
'సమైక్యనినాద బలం ఢిల్లీకి చూపిన శంఖారావం'
హైదరాబాద్: హైదరాబాద్లో నిన్న జరిగిన సమైక్య శంఖారావం బహిరంగ సభ సమైక్యవాద నినాద బలాన్ని ఢిల్లీకి చూపిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యవర్గ సభ్యుడు కొణతాల రామకృష్ణ చెప్పారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ప్రతికూల వాతావరణాన్ని కూడా లెక్కచేయకుండా సమైక్య శంఖారావానికి వచ్చినవారికి కృతజ్ఞతలు తెలిపారు. తెలుగుజాతి ఐక్యతకు వైఎస్ జగన్ చేస్తోన్న పోరాటానికి లక్షలాదిగా తరలివచ్చి మద్దతు తెలిపారన్నారు.
ఆఖరి నిమిషం వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమైక్య పోరాటం ఆగదని చెప్పారు. గాంధేయ మార్గంలో రాష్ట్ర సమైక్యతకు పోరాడతామన్నారు. సమైక్య నినాదం ఎంత బలంగా ఉందో శంఖారావం సభతో ఢిల్లీకి తెలిసిందని చెప్పారు. విభజనపై ఇకనైనా ఢిల్లీ పెద్దలు పునరాలోచించుకోవాలని కోరారు. తెలంగాణ నుంచి కూడా పెద్ద సంఖ్యలో జనం తరలి వచ్చినట్లు తెలిపారు. వ్యక్తిగత కారణాలతోనే కొందరు తెలంగాణ నేతలు హాజరుకాలేదని చెప్పారు.
భారీ వర్షాలకు నష్టపోయిన పంటలకు నష్టపరిహారంపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని కొణతాల డిమాండ్ చేశారు. వర్షాలతో చాలా జిల్లాలు నష్టపోయాయి. లక్షలాది ఎకరాల పంట నీట మునిగింది. కోస్తాలో ఇప్పటికీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. రైతులు, ప్రజలు ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. పునరావాస ఏర్పాట్లతో పాటు పంట నష్టపరిహారంపై ప్రభుత్వం స్పందించాలని ఆయన కోరారు.