‘హై సెక్యూరిటీ’గోల్‌మాల్
వాహనాల నెంబర్ ప్లేట్ల ప్రాజెక్టులో కుంభకోణం?
రవాణా శాఖ మంత్రి, అధికారుల ప్రమేయం ఉందంటూ సీఎంకు ఫిర్యాదు
వెలుగులోకి తెచ్చిన ఆలిండియా మోటార్ వెహికల్ సెక్యూరిటీ అసోసియేషన్
సాక్షి, హైదరాబాద్: వాహనాలకు హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేట్లు అమర్చే ప్రాజెక్టు... మూడు రాష్ట్రాల్లో దీని అమలు బాధ్యత ఒకే కంపెనీది... కానీ నెంబర్ ప్లేటు ధరల్లో భారీ తేడా... పోనీ అదేమన్నా చిన్న మొత్తమా అంటే అదీ కాదు. వచ్చే పదేళ్లలో వాహనాల సంఖ్య ఆధారంగా బేరీజు వేస్తే ఆ తేడా మొత్తం దాదాపు రూ. 608 కోట్లు. వింటుంటేనే ఆశ్చర్యంగా ఉంది కదూ. ఆ మొత్తాన్ని తలపై మోసేది మన రాష్ట్ర సగటు వాహనదారులు. ప్రభుత్వ పెద్దలు తలుచుకుంటే ఏదైనా సాధ్యమేననటానికి ఇదే నిదర్శనం. ఇటీవల రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా ప్రారంభమైన హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ల (హెచ్‌ఎస్‌ఆర్‌పీ) ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందన్న వార్తలు గుప్పుమన్నాయి. ఈ ప్రాజెక్టును అమలు చేసేందుకు గత నాలుగేళ్లుగా సాగుతున్న కసరత్తులో వివాదాలు ఎన్నో. వాటిని ఎలాగోలా అధిగమించి తీరా ప్రాజెక్టు అమలు ప్రారంభమయ్యాక, పాత వివాదాలను తలదన్నే రీతిలో ఆరోపణలు గుప్పుమంటున్నాయి.
రవాణాశాఖ మంత్రి, ఉన్నతాధికారులప్రమేయంపై ఆరోపణచేస్తూ ‘ఆలిండియా మోటార్ వెహికల్ సెక్యూరిటీ అసోసియేషన్’ ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ప్రయోగాత్మకంగా ప్రారంభమైన హెచ్‌ఎస్‌ఆర్‌పీ ప్రాజెక్టులో టెండర్లు దక్కించుకున్న ఉత్సవ్ సేఫ్టీ సిస్టం ప్రైవేట్ లిమిటెడ్, లింక్‌పాయింట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కన్సార్షియం ఈ హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ల ధరలను చాలా ఎక్కువగా నిర్ధారించింది. ఇదే కంపెనీ.. ఈ పథకాన్ని ఢిల్లీ, హర్యానా రాష్ట్రాల్లో ఇప్పటికే అమలు చేస్తోంది. ప్రస్తుతం ఆ రెండు రాష్ట్రాల్లో ఇస్తున్న నెంబర్ ప్లేట్ల ధరలకు, రాష్ట్రంలో అమలు చేస్తున్న ధరలకు ఏమాత్రం పొంతన లేదు. వాటితో పోలిస్తే రాష్ట్రంలో ధరలు దాదాపు మూడు రెట్లు ఎక్కువగా ఉన్నాయి. ద్విచక్ర వాహనం నెంబర్ ప్లేటు ధర ఢిల్లీలో రూ. 68.91, హర్యానాలో రూ. 60.6 ఉంటే అదే మన రాష్ట్రంలో ఏకంగా రూ. 208 (పన్నులు కాకుండా)గా ఖరారు చేశారు. అలాగే ఆటోలు, తేలికపాటి వాహనాలు/కార్లు, భారీ వాహనాల ప్లేట్ల ధరల్లో కూడా ఇదే తరహా వ్యత్యాసం ఉండటం ఇప్పుడు పెద్ద దుమారం రేపుతోంది.
ఈ మొత్తం వివరాలను ‘ఆలిండియా మోటార్ వెహికల్ సెక్యూరిటీ అసోసియేషన్’ ముఖ్యమంత్రికి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ప్రస్తుతం రాష్ట్రంలో 1.19 కోట్ల వాహనాలు ఉండగా వచ్చే పదేళ్లలో వాటి సంఖ్య 3.10 కోట్లకు చేరుకుంటుందని, ప్లేట్ల ధరల్లో ఉన్న వ్యత్యాసం వల్ల రాష్ట్ర ప్రజలు దాదాపు రూ. 608 కోట్లు అదనంగా చెల్లించాల్సి ఉంటుందని లెక్కలు తేల్చింది. ఢిల్లీ, హర్యానాల్లో ప్లేట్లను వాహనాలకు అమర్చేందుకు స్థానిక రవాణా కార్యాలయాల్లో ఎలాంటి వసతులు కల్పించలేదని, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఆర్టీఏ కార్యాలయాల్లోనే వసతి కల్పించారని పేర్కొన్నారు. ఫలితంగా ఆ రెండు రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌లో ధర తక్కువగా ఉండాల్సింది పోయి మూడు రెట్లు ఎక్కువగా ఉండటం కచ్చితంగా కుంభకోణమేనని స్పష్టం చేసింది. ఇక కన్సార్షియంలో భాగంగా ఉన్న లింక్ పాయింట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పై మరో భాగస్వామి ఉత్సవ్ సేఫ్టీ సిస్టం ప్రై.లి. ఆర్టీఏ అధికారులకు నిబంధనల ఉల్లంఘనపై ఫిర్యాదులు చేయటాన్ని కూడా ఫిర్యాదు దారులు ప్రస్తావించారు. గతంలో ఈ ప్రాజెక్టు అమలుకు సంబంధించి నాటి ఆర్టీసీ ఎండీ (పథకం నోడల్ ఏజెన్సీ ఆర్టీసీనే) లేవనెత్తిన అభ్యంతరాలను పట్టించుకోకపోవటమే కాకుండా ఏకంగా ఆయనను ఆ పదవి నుంచి తప్పించి మరీ ప్రాజెక్టును అమలులోకి తేవటాన్ని కూడా అసోసియేషన్ ప్రముఖంగా ప్రస్తావించింది. ముఖ్యమంత్రితోపాటు అన్ని ప్రధాన పార్టీల అధ్యక్షులకు కూడా అసోసియేషన్ ఫిర్యాదు కాపీలను అందజేసింది. రవాణాశాఖ మంత్రి బొత్సపై వచ్చిన ఆరోపణలు ఇప్పుడు చర్చనీయాంశం కావటంతో ఈ ప్రాజెక్టు మరోసారి వివాదంలో చిక్కుకున్నట్టయింది.