
సీమాంధ్ర ప్రజలది స్వార్థ రాజకీయ ఉద్యమం కాదు
సీమాంధ్రలో ప్రస్తుతం వెల్లువెత్తుతున్న ఆందోళన స్వార్థ రాజకీయ ఉద్యమం కాదని సీపీఐ పేర్కొంది.
సాక్షి, హైదరాబాద్: సీమాంధ్రలో ప్రస్తుతం వెల్లువెత్తుతున్న ఆందోళన స్వార్థ రాజకీయ ఉద్యమం కాదని సీపీఐ పేర్కొంది. రాష్ట్ర విభజనతో తమకు అన్యాయం జరుగుతుందన్న భయాందోళనలతో విద్యార్థులు, నిరుద్యోగ యువకులు, ఉద్యోగులు రోడ్డెక్కారని అభిప్రాయపడింది. అయితే అందులో పాల్గొంటున్న రాజకీయ పార్టీల నేతలు మాత్రం ప్రజల్లో తమ పట్టు నిలుపుకునేందుకే ఉద్యమంలో చేరారని తెలిపింది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ ఆదివారమిక్కడ ఒక ప్రకటన విడుదల చేశారు.
అఖిలపక్ష సమావేశంలో ఆయా పార్టీలు చెప్పిన అభిప్రాయాలకు వ్యతిరేకంగా విధానాన్ని మార్చుకుని అవకాశవాదాన్ని ప్రదర్శిస్తున్నాయని ఆయన దుయ్యబట్టారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మాట మార్చకపోయినా ఆ పార్టీకి చెందిన కింది స్థాయి నాయకులు ఊగిసలాటలో పడ్డారని, వైఎస్సార్‌సీపీ కూడా మాట మార్చిందని అన్నారు.
కాంగ్రెస్ నాయకులు పైకి ఎంత చెప్పినా.. అసలు ప్యాకేజీ ఏమిటో చెప్పడంలో విఫలమయ్యారని ఆరోపించారు. రాయలసీమకు నీటి సమస్య ప్రధానమైందని, శ్రీశైలం నుంచి నీరు రాకపోతే రాయలసీమ ప్రాంతానికి గడ్డు పరిస్థితి తప్పదని నారాయణ వివరించారు. నిరుద్యోగుల భయాందోళనలను పోగొట్టాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. అలాగే హైదరాబాద్‌లోని సీమాంధ్రుల భద్రతకు చట్టబద్ధ హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.