణులకు కూడా సభలో ప్రసంగించే అవకాశం ఇస్తారు. లక్ష మంది ఉద్యోగులు సభకు హాజరవుతారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. ఉద్యోగులు కాని వారు స్టేడియం వెలువల నిలబడి సంఘీభావం తెలిపే అవకాశముంది. ఉదయం 11 గంటల నుంచే ఉద్యోగులను స్టేడియం లోనికి అనుమతిస్తారు. బ్యాగులు, నీళ్ల సీసాలు లోనికి తీసుకెళ్లడానికి వీలుండదు. స్టేడియంలోనే భోజనం, మంచినీరు ఏర్పాట్లు చేస్తున్నారు. సభా ప్రాంగణానికి పొట్టిశ్రీరాములు, సభా వేదికకు బూర్గుల రామకృష్ణారావు, స్టేడియం ద్వారాలకు కొమరం భీమ్, బెజవాడ గోపాలరెడ్డి, శ్రీకృష్ణదేవరాయ, సురవరం ప్రతాపరెడ్డి, అల్లూరి సీతారామరాజు, సాంస్కృతిక వేదికకు గురజాడ అప్పారావు పేర్లు పెట్టారు.
పారామిలటరీ పహారాలో స్టేడియం: ఏపీఎన్‌జీవోల సభకు పోలీసులు పటిష్ట భద్రతాచర్యలు చేపట్టారు. ఎల్‌బీ స్టేడియం లోపలికి ఉద్యోగులు మినహా ఇతరులెవరూ అడుగుపెట్టకుండా పూర్తిగా పారా మిలటరీ పహారా ఏర్పాటుచేస్తున్నారు. స్టేడియానికి వెళ్లే నాలుగు మార్గాలనూ పోలీసులు ఆధీనంలోకి తీసుకున్నారు. స్టేడియానికి రెండు కిలోమీటర్ల పరిధి నుంచే ఇనుప కంచెలు, బారికేడ్‌లను ఏర్పాటుచేస్తున్నారు. సభకు వచ్చే ఉద్యోగులు ర్యాలీలుగా రాకూడదని, రోడ్ల వెంట నినాదాలు చేయకూడదని పోలీసుశాఖ ఇప్పటికే సూచించింది. ఏపీఎన్‌జీవో సభకు ఆటంకం కలిగించేందుకు తెలంగాణవాదులెవరూ స్టేడియం వరకూ చేరుకోకుండా పోలీసులు అంచెలవారీగా భద్రత ఏర్పాటుచేశారు. ఆందోళనకారులెవరైనా ఈ వలయాన్ని దాటి స్టేడియం సరిహద్దులోకి చేరుకుని నిరసన తెలిపిన పక్షంలో తక్షణమే అరెస్టుచేసి తరలించేందుకు పోలీసు పార్టీలను ఏర్పాటుచేస్తున్నారు. మొబైల్ కెమెరాలను కూడా ఏర్పాటుచేసి నిరంతర నిఘా పెడుతున్నారు. కొందరు పోలీసులు సాధారణ దుస్తుల్లో కూడా స్టేడియం లోపల ఉండే ఏర్పాట్లుచేశారు.
అవగాహనాసదస్సు మాత్రమే: అశోక్‌బాబు
ఒక ఉద్యమం వల్ల మరో ఉద్యమం పలచబడే అవకాశమే లేదని, సమైక్యవాదం వల్ల తెలంగాణ ఉద్యమం బలహీనపడుతుందని అనుకోవటం పొరపాటని ఏపీఎన్‌జీవో సంఘం అధ్యక్షుడు, ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభ సమన్వయ కమిటీ చైర్మన్ అశోక్‌బాబు పేర్కొన్నారు. ఆయన శుక్రవారం ఎల్‌బీ స్టేడియంలో విలేకరులతో మాట్లాడుతూ.. ఎవరినో కించపరచటానికో, రెచ్చగొట్టటానికో ఈ సభ నిర్వహించటంలేదని స్పష్టం చేశారు.
తమది కేవలం అవగాహనా సదస్సు మాత్రమేనని, తమ వాదనను వినిపించటానికే పరిమితమని చెప్పారు. సభను అడ్డుకుంటామంటూ వివిధ సంఘాలు, పార్టీలు చేసిన ప్రకటనలను ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి చేశారు. సభకు వచ్చే ఉద్యోగులను కొన్ని శక్తులు రెచ్చగొట్టే అవకాశం ఉందని, ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రతి స్పందించకుండా సంయమనం పాటించాలని అశోక్‌బాబు సూచించారు. సభ సజావుగా సాగటానికి సహకరించాలని మీడియాకు విజ్ఞప్తి చేశారు. సభ అనుమతి కోసం దరఖాస్తు చేసినప్పుడు 15 వేల మంది హాజరవుతారని అంచనా వేశామని, ఇప్పుడు లక్ష మంది వచ్చే అవకాశం ఉందంటే స్పందన ఎంతగా ఉందో అర్థమవుతుందని పేర్కొన్నారు. సీమాం ధ్ర న్యాయవాదులపై తెలంగాణ న్యాయవాదులు దాడి చేయటాన్ని ఖండిస్తున్నామన్నారు.
ఇదీ నాలుగంచెల భద్రత...
-
సీమాంధ్ర జిల్లాల నుంచి వచ్చే ఉద్యోగుల వాహనాలు, రైళ్లను తెలంగాణవాదులు అడ్డుకోకుండా మొబైల్ పోలీసులతో పెట్రోలింగ్. హైవేల్లో, రైల్వేస్టేషన్ల వద్ద నిరంతర పెట్రోలింగ్.
-
తెలంగాణ ప్రాంత జిల్లాల నుంచి నగరంలోకి భారీగా తరలిరాకుండా తనిఖీలు.
-
ఎల్‌బీ స్టేడియానికి రెండు కిలోమీటర్ల పరిధిలో పారా మిలటరీ బలగాలు. ఆందోళనకారులను గుర్తించేందుకు మొబైల్ వాహనాల్లో నిఘా కెమెరాలు.
-
స్టేడియం చుట్టూ లోపలికి వెళ్లే మార్గాల్లో తనిఖీలకు ఏపీఎస్‌పీ, ఏఆర్ సాయుధ పోలీసులు. స్టేడియం లోపలికి వెళ్లే ప్రధాన ద్వారాల వద్ద క్షుణ్ణంగా సాయుధ పోలీసులతో తనిఖీ.