-
సీమాంధ్రలో షర్మిల బస్సుయాత్ర
-
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచే పోరులో వైఎస్సార్‌సీపీ ముందడుగు
-
రాష్ట్ర ప్రజలకు పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ బహిరంగ లేఖ
-
సమైక్యం వైపు ఉన్నది వైఎస్సార్ సీపీ, సీపీఎం, ఎంఐఎంలు మాత్రమే
-
ఓట్లు, సీట్ల కోసం కేంద్రంలోని కాంగ్రెస్ రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించింది
-
చరిత్రహీనుడిగా మిగిలిపోతారని తెలిసినా.. చంద్రబాబు దీన్ని అడ్డుకోవడం లేదు
-
అడ్డగోలుగా విభజిస్తే కుప్పం నుంచి శ్రీకాకుళం వరకూ ఉప్పు నీళ్లే తప్ప మంచినీళ్లేవి?
-
హైదరాబాద్‌లో ఉంటున్న ఉద్యోగులు, ప్రజల పరిస్థితి ఏమిటి?
-
నిరసనగా రాజీనామాలు చేశాం.. నిరాహార దీక్షలు చేసినా అధికార బలంతో భగ్నం చేశారు
-
రాష్ట్రానికి న్యాయం జరగని పరిస్థితుల్లో ఇప్పుడు షర్మిలను మీ మధ్యకు పంపుతున్నా
-
వైఎస్ హయాంనాటి సువర్ణ యుగం జగన్ నాయకత్వంలోనే సాధ్యమని వెల్లడి
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ సాగిస్తున్న పోరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మరో అడుగు ముందుకు వేసింది. న్యాయం చేయాలని తాము నెల రోజులుగా రాజీనామాలు, నిరాహార దీక్షలతో నిరసనలు తెలుపుతున్నా స్పందించటం లేదని.. రాష్ట్రంలో కోట్లాది మంది ప్రజలు నెల రోజులుగా రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నా కూడా.. విభజనపై వెనక్కు వెళ్లేది లేదని కాంగ్రెస్ నేతలు పదే పదే చెప్తుండటం దారుణమని వైఎస్సార్ సీపీ ధ్వజమెత్తింది. నదీ జలాలు, హైదరాబాద్ నగరం, శాంతిభద్రతలు వంటి అనేక జటిలమైన అంశాలను పరిష్కరించటం సాధ్యం కాదని.. ఆంధ్రప్రదేశ్‌ను సమైక్యంగానే ఉంచాలన్న డిమాండ్‌తో ఉద్యమాన్ని ఉధృతం చేస్తూ ఆ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల సోమవారం నుంచి బస్సుయాత్ర ప్రారంభిస్తున్నారు.
రాష్ట్ర ప్రజల సంక్షేమం, రాష్ట్ర భవిష్యత్తు కోసం రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ జగన్ ‘సమైక్య శంఖారావం’గా షర్మిల ప్రజల ముందుకు వస్తున్నారని ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ తెలిపారు. అడ్డగోలుగా తీసుకున్న రాష్ట్ర విభజన నిర్ణయంతో ప్రజలకు జరగబోయే అన్యాయాలను వివరిస్తూ.. ఇందులో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష టీడీపీల అవకాశవాద కుమ్మక్కు రాజకీయాలను ఎండగడుతూ.. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తూ షర్మిల ఉద్యమం సాగుతుందని ఆమె ఆదివారం ఒక బహిరంగ లేఖలో వివరించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇటీవల ప్రధానమంత్రికి లేఖ రాసినట్లుగా.. మూడు పార్టీలు (వైఎస్సార్ కాంగ్రెస్, సీపీఎం, ఎంఐఎం) సమైక్యం వైపు ఉన్నాయని, ఐదు పార్టీలు (కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, టీఆర్‌ఎస్, సీపీఐ) విభజనకు అనుకూలంగా ఉన్నాయని.. టీడీపీ కూడా విభజనకు మద్దతుగా ఇచ్చిన లేఖను ఉపసంహరించుకుని సమైక్యం వైపు రావాలని తాము ఎంతగా విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోయిందని విజయమ్మ ఆ లేఖలో పేర్కొన్నారు.
అధికార కాంగ్రెస్ పార్టీ అన్యాయంగా రాష్ట్రాన్ని చీలుస్తుంటే.. ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు దాన్ని అడ్డుకోవాల్సింది పోయి విభజనను సమర్థిస్తూ చరిత్రహీనుడుగా మిగిలిపోతున్నారని ఆ లేఖలో ధ్వజమెత్తారు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజిస్తే.. దిగువ రాష్ట్రంలో శ్రీకాకుళం నుంచి కుప్పం వరకూ ఉప్పునీళ్లు తప్ప మంచినీళ్లు ఎక్కడ ఉన్నాయని కనీసం ఆలోచించలేదని ధ్వజమెత్తారు. సమైక్య రాష్ట్రంలోనే ఎగువ రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటకల అవసరాలు తీరిన తర్వాత రాష్ట్రానికి కృష్ణా జలాలు రావటం గగనంగా మారిందని.. ఇప్పుడు రాష్ట్ర విభజన జరిగి మరో రాష్ట్రం ఏర్పడితే దిగువ రాష్ట్రానికి సాగునీటి సంగతి దేవుడెరుగు.. గుక్కెడు మంచినీళ్లు కూడా దక్కవని విజయమ్మ ఆ తర్వాత ఇడుపులపాయలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఆందోళన వ్యక్తంచేశారు. ఇక మిగులు జలాలపై ఆధారపడి నిర్మించిన ఇతరత్రా ప్రాజెక్టుల సంగతి ఏమిటని ప్రశ్నించారు.
అలాగే ఆంధ్రప్రదేశ్ రాజధానిగా హైదరాబాద్‌లోనే 90 శాతం సేవా రంగ పరిశ్రమలు, 75 శాతం తయారీ రంగ పరిశ్రమలు కేంద్రీకృతమై ఉన్నాయని.. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వ రంగంలోని భారీ పరిశ్రమలను సైతం రాష్ట్ర రాజధాని నగరంలోనే నెలకొల్పారని ఆమె వివరించారు. ఆయా పరిశ్రమలు, వాటి అనుబంధ పరిశ్రమలపై ఆధారపడి కోట్లాది మంది జీవిస్తుండగా.. విభజనతో వారి పరిస్థితి ఏమవుతుందని ప్రశ్నించారు. కాంగ్రెస్ రాష్ట్ర విభజన ప్రకటన చేసిన వెంటనే.. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు నవ్వుతూ, కూల్‌గా మాట్లాడుతూ నాలుగు లక్షల కోట్లు ఇస్తే కొత్త రాజధానిని నిర్మించుకుంటామనటం అన్యాయమని విజయమ్మ తప్పుపట్టారు. నాలుగు లక్షల కోట్లు కాదు కదా వేల లక్షల కోట్లు ఇచ్చినా హైదరాబాద్ వంటి రాజధానిని నిర్మించుకోవటం సాధ్యం కాదన్నారు. ఎందుకంటే.. ఇప్పుడు ప్రభుత్వ రంగమనేదే లేదని, కొత్త రాజధానిలో ప్రభుత్వ రంగ సంస్థల ఏర్పాటు జరగకపోగా.. ప్రయివేటు రంగ పరిశ్రమలకూ ఆస్కారం ఉండదని.. విద్యుత్ కొరత, నిధుల కొరత వంటి అనేక అంశాలు ఇందులో ఇమిడి ఉన్నాయన్నారు. విభజనపై కేవలం కాంగ్రెస్ నిర్ణయం ప్రకటిస్తేనే.. కేంద్ర ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోకముందే.. సీమాంధ్ర ఉద్యోగులు హైదరాబాద్‌ను విడిచివెళ్లాల్సిందేనని టీఆర్‌ఎస్ అధినేత ‘నో ఆప్షన్’ అని ప్రకటనలు చేయటంతో హైదరాబాద్‌లోని సీమాంధ్ర ప్రజల్లో తీవ్ర భయాందోళనలు రేగుతున్నాయని ఆమె పేర్కొన్నారు.
బహిరంగ లేఖ, మీడియా సమావేశంలో వివరించిన అంశాల సారాంశమిదీ...
‘‘కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ ఓట్లు సీట్లు తప్ప మరో ప్రాతిపదిక లేకుండా ఈ రాష్ట్రాన్ని అడ్డంగా చీలుస్తోంది. హైదరాబాద్ పదేళ్లు ఉమ్మడి రాజధానిగా ఉంటుందని, ఆ లోగా సీమాంధ్రలో వేరే రాజధాని కట్టుకోవాలని ప్రకటించి చేతులు దులుపుకొంటోంది. రాష్ట్రాన్ని ఇలా అడ్డగోలుగా విభజిస్తే.. కుప్పం నుంచి శ్రీకాకుళం దాకా సముద్రం నీళ్లు తప్ప మంచి నీళ్లు ఎక్కడ ఉన్నాయి అనే కనీస ఆలోచనను కూడా పక్కనపెట్టారు. కృష్ణా ఆయకట్టులో ప్రజలు రోజూ కొట్టుకున్నా మాకేంటి అన్నట్లుగా, పోలవరానికి నీళ్లు రాని పరిస్థితి తలెత్తినా అది తమ సమస్య కాదన్నట్లుగా, నిర్లక్ష్య వైఖరితో ఓట్లు సీట్లు ప్రాతిపదికన కాంగ్రెస్ పార్టీ అడ్డగోలు నిర్ణయం తీసుకునేందుకు తెగించింది. ఇలా విభజన చేస్తే చదువుకున్న పిల్లవాడు ఉద్యోగం కోసం ఎక్కడకు వెళ్తాడనే ధ్యాస కూడా కాంగ్రెస్‌కు లేదు. హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న ఉద్యోగులు, ప్రజల పరిస్థితి ఏమిటనే ఆలోచన లేదు.
రాష్ట్ర బడ్జెట్‌లో 50 శాతం నిధులు హైదరాబాద్ నుంచే వస్తున్న నేపథ్యంలో ఈ నిధులు రాకపోతే.. ఈ నిధులను వేరే రాజధాని కట్టుకోవటానికి దారి మళ్లిస్తే... మరి ఉద్యోగులకు ఇవ్వాల్సిన జీతాల పరిస్థితి ఏమిటి? సంక్షేమ పథకాల అమలు ఎలా? అన్న ఆలోచనలను పూర్తిగా పక్కన పెట్టేశారు. ఓట్లు, సీట్లు ప్రాతిపదికన విభజన చేయాలని అనుకుంటున్న కాంగ్రెస్ పార్టీ చారిత్రాత్మక తప్పిదం చేస్తుంటే, ప్రతిపక్ష నేతగా ఉండికూడా ఆ తప్పిదాన్ని చంద్రబాబు నాయుడు అడ్డుకోవటం లేదు. అలా అడ్డుకోకుండా ఆయన చరిత్ర హీనుడిగా మిగిలిపోతున్నాడు. ఏపీఎన్జీవోలు చంద్రబాబు దగ్గరికి వెళ్లి విభజన మీద మీరు ఇచ్చిన లేఖను వెనక్కు తీసుకోండని ప్రాధేయపడితే కనికరం లేకుండా కుదరదన్నాడు.
స్వార్థ రాజకీయాలకు పరాకాష్ట బాబు..
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇటీవల ప్రధాన మంతికి లేఖ రాసినట్లుగా.. వైఎస్సార్ కాంగ్రెస్, సీపీఎం, ఎంఐఎం - మూడు పార్టీలు సమైక్యం వైపు ఉన్నాయి. కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, టీఆర్‌ఎస్, సీపీఐ - ఐదు పార్టీలు విభజనకు అనుకూలంగా ఉన్నాయి. ‘అయ్యా చంద్రబాబు గారూ... మీరు కూడా ఆ మూడు పార్టీల వైపు రండి, ఆ మేరకు ప్రధానమంత్రికి లేఖ రాయండి’ అని మేం బహిరంగ లేఖ ద్వారా అడిగినా మా వేదన అరణ్య రోదనగానే మిగిలింది. ‘అయ్యా బాబు గారూ.. విభజన మీద మీ లేఖ వెనక్కు తీసుకోండి. మీ పదవికి రాజీనామా చేసి మీ ఎమ్మెల్యేలతో ఎంపీలతో రాజీనామా చేయించండి. అప్పుడు ఎలా విభజించగలుగుతారో చూద్దాం’ అని మేం చంద్రబాబుకు విజ్ఞప్తి చేస్తూ వచ్చాం. తాను సీట్లు నష్ట పోతాడని, తనకు ఓట్లు రాకుండా పోతాయని, తనకు క్రెడిట్ దక్కకుండా పోతుందనే భావనతో స్వార్థ రాజకీయాలకు చంద్రబాబు పరాకాష్టగా నిలిచారు. ఇంతటి కీలక సమయంలో, స్పందించవలసిన సమయంలో స్పందించకపోతే చరిత్ర హీనులుగా నిలిచిపోతారనే అంశాన్ని కూడా ఆయన పక్కన పెట్టారు.
సమైక్య పోరులో మరో ముందడుగు..
ఈ అన్యాయానికి నిరసనగా మా పదవులకు రాజీనామాలు చేయడమే కాకుండా.. మా ఎంపీ, ఎమ్మెల్యేలందరి చేత రాజీనామాలు చేయించాం. అంతే కాక, నేను సైతం గుంటూరులో నిరాహారదీక్షకు కూర్చుంటే ప్రభుత్వం జులుంతో ఆ దీక్షను భగ్నం చేసింది. జగన్ కూడా జైలులో ఉన్నా నిజాయితీతో రాజకీయాలు కొనసాగిస్తూ... కష్టమనిపించినా తాను నిరాహారదీక్ష చేశాడు. ఆ దీక్షను కూడా అధికార బలంతో భగ్నం చేశారు. ఈ పోరులో రాష్ట్రానికి న్యాయం జరగని పరిస్థితుల్లో.. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచే పోరాటంలో మరో అడుగు ముందుకు వేస్తూ సెప్టెంబర్ 2వ తేదీ నుంచి షర్మిల సమైక్య శంఖారావం యాత్రతో మీ మధ్యకు వస్తున్నారు.’’