
ఆరుగురూ.. అనాథలయ్యారు
సాక్షి, కుప్పం: నిరుపేద కుటుంబం. ఆపై అధిక సంతానం. మతి స్థిమితం లేని తల్లి ఎటో వెళ్లిపోయింది. తండ్రి అనారో గ్యంతో మృతిచెందాడు. అనాథలైన వారి పిల్లలు తమకు దిక్కెవరు దేవుడా అంటూ తండ్రి మృతదేహం వద్ద విలపించడం స్థానికుల హృదయాలను కదిలించింది. ఈ దయనీయ సంఘటన కుప్పం సమీపంలోని షికారి కాలనీలో బుధవారం చోటు చేసుకుంది.
కాలనీకి చెందిన రావు (52)కు విజయ్ (12), అర్జున్(10), తిరుపతి(8), చిరంజీవి(7), బాలి(6), గంగ(3) అనే ఆరుగురు పిల్లలు ఉన్నారు. భార్యకు మతిస్థిమితం లేకపోవడంతో కొద్ది రోజుల క్రితం ఎటో వెళ్లిపోయింది. ఆమె కోసం వెతికినా లాభం లేకపోయింది. సంతలో ఆట బొమ్మలు అమ్ముకుంటూ రావు తన ఇద్దరు కుమార్తెలు, నలుగురు కుమారులను పోషించుకుంటున్నాడు.
ఈ క్రమంలో ఆయనకు కాలేయ సంబంధిత వ్యాధి వచ్చింది. వైద్యం చేయించుకునేందుకు ఆర్థిక స్థోమత లేకపోవడంతో అలాగే వదిలేశాడు. ఈ క్రమంలో వ్యాధి తీవ్రమై బుధవారం మృతిచెందాడు. తండ్రి మృతదేహం వద్ద పిల్లలు బోరున విలపిస్తూ ఉండడం అందర్నీ కంటతడి పెట్టిం చింది. ఈ విషయం తెలుసుకున్న సర్పంచ్ సుబ్రమణ్యం స్పందించారు. మానవతా దృక్పథంతో పిల్లలను ఓదార్చి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు.