అనంతపురం : శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ, పీజీ పరీక్షల రీవాల్యుయేషన్‌లో మార్కులు తగ్గడంపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్ విద్యార్థి విభాగం, బీసీ విద్యార్థి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఆనంద్‌ను ఘెరావ్ చేశారు. సంఘటన వివరాల ప్రకారం.. ఎమ్మెస్సీ కెమిస్ట్రీ చదువుతున్న విద్యార్థులకు సంబంధిత సబ్జెక్ట్ లో తక్కువ మార్కులు రావడంతో 70 మంది విద్యార్థులు రీవాల్యుయేషన్‌కు దరఖాస్తు చేసుకోగా ఫలితాల్లో అందరినీ ఫెయిల్ చేశారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
గతంలో వచ్చిన మార్కుల కంటే తక్కువ మార్కులు నమోదు చేసి చూపించారని ఆరోపించారు. రీవాల్యుయేషన్‌లో ఫెయిల్ అయిన విద్యార్థులకు మరోమారు రాత పరీక్షలకు దరఖాస్తు చేసుకోవడానికి నేడు ఆఖరి రోజు కావడంతో దరఖాస్తు గడువు పెంచాలని రిజిస్ట్రార్ ఆచార్య కె.దశరథరామయ్యను కోరారు. రీవాల్యుయేషనలో అక్రమాలు జరిగాయని రిజిస్ట్రార్‌తో వాగ్వాదం చేశారు. ఈ కార్యక్రమంలో జయచంద్రారెడ్డి, కె.మల్లిఖార్జున, చిన్న శంకర్‌నాయక్, బంగారప్ప, సిద్దప్ప తదితరులు పాల్గొన్నారు.