
విభజిస్తే సీమాంధ్ర అధోగతే: ఆదిరెడ్డి అప్పారావు
సాక్షి, హైదరాబాద్: రాజ్యాంగానికి, సంప్రదాయ స్ఫూర్తికి భిన్నంగా అడ్డగోలుగా, అప్రజాస్వామికంగా, అసమగ్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ బిల్లును తిప్పిపంపాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత ఆదిరెడ్డి అప్పారావు డిమాండ్ చేశారు. విభజనకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకమని, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్నదే తమ పార్టీ డిమాండని శనివారం శాసనమండలిలో ఆయన విస్పష్టంగా వెల్లడించారు. ‘ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో అత్యంత సున్నితమైన రాష్ట్ర విభజన ముసాయిదా బిల్లును రాత్రికి రాత్రే పంపడం అప్రజాస్వామికం.
అందుకే ఈ బిల్లును మా పార్టీ వ్యతిరేకిస్తోంది. ఐదు దశాబ్దాలుగా మూడు ప్రాంతాల వారు పెట్టుబడులు పెట్టి అభివృద్ధి చేసిన హైదరాబాద్‌ను తెలంగాణకు వదిలేస్తే రేపు సీమాంధ్ర ప్రజలు ఉన్నత విద్య, ఉద్యోగాలు, మెరుగైన వైద్యం కోసం ఎక్కడికి వెళ్లాలి? ఈ సమస్యలకు బిల్లులో పరిష్కారాలు చూపలేదు. విభజిస్తే సీమాంధ్ర ప్రాంతం అధోగతి పాలవుతుంది. అసమగ్రంగా ఉన్న బిల్లుపై చర్చ జరిపించే ప్రయత్నం చేయడం సభా హక్కుల ఉల్లంఘనే’ అని అప్పారావు స్పష్టం చేశారు.
ప్రజాప్రభుత్వానికే ‘ఉమ్మడి’పై అధికారం
్డ్డటీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ స్వామిగౌడ్ ప్రసంగిస్తూ.. ‘ఉమ్మడి రాజధాని పరిధిలో భద్రత, ఇతర అంశాలు గవర్నరు పరిధిలో ఉంచాలంటూ బిల్లులో పెట్టిన షరతును తొలగించాలి.గవర్నర్‌కు కాకుండా ప్రజాప్రభుత్వానికే ఉమ్మడి రాజధానిలో భద్రత బాధ్యత అప్పగించాలి’’ అని అన్నారు.
ఉల్లంఘనల వల్లే ఉద్యమం
టీఆర్‌ఎల్డీ ఎమ్మెల్సీ దిలీప్‌కుమార్ మాట్లాడుతూ.. ‘రెండు ప్రాంతాలను కలిపి సమైక్య రాష్ట్రం ఏర్పాటు చేసిన సందర్భంగా కుదిరిన ఒప్పందాలను తర్వాత ప్రభుత్వాలు ఉల్లంఘించాయి. ఫలితం గా తెలంగాణ ప్రజల్లో మొదలైన ఆవేదన ఉద్యమానికి కారణమైంది. ఇది పదవుల కోసం ఉద్యమం కాద’ని చెప్పారు.
ఆ 3 రాష్ట్రాల్లో దారుణ పరిస్థితులు
పీడీఎఫ్ నేత వి.సుబ్రహ్మణ్యం ప్రసంగిస్తూ.. ‘రాజ్యాం గంలోని ఏ అధికరణకు అయినా పరిమితులు ఉంటాయి. అధికరణ 3కు పరిమితులు ఉండవని, కేంద్రం తన ఇష్టప్రకారం రాష్ట్రాలను విభజించడానికి అవకాశం ఉంటుందనే వాదన సరికాదు. ప్రజల దీర్ఘకాలిక ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని బిల్లును వ్యతిరేకిస్తున్నాం. విభజన వల్ల శ్రామిక, కార్మిక వర్గాలకు తీవ్ర నష్టం వాటిల్లుతుంద’ని అన్నారు.