
సాక్షి, గుంటూరు: శివ చెర్రి...సినిమా పరిశ్రమలో మెగా కుటుంబానికి, రాష్ట్రంలోని ఆ హీరోల అభిమానులకు సుపరిచితమైన పేరు. మెగా హీరోల సినిమాలకు ఆడియో ఫంక్షన్ల నుంచి, హైదరాబాద్ వెలుపల వారు పాల్గొనే పలు సభలు, సమావేశాలకు కీలక బాధ్యతల్లో తరచుగా వినిపిస్తుందా పేరు. ఆ క్రమంలోనే ఇప్పుడు సినీ ఎగ్జిక్యూటివ్ నిర్మాత అయ్యాడు. ఒకప్పుడు సినిమా ఫంక్షన్ల పాస్‌ల కోసం పాకులాడిన ఈ తెనాలి కుర్రోడు నేడు తన ఆధ్వర్యంలోనే మెగా హీరోల ఆడియో ఫంక్షన్లు జరిగేంతలా ఎదిగాడు. సినిమా అభిమానులంటే పనీపాట లేనివాళ్ల వ్యాపకమని చిన్నచూపు చూసే సమాజానికి, నిజమైన ‘అభిమానం’ జీవితాన్నిస్తుందని నిరూపించాడు. సినిమా నిర్మాణ రంగంలో తెనాలి కీర్తిప్రతిష్టలను నిలబెడతానని చెబుతున్నాడు శివ చెర్రీ.
రాంచరణ్ అభిమాని నుంచి సినీ ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా...
శివ చెర్రి అసలు పేరు పసుపులేటి శివ. మధ్యతరగతి కుటుంబం. తండ్రి హజరత్ సినిమా థియేటర్లో క్యాంటిన్ నడిపేవారు. నష్టం రావటంతో కుటుంబంతో సహా కొల్లూరు మకాం మార్చారు. అక్కడో చిన్న క్యాంటిన్ తీసుకున్నారు. నాలుగేళ్ల తర్వాత తెనాలి తిరిగొచ్చారు. అప్పటికి శివకు పదోతరగతి పూర్తవటంతో ఇక్కడే ఇంటర్‌లో చేరాడు. హైస్కూలులో రెండేళ్లు విద్యార్థి నాయకుడిగా, హౌస్ కెప్టెన్‌గా వున్న అనుభవం కలిగిన శివకు ఏదొకటి చేయాలన్న ఉత్సాహం. తాను అభిమానించే సినీనటుడు రామ్‌చరణ్ సినిమా మగధీర రిలీజయ్యే సమయం. తోటి స్నేహితులను కూడగట్టి, చరణ్ ఫాన్స్ అసోసియేషన్ స్థాపించాడు...అధ్యక్షుడయ్యాడు.
చేతిలో రూపాయి లేకున్నా, సభ్యుల చందాలు రూ.80 వేలతో సినిమా విడుదల రోజున పట్టణాన్ని ఫ్లెక్సీలతో నింపేశాడు...తొలియత్నంలోనే తెనాలి సినీ అభిమానులు శివకేసి చూశారు. తర్వాతి సినిమాకు మరింత ఆర్భాటం చేశారు. తొలినుంచీ సినిమాపై గల పిచ్చి, తండ్రి చిరంజీవి ఫ్యాన్స్ అధ్యక్షుడు కావటం ఇందుకు పురిగొల్పాయంటారు శివ. మరోవైపు చరణ్, చిరంజీవి జన్మదినాల్లో సేవా కార్యక్రమాలు, రక్తదాన శిబిరాల నిర్వహణ, ఆ ఫోటోలను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయటం మామూలే...
శివచెర్రీగా..పసుపులేటి శివ
హైదరాబాద్‌లో చిరంజీవి ఆధ్వర్యంలో నడిచే బ్లడ్‌బ్యాంకుకు శనివారం వెళితే ‘మెగా’ నటులను కలుసుకోవచ్చని తెలిసి.. ప్రతి శుక్రవారం డెల్టా ప్యాసింజరుకు వెళ్లటం, ఉదయాన్నే బ్లడ్‌బ్యాంకుకు వెళ్లి, సాయంత్రం వరకు అక్కడ ఎదురుచూడటం...నిత్య కార్యక్రమంగా చేసుకున్నాడు. ఒకరోజు చిరంజీవి ఫ్యాన్స్ అధ్యక్షుడు, బ్లడ్‌బ్యాంక్ సీఈఓ స్వామినాయుడు దృష్టిలో పడ్డాడు. చిన్నవయసులోనే రక్తదానం వంటి పలు సేవాకార్యక్రమాలు నిర్వహించడం తెలుసుకున్న అతను టచ్‌లో ఉండమని చెప్పాడు.
ఒకరోజు స్వామినాయుడు నుంచి పిలుపురావడంతో అమ్మతో కలిసి హైదరాబాద్ వెళ్లటం శివ జీవితానికి మలుపు. ‘శివలో సేవాగుణం ఉంది...ఇక్కడ వదిలేసి వెళ్లండి...మేం చూసుకుంటాం’ అనటంతో బట్టలు, రూ.3 వేల నగదు ఇచ్చేసి అమ్మ వెళ్లిపోయింది’ అని చెప్పారు శివ. స్పోకెన్ ఇంగ్లిష్, కంప్యూటర్ కోర్సులో చేర్పించారు. తర్వాత అక్కడే బీకెట్ పూర్తిచేశారు. అప్పుడే రాష్ట్ర ‘రామ్‌చరణ్ యువశక్తి’ని ప్రారంభించి, రాష్ట్రమంతా తిరిగి, అన్ని జిల్లాల్లో యువశక్తి విభాగాలను ఆరంభించారు. దీంతో పసుపులేటి శివ, శివ చెర్రీగా స్థిరపడిపోయారు.
ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా..
ఈ క్రమంలో రామ్‌చరణ్, అల్లు అర్జున్‌తో సహా మెగా కుటుంబంతో సాన్నిహిత్యం పెరిగింది. ఆడియో ఫంక్షన్లు, టీజర్ల విడుదల సహా అన్ని కార్యక్రమాల్లోనూ తన బాధ్యతలు తప్పనిసరైంది. బయట హీరోలతోనూ సంబంధాలు ఏర్పడ్డాయి. హీరో సందీప్‌కిషన్ ఆహ్వానంపై అతనికి మేనేజరుగా వెళ్లాడు. అదే హీరో వెంకటాద్రి టాకీస్ స్థాపించి, ‘నిను వీడని నీడను నేను’ సినిమాకు శ్రీకారం చుట్టినపుడు, శివ చెర్రీకి ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా అవకాశం కల్పించారు.
ఆ సినిమా హిట్ కావటంతో రెండోసినిమా ‘తెనాలి రామకృష్ణ బీఏ.,బీఎల్’ చిత్రం జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో త్వరలో సెట్స్‌పైకి వెళ్లనుందని శివ వెల్లడించారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా 20 మంది స్నేహితులకూ ఉపాధి చూపాననీ, ఎప్పటికైనా సొంతంగా ప్రొడక్షన్ సంస్థను స్థాపించాలనేది తన తాజా కలగా శివ చెప్పారు. తెనాలిలో ఏటా వినాయక చవితి వేడుకల్లో పాల్గొనటం శివకు అలవాటు, ఏటా ఒక సినిమా హీరోను ఇక్కడకు తీసుకొస్తున్నారు. ఈసారి సంపూర్ణేష్‌బాబు, విశ్వక్‌సేన్‌తో ఇక్కడ చవితి సందడి చేయించారు. తన ఎదుగుదలకు కారణమైన సినిమాకు, మెగా కుటుంబానికి రుణపడి ఉంటానని చెబుతారు శివ.
Comments
Please login to add a commentAdd a comment