సంగం, న్యూస్‌లైన్: రాష్ట్రంలో అన్నదాతకు అండగా మార్కెటింగ్ శాఖ పనిచేస్తోందని ఆ శాఖ డిప్యూటీ డెరైక్టర్ ఇఫ్తిహర్ నజీబ్ తెలిపారు. సంగంలోని మార్కెటింగ్ శాఖ చెక్‌పోస్టును బుధవారం ఆయన పరిశీలించారు. అనంతరం విలేకర్లతో మాట్లాడారు. పంటకు మద్దతు ధరలేకపోతే తమ శాఖ గోదాములో దాచుకుని, మంచి ధర వచ్చిన తరువాత అమ్మి లాభాలు పొందాలని రైతులకు సూచించారు. ఇలా దాచుకున్న పంటకు రైతుబంధు పథకం కింద 90 రోజుల వరకు వడ్డీ లేకుండా రుణం లభిస్తుందన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 300 మంది రైతులకు రూ.2 కోట్లు రుణాలుగా అందజేశామన్నారు. ఆత్మకూరు, కావలి, కోవూరు, నాయుడుపేట, వాకాడు, సూళ్లూరుపేటలో ఉన్న మార్కెటింగ్ గోదాములను రైతులు వినియోగించుకోవాలని కోరారు. మార్కెటింగ్ శాఖ పన్నులు వసూలు కోసం రీజియన్ పరిధిలోని నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో 146 చెక్‌పోస్టులను ఏర్పాటు చేశామన్నారు. నెల్లూరులో 24 చెక్‌పోస్టులు ఉన్నాయన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రీజియన్ వ్యాప్తంగా రూ.100 కోట్ల పన్ను వసూలుచేయాలని ప్రణాళిక రూపొందించుకున్నామన్నారు.
నెల్లూరు జిల్లాలో రూ.17 కోట్ల వసూలవుతుందని భావించగా, ఇప్పటివరకు రూ.8 కోట్లు వసూలయిందని వివరించారు. గుంటూరులో 80వేల మెట్రిక్ టన్నులు, నెల్లూరులో 15వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన గోదాములు నిర్మించేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామన్నారు. ఏప్రిల్ 1 నుంచి సంగం చెక్‌పోస్టులో ఆత్మకూరుకు సంబంధించి రూ.13.70 లక్షలు, కోవూరు మార్కెటింగ్‌కు సంబంధించి రూ.14.84 లక్షలు వసూలయ్యాయని వెల్లడించారు. మార్కెట్ పన్నులు కట్టకుండా వెళ్లిన వ్యాపారులు ఇబ్బంది పడతారని హెచ్చరించారు. ఆయన వెంట జిల్లా సహాయ మార్కెటింగ్ సంచాలకుడు గౌస్‌బాషా, కావలి మార్కెటింగ్ కార్యదర్శి శ్రీనివాసులు ఉన్నారు.
అన్నదాతకు అండగా మార్కెటింగ్ శాఖ
Published Thu, Dec 12 2013 4:38 AM | Last Updated on Sat, Sep 2 2017 1:29 AM
Advertisement
Advertisement