కౌడిపల్లి, న్యూస్‌లైన్ : ట్రాన్స్‌ఫార్మర్ వద్ద ఎర్తింగ్ లోపం కారణంగా పలువురి ఇళ్లకు కరెంట్ షాక్ వచ్చింది. ఈ సంఘటన మండలంలోని తిమ్మాపూర్ ఎస్సీ కాలనీలో గురువారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం మేరకు.. గ్రామంలో వాటర్ ట్యాంక్ వద్ద ఎస్సీ కాలనీ సరఫరా అయ్యే సింగిల్ ఫేజ్ ట్రాన్స్‌ఫార్మర్ ఉంది. కాగా ట్రాన్స్‌ఫార్మర్ వద్ద ఎర్తింగ్ లోపం కారణంగా అర్ధరాత్రి ఒక్కసారిగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వచ్చింది. దీని కారణంగా ఇళ్లలోని కరెంట్ సరఫరా అవుతున్న ఎలక్ట్రానిక్ పరికరాలకు షాక్ వచ్చింది.
ఇదిలా ఉండగా.. గ్రామానికి చెందిన రాగి మొగులయ్య ఇంట్లో కుటుంబ సభ్యులు అందరూ పడుకున్నారు. అయితే కొంత సమయం తరువాత అతడి కుమార్తె నీళ్లు తాగేందుకు నిద్ర లేచింది. ఈ సమయంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఇంట్లో ఉన్న కలర్ టీవీ నుంచి పొగలు వస్తున్న విషయాన్ని గమనించి కుటుంబ సభ్యులను లేపింది. అనంతరం టీవీ ప్లగ్ తీస్తుండగా విద్యుదాఘాతానికి గురై కిందకు పడిపోయింది. అయితే కొద్దిసేపటికి కరెంటు పోవడంతో ప్రమాదం తప్పింది.
ఈ ఘటనతో టీవీ పూర్తిగా దగ్ధం అయ్యింది. ఈ విషయం అధికారులకు ఫిర్యాదు చేయడంతో శుక్రవారం ఉదయం లైన్ ఇన్‌స్పెక్టర్ కృష్ణ, సీఎల్ రఘుపతి, ఆపరేటర్ నాగరాజు తదితరులు మరమ్మతులు చేశారు. ఎర్తింగ్ లోపం కారణం గానే షార్ట్ సర్క్యూట్ అయ్యిందని తెలిపారు. మరమ్మతులు చేసి లోపాన్ని సవరించినట్లు వారు వివరించారు.
తిమ్మాపూర్ ఎస్సీ కాలనీకి విద్యుత్ షాక్
Published Fri, Feb 21 2014 11:45 PM | Last Updated on Thu, Jul 11 2019 7:48 PM
Advertisement