'హైదరాబాద్ వేదికగా 19న సమైక్య శంఖారావం'
'హైదరాబాద్ వేదికగా 19న సమైక్య శంఖారావం'
Published Wed, Oct 2 2013 2:11 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
రాష్ట్ర రాజధాని హైదరాబాద్ వేదికగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ‘సమైక్య శంఖారావం’ సభను ఈనెల 19 తేదీన నిర్వహించనున్నట్లు ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమన్వయకర్త కొణతాల రామకృష్ణ ప్రకటించారు. ఈ సభకు సమైక్యవాదులంతా పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాల్సిందిగా హృదయపూర్వకంగా కోరుతున్నట్లు చెప్పారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
‘‘రాష్ట్ర రాజధాని నగరమైన హైదరాబాద్‌ను అన్ని ప్రాంతాల ప్రజలు కలిసి నిర్మించుకున్నారు. ఇక్కడ సభలు పెట్టుకునే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అన్ని ప్రాంతాల ప్రజలు ఉన్నందున విభజన వల్ల తలెత్తే నష్టాలను, సమైక్యం వల్ల కలిగే లాభాలను వివరించేందుకే ఇక్కడ సభ నిర్వహిస్తున్నాం. ఒక రాజకీయ పార్టీగా, ప్రజల పక్షాన ఉన్న వారిగా అందరికీ వివరించాల్సిన బాధ్యత మాపై ఉంది. అంతేకాని మరేఇతర విద్వేషాలు రెచ్చగొట్టేందుకు కాదు’’ అని కొణతాల స్పష్టం చేశారు. ఈ సమావేశానికి అందరూ సహకరించాలని, వేర్పాటువాదం కోరుకునే వ్యక్తులు సోదరభావంతో అర్థం చేసుకోవాలని విన్నవించారు.
ప్రజాస్వామ్యంలో ఒక రాజకీయపార్టీగా సమైక్య ఆవశ్యకత గురించి ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని, అందుకు హైదరాబాద్ సముచిత ప్రాంతంగా తమ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయించారని వివరించారు. రాష్ట్రం సమైక్యంగా ఉండటం వల్లే అభివృద్ధి సాధిస్తుందని పేర్కొన్నారు. మాను కోట ఘటన పునారావృతమవుతుందన్న కొందరు నేతల వ్యాఖ్యలను విలేకరులు ప్రస్తావించగా... అదంతా కృత్రిమమైనదన్నారు. అందులో పాల్గొన్నది ప్రజాశక్తులు కాదని, అప్పటి ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ కావాలనే వెనకుండి చేయించిదని పేర్కొన్నారు. అదే విధంగా సమైక్య శంఖారావం బస్సుయాత్ర సందర్భంగా షర్మిల చేసిన వ్యాఖ్యలకు కొందరు కావాలనే విపరీత అర్థాలు తీస్తూ, వక్రీకరిస్తున్నారని కొణతాల అన్నారు. ‘‘హైదరాబాద్ దేశంలో అంతర్భాగమే. ఇదేమీ పాకిస్థాన్ మాదిరి వేరే దేశం కాదు. మన రాజధాని అయిన హైదరాబాద్‌కు స్వేచ్ఛగా వెళ్లడానికి వీల్లేదని అడ్డుకునే అధికారం ఏ ఒక్కరికీ లేదు. ఇది మన రాజధాని అనే సందర్భంలో అన్నారే తప్ప ఈ వ్యాఖ్యలను వక్రీకరించడం తగదు’’ అని కోరారు.
విభజన కోరుకునేవారు సభలు పెట్టుకోవచ్చు
రాష్ట్రాన్ని విభజించాలని వాదిస్తున్న కేసీఆర్, ఇతర తెలంగాణ నాయకులు సీమాంధ్ర ప్రాంతంలో కూడా సభలు పెట్టుకోవచ్చని కొణతాల చెప్పారు. విభజన, సమైక్య వాదనలు విన్న తర్వాత ప్రజలే అంతిమ తీర్పు ఇస్తారన్నారు.
Advertisement