వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లాలో సమైక్య సమర శంఖం పూరించనుంది. సమైక్యాంధ్ర విధానానికి కట్టుబడ్డ ఏకైక ప్రధాన పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాక్షేత్రంలోకి వస్తున్నారు.
సమరశంఖం పూరించనున్న వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి
శ్రీకాకుళంలో ఆదివారం భారీ బహిరంగ సభ
అదే వేదికపై ధర్మాన ప్రసాదరావు ‘చిక్కోలు తిరుగుబాటు’
భారీ స్థాయిలో అనుయాయులతో వైఎస్‌ఆర్‌సీపీలో చేరనున్న ధర్మాన
కూకటివేళ్లతో కూలనున్న జిల్లా కాంగ్రెస్
వైఎస్‌ఆర్‌సీపీ శ్రేణుల్లో ఉరకలెత్తుతున్న ఉత్సాహం
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లాలో సమైక్య సమర శంఖం పూరించనుంది. సమైక్యాంధ్ర విధానానికి కట్టుబడ్డ ఏకైక ప్రధాన పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాక్షేత్రంలోకి వస్తున్నారు. ఆయన రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న సమైక్య శంఖారావం యాత్ర జిల్లాలో అడుగుపెట్టనుంది. జిల్లా కేంద్రం శ్రీకాకుళంలో ఆదివారం నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొననున్నారు. వైఎస్సార్ కూడలి వద్దనున్న ఎన్టీఆర్ మున్సిపల్ ఉన్నత పాఠశాల మైదానంలో ఆదివారం మధ్యాహ్నం 2 గంట లకు భారీ బహిరంగ సభ
నిర్వహించనున్నారు. అదే వేదికపై నుంచి సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు కాంగ్రెస్ పార్టీపై ‘చిక్కోలు తిరుగుబాటు‘ చేయనున్నారు. జిల్లాలో కాంగ్రెస్ పార్టీ దాదాపు తుడిచిపెట్టుకుపోయేరీతిలో ధర్మాన భారీ సంఖ్యలో ప్రజాప్రతినిధులు, నేతలు, కార్యకర్తలతో కాంగ్రెస్‌కు రాజీనామా చేసి వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌లో చేరనున్నారు. అటు తెలుగుజాతికి కీలకమైన సమైక్యాంధ్ర నినాదంతో రాష్ట్ర ప్రగతికి దశా, దిశా నిర్దేశించడంతోపాటు.. ఇటు జిల్లా చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో రాజకీయ ప్రకంపనలు సృష్టించనున్న వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి యాత్ర జిల్లా చరిత్రలో నూతన అధ్యాయానికి నాందీ ప్రస్తావన పలకనుంది.
కదలిరానున్న ప్రజానీకం
వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి నిర్వహించనున్న సమైక్య శంఖారావం బహిరంగ సభకు జిల్లా ప్రజానీకం యావత్ కదలిరానుంది. ఇందుకోసం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ శ్రేణులు ఉరకలెత్తుతున్నాయి. ఇప్పటికే అటు ఇచ్ఛాపురం నుంచి రణస్థలం వరకు, ఇటు వీరఘట్టం నుంచి గార వరకు పార్టీ నేతలు, కార్యకర్తలు సమావేశాలు ఏర్పాటు చేసుకుని సన్నద్ధమవుతున్నారు. పార్టీ సమైక్యాంధ్ర నినాదం ప్రతిధ్వనించేలా వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి బహిరంగ సభను విజయవంతం చేయడానికి ఉద్యుక్తమవుతున్నారు. బహిరంగ సభ నిర్వహణపై జిల్లా పార్టీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ పార్టీ నేతలతో చర్చిస్తున్నారు. వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి టూర్ ప్రోగామ్ కోఆర్డినేటర్ తలశిల రఘురాంతో కలసి ఆయన, శుక్రవారం ఎన్టీఆర్ మున్సిపల్ పాఠశాల మైదానాన్ని పరిశీలించారు. సభ ఏర్పాట్లను సమీక్షించారు. వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ర్యాలీని శ్రీకాకుళంలో ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభించి నేరుగా మున్సిపల్ పాఠశాల మైదానానికి చేరుకునేలా ప్రణాళిక రూపొందించారు. ధర్మాన కృష్ణదాస్.. శ్రీకాకుళం, గార, నరసన్నపేట, రణస్థలం, ఎచ్చెర్లలో శుక్రవారం పర్యటించి సమైక్య శంఖారావం సభకు జనసమీకరణపై పార్టీ నేతలతో చర్చించారు. శనివారం ఆయన ఆమదాలవలస, పాలకొండల్లో పర్యటించనున్నారు. అదేవిధంగా పార్టీ నేతలు తమ్మినేని సీతారాం, పాలవలస రాజశేఖరం, నియోజకవర్గాల సమన్వయకర్తలు, ఇతర నేతలు కూడా తమతమ నియోజకవర్గాల్లో కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించారు. సమైక్య శంఖారావం సభను విజయవంతం చేసేందుకు కార్యాచరణ చేపట్టారు.
ధర్మాన చేరికతో చారిత్మాత్మక మార్పులు ఖాయం
సమైక్య శంఖారావం సభ జిల్లా రాజకీయ సమీకరణలలో చరిత్రాత్మక మార్పులకు వేదికగా నిలవనుంది. జిల్లా కాంగ్రెస్‌కు పెద్దదిక్కుగా ఉన్న మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌లో చేరనున్నారు. 30 ఏళ్లుగా ప్రజాజీవితంలో ఉన్న ఆయన కీలకమైన రాజకీయ నిర్ణయం తీసుకోనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న రాష్ట్ర విభజన నిర్ణయానికి వ్యతిరేకంగా ఆ పార్టీకి రాజీనామా చేయనున్నారు. జిల్లా వ్యాప్తంగా భారీసంఖ్యలో ఉన్న నేతలు, కార్యకర్తలతో కలసి జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైఎస్‌ఆర్ సీపీలో చేరనున్నారు. అందుకోసం ధర్మాన కొన్ని రోజులుగా భారీ స్థాయిలో సన్నాహాలు చేస్తున్నారు. శ్రీకాకుళంతోపాటు నరసన్నపేట, పలాస, ఇచ్ఛాపురం నియోజకవర్గాల్లో పర్యటించి సహచర నేతలు, కార్యకర్తలతో సమావేశమయ్యారు.
ఇన్నాళ్లుగా కాంగ్రెస్‌లో తనతో పనిచేసిన ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ పరమైన పదవుల్లో ఉన్న నేతలు, ఇతరులను భారీగా సమీకరించారు. ఆయనతోపాటు ఇతర కాంగ్రెస్ నేతలెవరూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌లో చేరకుండా చూసేందుకు కేంద్ర, రాష్ట్ర మంత్రులు కృపారాణి, కోండ్రు మురళిలు చేసిన ప్రయత్నాలు ఫలించలేదనే చెప్పొచ్చు. మొత్తంమ్మీద వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి జిల్లా పర్యటన అటు సమైక్యాంధ్ర నినాదాన్ని ప్రతిధ్వనించనుండటంతోపాటు, ఇటు ధర్మాన చేరికతో జిల్లా రాజకీయ ముఖచిత్రాన్ని సమూలంగా మార్చివేయనుంది. భవిష్యత్ రాజకీయ పరిణామాలకు సంకేతంగా నిలవనుండటంతో అందరి చూపు శ్రీకాకుళం బహిరంగ సభపై కేంద్రీకృతమైంది.
భారీగా తరలిరండి: ధర్మాన కృష్ణదాస్
వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొననున్న సమైక్య శంఖారావం బహిరంగ సభను విజయవంత చేయాలని వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ పిలుపునిచ్చారు. శ్రీకాకుళంలో ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు నిర్వహించనున్న ఈ సభకు జిల్లావ్యాప్తంగా పార్టీ శ్రేణులు, ప్రజలు భారీగా తరలిరావాలని కోరారు. సమైక్యాంధ్రను కాంక్షించే యావత్ ప్రజానీకం జగన్‌మోహన్‌రెడ్డికి బాసటగా నిలవాలన్నారు. పార్టీలో ఇప్పటికే ఉన్న , కొత్తగా చేరనున్న నేతలు, కార్యకర్తలు భారీగా తరలిరావాలన్నారు. అందరికీ పార్టీలో సముచిత స్థానం, గుర్తింపు దక్కుతాయని ఆయన చెప్పారు. సమైక్యాంధ్రను పరిరక్షించే వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిని సీఎం చేయడమే లక్ష్యంగా ఉద్యమపథంలో సాగాలని అన్నారు.