నేరాలే ఆయన చరిత్ర.. దౌర్జన్యాలు, బెదిరింపులు, సెటిల్‌మెంట్లే దినచర్య.. రౌడీ మూకలను వెంటేసుకొని కనిపించిన స్థలాలు, భూములను కబ్జా చేసే అతగాడు ఖద్దరు ముసుగేసుకొని రాజకీయ నేతగా చెలామణీ అయిపోతున్నాడు. ఒకప్పడు ఖాకీలను చూస్తే వణికిపోయే.. ఈ ఖద్దరు ముసుగు నేత ఇప్పుడు పచ్చ కండువా వేసుకొని పెచ్చరిల్లిపోతున్నాడు. నగరంలో జరిగిన ఒకానొక ఉప ఎన్నికల్లో రివాల్వర్‌తో వీరంగం చేయడం.. సాక్షాత్తు మహిళా పోలీసు అధికారిని వేధింపులకు గురి చేయడం, భూకబ్జాలకు తెగబడటం వంటి కేసులతోపాటు హత్య కేసులోనూ ప్రమేయముందన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న సదరు నేతను.. ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ నెత్తికెక్కించుకోవడమే కాకుండా.. తాజాగా అతన్ని ప్రజలపై రుద్దేందుకు ప్రయత్నిస్తోంది.
ఎటువంటి నేరచరిత్ర, వివాదాలు లేని వ్యక్తులుగా ఎన్నికల్లో పోటీ చేయించాలన్న నిబంధనలు, నైతిక విలువలకు వలువలూడ్చే రీతిలో తెలుగుదేశం ప్రవర్తిస్తోంది. ఎప్పుడో ఎందుకు.. రెండు రోజుల క్రితమే ఓ భూకబ్జా కేసు కూడా నమోదైన సదరు నేత.. గండి బాబ్జీని ప్రస్తుత జీవీఎంసీ ఎన్నికల్లో కార్పొరేటర్ అభ్యర్థిగా.. గెలిస్తే తమ పార్టీ తరఫున మేయర్ అభ్యర్థిగానూ తెలుగుదేశం పార్టీ ప్రతిపాదిస్తున్న సదరు గండి బాబ్జీ.. కేసుల చిట్టా దండిగానే ఉంది. – సాక్షి, విశాఖపట్నం
సాక్షి, విశాఖపట్నం: మహా విశాఖ నగరంలో రౌడీయిజం, నేరాలు, దౌర్జన్యాలతో రాజకీయాన్ని కలుషితం చేసిన ఘనత తెలుగుదేశం పార్టీదే. వంగవీటి రంగా హత్య కేసులో మూడో ముద్దాయిగా ఉండి.. విజయవాడ నుంచి విశాఖకు పారిపోయి వచ్చి తలదాచుకున్న వెలగపూడి రామకృష్ణకు రాజకీయ ఆశ్రయం కల్పించి.. ఎమ్మెల్యేగా ప్రజలపై రుద్దిన చరిత్ర ఆ పార్టీదే. అలా ఎదిగిన ఆయనగారు కోడి పందాలు, లిక్కర్ సిండికేట్, రౌడీ గ్యాంగులు సెటిల్‌మెంట్ దందాలతో చెలరేగిపోతున్న వెలగపూడికి తోడు పెందుర్తి నియోజకవర్గానికి చెందిన గండి బాబ్జీని ప్రజాప్రతినిధిగా నగర ప్రజలపై రుద్దేందుకు తెలుగుదేశం నాయకత్వం ప్రయత్నిస్తోంది.
ఇప్పుడు జీవీఎంసీ పాలకవర్గానికి జరుగుతున్న ఎన్నికల్లో 95వ వార్డు నుంచి టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థిగా గండి బాబ్జీ నామినేషన్ వేశారు. తెలుగుదేశం అభ్యర్థుల జాబితా ఇంకా ప్రకటించకపోయినా.. వార్డు అభ్యర్థిగా బాబ్జీ పేరును ఖరారు చేయడమే కాకుండా.. తమ పార్టీ తరఫున మేయర్ అభ్యర్థిగానూ ఆయన్ను తెరపైకి తెస్తున్నట్లు ఆ పార్టీ వర్గాలే చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో సదరు బాబ్జీగారి నేరచరిత్రను నగర ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. చదవండి: 'నా టైమ్ వస్తే మిమ్మల్ని కాలితో తొక్కేస్తా'
రివాల్వర్‌తో వీరంగం
2006 ఫిబ్రవరి 19న విశాఖ–1 నియోజకవర్గ ఉప ఎన్నికల సమయంలో పాతపోస్టాఫీస్ వద్ద గండి బాబ్జీ రివాల్వర్‌తో బెదిరింపులకు పాల్పడటం పెద్ద సంచలనం రేపింది. దీనిపై క్రైమ్ నంబర్ 47తో కేసు నమోదైంది. అదే ఏడాది మార్చి 2వ తేదీన సిటీ కోర్టులో బాబ్జీ లొంగిపోయారు. రెండేళ్ల క్రితం ఈ కేసు క్లోజ్ అయ్యింది. 2019లో నగరానికి చెందిన మహిళ పోలీస్ అధికారి గండి బాబ్జీపై వేధింపులు, మోసం కేసు పెట్టడం సంచలనంగా మారింది.
కబ్జాల బాబ్జీ
పెందుర్తిలో సుమారు ఏడున్నర ఎకరాల చెరువును తప్పుడు పత్రాలతో గండి బాబ్జీ చెరబట్టారనే తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. దీనిపై చాలాకాలంగా వివాదం నడుస్తోంది. మొగలిపురం రెవెన్యూ పరిధిలో నాలుగు ఎకరాల ప్రభుత్వ భూమిని కూడా కబ్జా చేశారు. దేవిపురం సమీపంలో దాదాపు 40 ఎకరాల డీ ఫారం, ఇనాం భూముల కబ్జా వ్యవహారంలో గండి బాబ్జీ పాత్ర ఉందన్న ఆరోపణలు ఉన్నాయి.
స్వార్థ రాజకీయ బంధం
2017లో చంద్రబాబు సమక్షంలో గండి బాబ్జీ టీడీపీలో చేరారు. అయితే తన చిరకాల ప్రత్యర్థి అయిన టీడీపీ నేత బండారు సత్యనారాయణమూర్తితో ఇమడలేక చాలాకాలం పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు. అనూహ్యంగా 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో బండారు–బాబ్జీ జతకట్టారు. అప్పటి నుంచి ఇద్దరూ చెట్టపట్టాలేసుకుని తిరగడం మొదలుపెట్టారు. ఒకే పార్టీలో ఉంటూ చాలాకాలం పాటు కత్తులు దూసుకున్న ఈ ఇద్దరూ స్వార్థం కోసం ఏకమయ్యారని ప్రజలు బహిరంగంగానే దుమ్మెత్తి పోశారు. ఎన్నికల్లో చిత్తుగా ఓడించారు. ఎమ్మెల్యే బండారు కొడుకు అప్పలనాయుడు, బాబ్జీ తమ్ముడు రవి ఇద్దరూ ఒకే కోవకు చెందిన వ్యక్తులు. సెటిల్‌మెంట్లు, దౌర్జన్యాలకు పెట్టింది పేరు.
రెండు రోజుల క్రితం గండిపై కబ్జా కేసు..
గండి బాబ్జీపై తాజాగా మరో కబ్జా కేసు నమోదైంది. నరసింహనగర్‌కు చెందిన లివింగ్‌స్టోన్ అనే వ్యక్తి ఈనెల 13న బాబ్జీపై ఫిర్యాదు చేశారు. లివింగ్‌స్టోన్ క్రిష్టియన్ ఫెలో షిప్ సొసైటీ అనే సంస్థను నడిపిస్తున్నారు. 1990లో బాలయ్యశాస్త్రి లేఅవుట్‌లో తాము కొనుగోలు చేసిన 200 చదరపు అడుగుల స్థలాన్ని గండిబాబ్జీ కబ్జా చేశారని నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆయన ఫిర్యాదు మేరకు బాబ్జీపై ఈ నెల 13న క్రైమ్ నంబర్ 82/20తో సెక్షన్ 447, 427లతో కేసు నమోదు చేశారు.
వెంట నలుగురు రౌడీషీటర్లు..
బాబ్జీ వెంట నిరంతరం నలుగురైదుగురు రౌడీ షీటర్లు ఉంటారు. బాబ్జీ ఎక్కడికి వెళ్లినా నీడలా అనుసరిస్తుంటారు. అలాంటి వ్యక్తిని మేయర్ అభ్యర్థిగా టీడీపీ ప్రకటించడంతో నగర ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి రౌడీ రాజకీయాలు చేసే వ్యక్తులకు ఉన్నత స్థానాన్ని కట్టబెట్టాలనుకోవడం సరికాదంటున్నారు.
2014 ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్న బాబ్జీ నేరాల చిట్టా ఇదీ..
•మొత్తం కేసులు– 04
•సీరియస్ ఐపీసీ సెక్షన్లు– 03
•ఇతర ఐపీసీ సెక్షన్లు– 07 కేసులు.. సెక్షన్లు..
•ఎన్నికల సమయంలో అక్రమంగా డబ్బు పంపిణీ చేస్తున్నందుకు ఐపీసీ సెక్షన్ 171 హెచ్
•సాక్ష్యాలను మాయం చేయడం, తప్పుడు సమాచారం ఇచ్చిన కేసులో ఐపీసీ సెక్షన్ 201
• క్రిమినల్ బెదిరింపులకు సంబంధించి ఐపీసీ సెక్షన్ 506
• విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగిని బెదిరించిన కేసులో సెక్షన్ 186
• ప్రభుత్వ ఉద్యోగి వి«ధులకు ఆటంకం కలిగించిన కేసులో సెక్షన్ 188
•ఉద్దేశ పూర్వకంగా విధులకు ఆటంకం కలిగించిన కేసులో సెక్షన్ 34
• ప్రభుత్వ ఉద్యోగులకు లంచం ఎర వేసిన కేసులో సెక్షన్ 171
•మహిళ పట్ల అవమానకరంగా ప్రవర్తించిన కేసులో సెక్షన్ 509
అప్పట్లోనే ఆరోపణలు
గండి బాబ్జీ స్వగ్రామం సబ్బవరం మండలం మొగలిపురం. బీఎల్ చదివారు. అయితే స్కాలర్ షిప్ కోసం కళాశాలకు ఎస్సీ సర్టిఫికెట్ ఇచ్చారన్న ఆరోపణలతో అప్పట్లో కేసు నమోదైంది. నాడు పెద్దలు జోక్యం చేసుకుని ఆ కేసును మాఫీ చేసినట్లు చెప్పుకుంటారు. కొన్నాళ్లు లాయర్‌గా ప్రాక్టీస్ చేసిన ఆయన కాంగ్రెస్ పంచన చేరి రాజకీయ జీవితం ప్రారంభించారు. 2009లో హైదరాబాద్‌కు చెందిన మంజులారెడ్డి అనే మహిళ హత్య వెనుక బాబ్జీ హస్తం ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. 2004 వరకు కాంగ్రెస్‌లో సాధారణ నాయకుడిగా ఉన్న బాబ్జీ.. ఆ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అప్పటి పరవాడ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009, 2014 ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
63వ వార్డు టీడీపీ అభ్యర్థిదీ అదే దారి
63వ వార్డులో నామినేషన్ వేసిన టీడీపీ అభ్యర్ది గల్లా పోలిపల్లి (గల్లా చిన్నా)దీ నేరచరిత్రే. ఈయనపై 2015 డిసెంబర్ 4న కేసు నమోదైంది. డాబాగార్డెన్స్‌కు చెందిన గూడెల బాలజీ అనే వ్యక్తి నుంచి కొంత నగదును గల్లా చిన్నా అప్పుగా తీసుకున్నాడు. తన డబ్బును తిరిగి ఇవ్వాలని ఒత్తిడి తెచ్చిన బాలాజీపై గల్లా చిన్నా, అతని అనుచరులు కత్తులతో దాడి చేసి గాయపరిచారు. దీనిపై టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో గల్లా చిన్నాపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment