కళ్లుగప్పి.. కొల్లగొట్టి.. | sand mafia | Sakshi
Sakshi News home page

కళ్లుగప్పి.. కొల్లగొట్టి..

Published Fri, May 23 2014 12:22 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

కళ్లుగప్పి..  కొల్లగొట్టి.. - Sakshi

కళ్లుగప్పి.. కొల్లగొట్టి..

కోట్ల విలువైన ఇసుక కంట పడిందంటే చాలు.. వారు చెలరేగిపోతారు. అనుమతులతో వారికి ఎలాంటి పనీ లేదు.. నిబంధనలను యథేచ్ఛగా ఇసుకలో తొక్కేస్తారు. అధికారుల కళ్లుగప్పి.. ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టి.. నిశి వేళ.. ఆ ఇసుకను దర్జాగా తవ్వేసి.. తరలించేసి.. కాసులు పండించుకుంటారు. బహుశా! ‘అధికార’ అండ ఉండడంవల్లనేమో! వారిపై ఉక్కుపాదం మోపాల్సిన అధికారులు సైతం మొక్కుబడి జరిమానాలతో సరిపెట్టేస్తున్నారు.
 
 సాక్షి, కాకినాడ : జిల్లాలో ఇసుక మాఫియా మళ్లీ రెచ్చిపోతోంది. ఎలాంటి అనుమతులూ లేకుండా అడ్డగోలుగా తవ్వేసి.. దొరికినంతా దోచుకుంటోంది. జిల్లాలోని 28 ఇసుక రీచ్‌ల్లో తవ్వకాలకు గడువు ముగిసి ఏడాది కావస్తోంది. ప్రస్తుతం పి.గన్నవరం మండలం లంకల గన్నవరంలో.. అన్నాబత్తుల వెంకటరమణమూర్తికి చెందిన సర్వే నంబర్ 53, 54, 55 పరిధిలో విస్తరించి ఉన్న 17 ఎకరాల పట్టా భూముల్లో.. సుమారు 2,15,624 క్యూబిక్ మీటర్ల ఇసుక వెలికితీసి అమ్ముకునేందుకు మాత్రమే అనుమతులున్నాయి. మిగిలిన రీచ్‌లకు అనుమతుల్లేవు. స్టాక్ పాయింట్లకు,  -రవాణాకు కూడా అనుమతులు లేవు.
 
మూడు నెలలుగా అధికారులు వరుస ఎన్నికల విధుల్లో బిజీగా ఉన్నారు. దీనిని అవకాశంగా తీసుకొని, ఇసుకాసురులు బరితెగించారు. రాత్రి వేళల్లో గుట్టు చప్పుడు కాకుండా కోట్లాది రూపాయల విలువైన ఇసుకను కొల్లగొట్టి, పగటిపూట దానిని దర్జాగా అమ్ముకొని సొమ్ములు చేసుకున్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వారికి దన్నుగా నిలిచినవారే ఇప్పుడు పార్టీలు మారి మళ్లీ అధికార పగ్గాలు చేపట్టారు. దీంతో ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. కొంతమంది తెలుగుదేశం ప్రజాప్రతినిధుల అండదండలతో ఇసుకను యథేచ్ఛగా తవ్వేసి, అమ్ముకుంటున్నారు.
 
కొల్లగొడుతున్నదిలా..
కోరుమిల్లి, కపిలేశ్వరపురం రీచ్‌లతో పాటు అయినవిల్లి మండలం శానిపల్లిలంక, కొండుకుదురులంక, పొట్టిలంక, తొగరపాయ; పి.గన్నవరం మండలం ఎర్రంశెట్టివారిపాలెం, మొండెపులంక శివారు పుచ్చల్లంక, ఎల్.గన్నవరం శివారు నడిగాడి తదితర ప్రాంతాల్లో తవ్వకాలు సాగిస్తున్నారు. రాత్రి 10 నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకూ నిరంతరాయంగా ఈ తవ్వకాలు సాగుతున్నాయి.
 
ఇసుక తవ్వి ట్రాక్టర్‌కు లోడ్ (యూనిట్) చేయడానికి నలుగురు పని చేస్తున్నారు. వీరికి రూ.200 నుంచి రూ.400 చొప్పున చెల్లిస్తున్నారు.
 
ప్రతి రీచ్ నుంచి కనీసం పది ట్రాక్టర్లకు తక్కువ కాకుండా ప్రతి రోజూ ఇసుక తవ్వుతున్నారు. దీనిని రావులపాలెం తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసుకున్న స్టాక్ పాయింట్ల వద్ద నిల్వ చేస్తున్నారు. అక్కడ నుంచి లారీల ద్వారా అమ్మకాలు సాగిస్తున్నారు.
 
రెండు యూనిట్లకు గతంలో రూ.2వేల నుంచి రూ.2500 వరకూ వసూలు చేసేవారు. అలాంటిది ఇప్పుడు ఇసుక దొరకని పరిస్థితిని ఆసరాగా చేసుకొని ఏకంగా రూ.5,500 వరకూ గుంజుతున్నారు.
 
 పది కిలోమీటర్ల లోపు దూరమైతే రూ.1000, ఆ తర్వాత కిలోమీటర్‌కు కొంత మొత్తం చొప్పున రవాణా చార్జీ అదనంగా వసూలు చేస్తున్నారు.
 
మరోపక్క పశ్చిమ గోదావరి నుంచి కూడా ప్రతి రోజూ వందలాది లారీలు చించినాడ, సిద్ధాంతం వంతెనల మీదుగా జిల్లాలోకి వస్తున్నా పట్టించుకుంటున్నవారే కరువయ్యారు.
 
 ‘అధికార’ నేతలకు వాటాలు..
 ఇసుక మాఫియాలో ఒకప్పుడు చక్రం తిప్పిన అధికార పార్టీ ఎమ్మెల్యే, ఎంపీల అండదండలు ప్రస్తుతం పుష్కలంగా ఉండడంతో ‘అనుమతులతో మాకు పనేంటి?’ అన్న ధోరణిలో ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. బహిరంగంగా సాగుతున్న ఈ ఇసుక అక్రమ వ్యాపారంలో కొంతమంది అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు సైతం భాగస్వామ్యం ఉన్నట్టుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో ఇసుక లీజుదారుల నుంచి పర్సంటేజీలు తీసుకునేవారని.. ఇప్పుడు అనుమతులు లేనందున వాటాలు తీసుకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఎన్నికల్లో చేసిన ఖర్చును ఇసుక అక్రమ వ్యాపారం ద్వారా రాబట్టుకొనేందుకు ‘అధికార’ నేతలు ఎత్తులు వేస్తున్నట్టు పలువురు బాహాటంగానే అంటున్నారు.
 
పట్టుబడినా పట్టించుకోరు

నిబంధనల ప్రకారం ఇసుక తరలిస్తూ పట్టుబడిన ట్రాక్టర్లకు మొదటిసారి రూ.5 వేలు, రెండోసారి రూ.10 వేలు జరిమానా విధిస్తారు. మూడోసారి పట్టుబడితే మాత్రం బైండోవర్ చేసి కోర్టుకు సరెండర్ చేస్తారు. అలాగే, లారీలైతే మొదటిసారి రూ.10 వేలు రెండోసారి రూ.25 వేలు జరిమానా విధిస్తారు. మూడోసారి పట్టుబడితే బైండోవర్ చేస్తారు. కానీ జిల్లాలో తనిఖీల్లో ఎక్కడైనా ఇసుకతో ట్రాక్టర్ పట్టుబడినా అధికారులు విధిస్తున్న జరిమానా కేవలం రూ.2500 నుంచి రూ.5 వేలు మాత్రమే ఉంటోంది. దీంతో ఆ మొత్తాన్ని వెంటనే చెల్లించేసి, కేవలం ఒక్క రోజులోనే ఆ ట్రాక్టర్‌ను విడిపించుకుని మళ్లీ యథేచ్ఛగా అక్రమ దందా సాగిస్తున్నారు. ఒకవేళ బైండోవర్ చేసే పరిస్థితి వస్తే అధికారులను అక్రమార్కులు ‘మేనేజ్’ చేసేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement