ఢిల్లీ కదిలేలా సమైక్య శంఖారావం
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ పీఠం కదిలేలా సమైక్య శంఖారావాన్ని పూరిద్దామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమన్వయకర్త కొణతాల రామకృష్ణ పిలుపునిచ్చారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే డిమాండ్‌తో ఈ నెల 26న హైదరాబాద్‌లోని ఎల్బీస్టేడియంలో నిర్వహించనున్న సమైక్య శంఖారావం సభను విజయవంతం చేద్దామని సమైక్యవాదులకు ఆయన పిలుపునిచ్చారు. సమైక్యవాదులంతా ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైందని కొణతాల పేర్కొన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలుగుజాతిని రక్షించుకోవడానికి రాజకీయ పార్టీలన్నీ కలిసి రావాల్సిన అవసరముందని, పార్టీలకు అతీతంగా అందరూ కలిసి రాజకీయ సంక్షోభం సృష్టిస్తేనే విభజన ఆగుతుందని అన్నారు. ఇప్పటికైనా మించిపోయింది లేదని, సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి అసెంబ్లీని తక్షణం సమావేశపరిచి సమైక్య తీర్మానం చేయాలని, అదే విధంగా టీడీపీ అధినేత చంద్రబాబు విభజన లేఖను ఉపసంహరించుకోవాలని కొణతాల కోరారు.
సోనియా డెరైక్షన్‌లో కాంగ్రెస్, టీడీపీ..
రాష్ట్రంలో సుమారు 80 రోజులకుపైగా ఉద్యమం జరుగుతున్నప్పటికి కూడా.. ఆందోళన కార్యక్రమాలను మరింత పెంచేలాగానే కేంద్రమంత్రులు, రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ప్రవర్తిస్తున్నారని కొణతాల అన్నారు. విభజన బిల్లు అసెంబ్లీకి వస్తే అడ్డుకుంటామంటూనే, మరోపక్క విభజన అనివార్యమంటూ అందుకు కావాల్సిన సహాయ సహకారాలను కేంద్రానికి అందించేందుకు జీవోఎం(మంత్రుల బృందానికి)కు ప్రతిపాదనలు పంపుతున్నారని దుయ్యబట్టారు. తాము మొదటి నుంచీ చెబుతున్నట్లుగా.. సోనియాగాంధీ డెరైక్షన్‌లో రాష్ట్రంలోని కాంగ్రెస్‌తో కలిసి టీడీపీ అధినేత చంద్రబాబు ఒక పథకం ప్రకారం ముందుకెళ్తున్నారన్నారు. వారి డ్రామాలు ఒక్కొక్కటిగా రుజువవుతున్నాయని పేర్కొన్నారు.
సమైక్యంగా ఉన్నప్పుడే అభివృద్ధి..
కొన్ని వేల సంవత్సరాల చరిత్ర కలిగిన తెలుగుజాతి సమైక్యంగా ఉన్నప్పుడే అభివృద్ధి సాధ్యమైందని కొణతాల అన్నారు. 1969, 72లో వచ్చిన ఉద్యమాల తర్వాత అన్ని ప్రాంతాల ప్రజలు సోదరభావంతో రాష్ట్ర అభివృద్ధికి కృషి చేశారని వివరించారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణించినప్పటికీ.. రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? లేదా అనే పరిస్థితిలో కూడా నాడు వైఎస్ చేపట్టిన కార్యక్రమాల వల్ల అభివృద్ధి కుంటుపడలేదన్నారు. జీఎస్‌టీలో రూ.8 లక్షల కోట్లతో దేశంలోనే మన రాష్ట్రం మూడవ స్థానంలో ఉందని వెల్లడించారు. దేశంలో మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ తర్వాత అత్యంత అభివృద్ధి కలిగిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచిందన్నారు. రాజశేఖరరెడ్డి తన హయాంలో ప్రతి ఒక్కరికీ రాజ్యాంగ హక్కు మాదిరిగా తిండి, గూడు, ఆరోగ్యం ఇలా ప్రతిదీ సంతృప్తికర స్థాయిలో పథకాలు అందించారని వివరించారు. అభివృద్ధితో వేర్పాటువాదాన్ని మరిపించగలిగారన్నారు. వైఎస్ ఆశయ సాధన కోసం ఏర్పడిన తమ పార్టీకి రాష్ట్రం సమైక్యంగానే ఉంటుందనే దృఢమైన విశ్వాసం ఉందని చెప్పారు.
ప్రజల ఆలోచనకు విరుద్ధమైన నిర్ణయం..
రాష్ట్రాన్ని విభజించాలని యూపీఏ ప్రభుత్వం నిర్ణయించడం ప్రజల ఆకాంక్షకు పూర్తి విరుద్ధమైనదని కొణతాల వ్యాఖ్యానించారు. రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం లేకుండా విభజించడం దారుణమన్నారు. ఈ విషయమై గతంలో కేంద్ర హోంమంత్రిగా ఎల్‌కే అద్వానీ పార్లమెంటులో చేసిన వ్యాఖ్యలను గుర్తుచేశారు. ‘ఆగస్టు 1, 2000న పార్లమెంటులో కేంద్ర హోంమంత్రిగా ఎల్‌కే అద్వానీ మాట్లాడుతూ రాష్ట్ర విభజనకు అక్కడి అసెంబ్లీ తీర్మానం చేయాలన్నారు. అంతేకాదు 26-2-2002న 377 నిబంధన కింద తెలంగాణ రాష్ట్రం కోరుతూ ఆలె నరేంద్ర అడిగిన ప్రశ్నకు కూడా ఇదే సమాధానం ఇచ్చారు’ అని వివరించారు. ఇందుకు సంబంధించిన పత్రాన్ని మీడియాకు అందజేశారు. డిసెంబర్ 9, 2009న కేంద్రహోంమంత్రిగా చిదంబరం మాట్లాడుతూ.. రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేయాలని చెప్పిన ప్రకటనను కూడా యూపీఏ ప్రభుత్వం పూర్తిగా విస్మరించి ఏకపక్షంగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు.