
తెలుగు జాతికి, ఢిల్లీ పీఠానికి మధ్య పోరు: కొణతాల
హైదరాబాద్: సమైక్యంగా ఉంచడం ద్వారానే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కొణతాల రామకృష్ణ అన్నారు. తెలుగు జాతిని విడగొట్టేందుకు జరుగుతున్న ప్రయత్నాలను అడ్డుకోవాల్సిన అవసరముందన్నారు. ఎల్బీ స్టేడియంలో జరుగుతున్న సమైక్య శంఖారావంలో ఆయన ప్రారంభోపన్యాసం చేశారు. రాజకీయ సంక్షోభం తీసుకురావడం ద్వారానే విభజనను అడ్డుకోగలమన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను పడగొట్టినపుడే రాష్ట్ర విభజన ఆగుతుందన్నారు. విభజనకు పూర్తిగా ఫుల్ స్టాఫ్ పెట్టాల్సిన అవసరముందన్నారు.
తెలుగు జాతికి, ఢిల్లీ పీఠానికి మధ్య జరుగుతున్న పోరాటంలో తెలుగు ప్రజలదే విజయమని వ్యాఖ్యానించారు. విభజనపై ప్రజలను మభ్యపెడుతూ సీఎం కిరణ్ మోసం చేస్తున్నారని కొణతాల ఆరోపించారు. విభజన సాఫీగా జరిగిపోవడానికి సీఎం సహకరిస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణ తీర్మానం, బిల్లుపై గందరగోళ ప్రకటనలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. సమైక్య రాష్ట్రం కోసం చిత్తశుద్ధితో ప్రయత్నిస్తున్న నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక్కరేనని చెప్పారు.