సంక్రాంతి కానుక సరుకులు
సంక్రాంతి కానుకలు పక్కదారి పట్టాయా... వచ్చిన సరకు మొత్తంసరఫరా కాలేదా... మిగిలిన సరకు ఎక్కడుందో కనిపించడం లేదా... ఈ ప్రశ్నలకు ఇప్పుడు జిల్లాలో అవుననే సమాధానం వినిపిస్తోంది. కారణం... జిల్లాకు కేటాయించిన సరకు పూర్తిస్థాయిలో సరఫరా కాలేదని అధికారిక లెక్కలే చెబుతున్నాయి. మిగిలినవాటిని గోదాములకు చేర్చాల్సి ఉన్నా... ఆ ప్రయత్నాలు జరగలేదని స్పష్టమవుతోంది. మరి అధికారులేం చేస్తున్నట్టు?
విజయనగరం గంటస్తంభం: సంక్రాంతి పండగ నేపథ్యంలో ప్రభుత్వం కంటితుడుపు కానుకగా ఆరు రకాల సరుకులు సరఫరా చేసిన విషయం తెలిసిందే. ఒక్కో కుటుంబానికి కందిపప్పు, శనగపప్పు, బెల్లం అరకేజీ చొప్పున, గోధుమపిండి కేజీ, పామాయిల్ లీటరు, నెయ్యి రూ.100గ్రాముల చొప్పున ఇవ్వాలని నిర్ణయించారు. జిల్లాలో ఉన్న 1400 రేషన్‌డిపోల ద్వారా జిల్లాలో ఉన్న 7,01,494 రేషన్‌కార్డులకు సరిపడా సరకులు డిపోలకు ముందుగానే పంపించారు. సరుకులను డీలర్లు జనవరి ఒకటో తేదీ నుంచి 18వ తేదీ వరకు పంపిణీ చేశారు. ఆ సమయంలో జిల్లాలో 6,41,960 కార్డులకే సరుకులు విడుదల చేసినట్టు రికార్డులు చెబుతున్నాయి.ఈ లెక్కన దాదాపుగా 3.21మెట్రిక్ టన్ను లవంతున కందిపప్పు, శనగపప్పు, బెల్లం, 642 మెట్రిక్ టన్నుల గోధమపిండి, 6,41,960 ప్యాకెట్ల వంతున పామాయిల్,, నెయ్యి మాత్రమే లబ్ధిదారులకు సరఫరా జరిగింది. మిగిలిపోయిన సరుకులు తిరిగి మండలస్థాయి నిల్వ కేంద్రాలకు పంపించాల్సి ఉంది.
తిరిగి చేరని సరుకులు
పంపిణీ తీరును బట్టి కందిపప్పు 30మెట్రిక్ టన్నులు, శనగపప్పు 29 మెట్రిక్ టన్నులు, బెల్లం 28మెట్రిక్ టన్నులు, గోధమపిండి 78మెట్రిక్ టన్నులు, పామాయిల్ ప్యాకెట్లు 59,245, నెయ్యి ప్యాకెట్లు 57,532 తిరిగి మండలస్థాయి నిల్వ కేంద్రాలకు చేరాలి. అయితే కందిపప్పు, పామాయిల్ అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా జరుగుతున్నందున డీలర్లు వారి వద్ద ఉంచుకోవచ్చు. వాటికి మండలస్థాయి గోదాము నుంచి పంపిస్తున్నట్లు రిలీజ్ అర్డర్ ఇస్తున్నారు. అంటే శనగపప్పు, బెల్లం, గోధమపిండి, నెయ్యి వంటి సరుకులు వెనక్కి చేరాలి. కందిపప్పు, పామాయిల్ వంటి సరుకుల లెక్కలు పౌరసరఫరాలసంస్థ అధికారులు వద్ద ఉండాలి. అయితే రావాల్సిన సరుకులు సగానికిపైగా రాలేదని ఆ సంస్థ అధికారులు చెబుతున్నారు. కనీసం ఎంత సరుకు చేరిందని అడిగితే లెక్కలు చెప్పలేకపోతున్నారు. ఇంకా సరుకులు రావాలని చెబుతున్నారు. సంక్రాంతి వెళ్లి దాదాపు రెండు నెలలు కావస్తున్నా ఇంకా సరుకులు రాకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డీలర్లు, అధికారులు కుమ్మక్కై సరుకులు పక్కదారి పట్టించారన్న ఆరోపణలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment