సీమాంధ్ర నేతల వైఖరిపై తెలంగాణవాదులు రెండోరోజూ భగ్గుమన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షకు భిన్నంగా పార్లమెంట్‌లో వ్యవహరించిన సీమాంధ్ర నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : సీమాంధ్ర నేతల వైఖరిపై తెలంగాణవాదులు రెండోరోజూ భగ్గుమన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షకు భిన్నంగా పార్లమెంట్‌లో వ్యవహరించిన సీమాంధ్ర నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం, కేంద్ర మంత్రుల కమిటీ (జీఓఎం) సిఫారసుల మేరకు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన టీ బిల్లుపై చర్చను అడ్డుకోవడంపై నిరసస వ్యక్తం చేశారు. టీ బిల్లుపై బీజేపీ దాటవేసే ధోరణితో వ్యవహరించిందంటూ కాంగ్రెస్ నేతలు విమర్శలు చేయగా... బీజేపీ నేతలు ఖండించారు. ‘తెలంగాణ’కు కట్టుబడి ఉన్నామని కమలదళ నేతలు స్పష్టం చేశారు.
నిరసనల హోరు
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లును అడ్డుకోవాలని చూసిన సీమాంధ్ర ఎంపీల వైఖరిని ఎండగడుతూ జిల్లాలో శుక్రవారం తెలంగాణవాదులు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. నిజామాబాద్, ఆర్మూర్, బోధన్, కామారెడ్డి తదితర ప్రాంతాల్లో వివిధ పార్టీలతో పాటు ఉద్యోగ, ఉపాధ్యాయ, విద్యార్థి, న్యాయవాద జేఏసీలు ఆందోళనల్లో పాల్గొన్నాయి. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ల దిష్టిబొమ్మలను దహనం చేశారు. నిజామాబాద్‌లో తెలంగాణ జాగృతి, పీడీఎస్‌యూల ఆధ్వర్యంలో ఎంపీ లగడపాటి రాజగోపాల్ దిష్టిబొమ్మను దహనం చేయగా.. బస్టాండ్ ఎదుట టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో బీజేపీ అగ్రనేతలు వెంకయ్యనాయుడు, అద్వానీల దిష్టిబొమ్మలను తగలబెట్టారు. కామారెడ్డి, భిక్కనూరు, నవీపేట, రెంజల్ మండల కేంద్రాలతో పాటు పలు గ్రామాల్లో లగడపాటి దిష్టిబొమ్మలను అగ్నికి ఆహుతి చేశారు.
లగడపాటిపై కేసు పెట్టాలి
పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లును అడ్డుకునే ప్రయత్నం చేసిన లగడపాటి రాజగోపాల్ తదితరులపై కేసులు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాల ని న్యాయవాదులు డిమాండ్ చేశారు. నిజామాబాద్, బోధన్ కోర్టులలో న్యాయవాదులు విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. ఈ నెల 21 వరకు విధులు బహిష్కరించనున్నట్లు బోధన్ న్యాయవాదులు ప్రకటించా రు. పార్లమెంట్‌లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లు ఆమోదం పొందేంతవరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని తెలంగాణవాదులు పేర్కొన్నారు.