మంత్రుల రాజీనామాలు తూచ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర సమైక్యత కోసమంటూ మంత్రులు చేసిన రాజీనామాలు పెద్ద ప్రహసనంగా మారాయి. ముఖ్యమంత్రికి మంత్రులిచ్చిన రాజీనామాలేవీ ఇప్పటికీ ఆమోదం పొందలేదు. పైగా మంత్రులంతా యథావిధిగా అధికార హోదాను అనుభవిస్తున్నారు. రాజీనామాల ఆమోదమంటూ అడపాదడపా వారు చేస్తున్నది ఉత్తుత్తి హడావుడిగానే మిగిలిపోతోంది. సోమవారం కూడా అదే పునరావృతమైంది. తమ రాజీనామాల ఆమోదం కోసమంటూ మంత్రులు గంటా శ్రీనివాసరావు, ఏరాసు ప్రతాప్‌రెడ్డి, కాసు కృష్ణారెడ్డి, శత్రుచర్ల విజయరామరాజు గవర్నర్ నరసింహన్‌ను, సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిని వేర్వేరుగా కలిశారు. తమ రాజీనామాలు ఆమోదించాలని గంటా, ఏరాసు సీఎంను కోరారు.
మంత్రులుగా కొనసాగుతూ సమైక్యోద్యమంలో భాగస్వాములం కాలేమన్నారు. తమ రాజీనామా లేఖను వెంటనే గవర్నర్‌కు పంపాలన్నారు. అయితే రాజీనామాల విషయంలో అందరం కలిసే ఒక నిర్ణయం తీసుకుందామని, తొందరపాటు వద్దని సీఎం వారించారు. ‘‘ఒకటి రెండు రోజుల్లో నేను ఢిల్లీ వెళ్లాల్సి ఉంది. పెద్దల స్పందన, పరిణామాలను అనుసరించి అంతా కలసి ఒకే బాటలో వెళ్దాం. రాష్ట్ర సమైక్యత కోసం అధిష్టానంతో నేను ఎప్పటి కప్పుడు చర్చిస్తున్నాను. పార్టీ పెద్దలను అంగీకరింపజేసే ప్రయత్నం చేస్తున్నాను. వారి వైఖరిపై నా పర్యటన తర్వాత స్పష్టత వస్తుంది’’ అన్నారు. రాజీనామాల ఆమోదంపై కిరణ్ సూచనల మేరకు వెళ్లాలన్న అభిప్రాయానికి కాసు, శత్రుచర్ల వచ్చారని సమాచారం. అంతా కలిసి నిర్ణయం తీసుకుందామని సీఎం చెబుతున్నందున ఆయన మాట ప్రకారం ముందుకెళ్తామని శత్రుచర్ల తనను కలసిన మీడియాతో అన్నారు. అంతా ఒకేసారి రాజీనామాలు ఆమెదింపజేసుకునే కన్నా ఒకరి తరవాత ఒకరుగా చేస్తే మేలన్న అభిప్రాయాన్ని వినిపించినట్టు తెలిసింది.
గవర్నర్‌ను కలిసింది ఇద్దరు మంత్రులే: రాజీనామాల ఆమోదం కోసం నలుగురు మంత్రులు గవర్నర్‌ను కలవబోతున్నారంటూ ఆదివారం లీకులిచ్చారు. ముగ్గురు మంత్రులు గవర్నర్‌ను కలుస్తారని ప్రచారం జరిగినా చివరకు గంటా, ఏరాసు రాజ్‌భవన్‌కు వెళ్లారు. ‘కొత్తగా నాకు రాజీనామా లేఖలిచ్చినా తిరిగి వాటిని సీఎంకే పంపాల్సి ఉంటుంది. దానికి బదులు మీరిప్పటికే సీఎంకు ఇచ్చిన రాజీనామా లేఖలు నాకందేలా చేయండి చాలు. వెంటనే ఆమోదిస్తా’నని గవర్నర్ వారితో వ్యాఖ్యానించారని సమాచారం. దాంతో మంత్రులు ఆయనకు కొత్తగా రాజీనామా లేఖలివ్వకుండానే వెనుదిరిగారు. రాష్ట్ర విభజన జరిగితే మంత్రులుగా కొనసాగలేమని ముందు నుంచి చెబుతున్నామని అనంతరం వారు మీడియాతో అన్నారు. ‘‘33 రోజులయినా మా రాజీనామాలను ఆమోదించలేదు. సీఎంను కలిసి, రాజీనామాలను తొందరగా గవర్నర్‌కు పంపాలని కోరాం. రాజీనామాలై నా, ఇంకేదైనా కొద్దిరోజుల్లోనే అంతా కలిసే నిర్ణయం తీసుకుందామని సీఎం చెప్పారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు ఏ స్థాయికైనా వెళ్దామన్నారు’’ అంటూ వివరించారు. రాజీనామాల ఆమోదానికి సీఎంపై ఒత్తిడి చేస్తామన్నారు.
నవంబర్ 2న రాజీనామా: విశ్వరూప్: మంత్రి విశ్వరూప్ సోమవారం సాయంత్రం కిరణ్‌తో వేరుగా భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఏర్పాటు ప్రకటనను కాంగ్రెస్ వెనక్కు తీసుకుంటుందని, రాష్ట్రం సమైక్యంగానే ఉంచుతామని స్పష్టం చేస్తుందని తాను నూటికి నూరుపాళ్లు విశ్వసిస్తున్నట్టు చెప్పారు. అందుకోసం నవంబర్ 1 దాకా ఎదురు చూస్తాన్నారు. అలా చెప్పని పక్షంలో 2న గవర్నర్‌ను కలిసి రాజీనామాను ఆమోదింపచేసుకొని ప్రజా ఉద్యమంలో భాగస్వామిని అవుతానన్నారు.