సామాజిక సువార్త బోధించాలి
- బిషప్‌లకు కేంద్ర మంత్రి జేడీ శీలం పిలుపు
- సీఎస్‌ఐ-సినాడు కమిటీ బాధ్యతల స్వీకారం
విజయవాడ, న్యూస్‌లైన్ : సమాజంలో అసమానతలను రూపుమాపేందుకు సంఘాలకతీతంగా బిషప్‌లు సామాజిక సువార్త బోధించాలని కేంద్ర సహాయ మంత్రి జేడీ శీలం చెప్పారు. దక్షిణ ఇండియా సంఘం (చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా-సీఎస్‌ఐ) సినాడు నూతన కమిటీ బాధ్యతల స్వీకారోత్సవం ఆదివారం రాత్రి ఘనంగా జరిగింది. స్థానిక బిషప్ అజరయ్య గ్రౌండ్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో జేడీ శీలం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ బిషప్‌ల సందేశం గ్రామీణ ప్రాంతాలకు చేరాలన్నారు.
గ్రామీణులను శక్తిమంతులుగా తీర్చిదిద్దేందుకు క్రైస్తవ మత గురువులు కృషి చేయాలని కోరారు. మంచి మనసున్న దేవుని బిడ్డలుగా తీర్చిదిద్దేందుకు సువార్త ప్రచారం చే యాలన్నారు. క్రైస్తవ సంఘాలన్నీ కలిసి మంచి శక్తిగా ఎదగి సమర్ధ నాయకత్వాన్ని ఏర్పరచుకోవాలని చెప్పారు. సామాజిక సేవలో సైతం ముందుం డాలని ఆకాంక్షించారు. మోడరేటర్ (మహా పీఠాధిపతి)గా ఎన్నికైన కృష్ణా-గోదావరి అధ్యక్ష ఖండం బిషప్ గోవాడ దైవాశీర్వాదాన్ని దుశ్శాలువాతో సత్కరించారు. ఆర్సీఎం విశాఖపట్నం ఆర్చ్ బిషప్ మల్లవరపు ప్రకాష్ మాట్లాడుతూ మోడరేటర్‌గా ఎన్నికైన దైవాశీర్వాదంతో తనకు పదేళ్లుగా మంచి అనుబంధం ఉందన్నారు.
ఆయన మోడరేటర్‌గా సీఎస్‌ఐని మరింత ముందుకు నడిపించగలరన్న ఆశాభావం వ్యక్తంచేశారు. ఇప్పటి వరకు మోడరేటర్‌గా వ్యవహరించిన ది మోస్ట్ రెవరెండ్ దైవకడాశం మాట్లాడుతూ సీఎస్‌ఐ ఆధ్వర్యాన విద్యాసంస్థలు, ఆస్పత్రుల ద్వారా అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. తాను మోడరేటర్‌గా వ్యవహరించిన రెండేళ్లలో చేపట్టిన కార్యక్రమాలు సంతృప్తినిచ్చాయన్నారు. అనంతరం డెప్యూటీ మోడరేటర్ రైట్ రెవరెండ్ థామస్ కె.ఒమ్మెన్, జనరల్ సెక్రటరీ డానియేల్ రత్నాకర సదానంద, కోశాధికారి రాబర్ట్ బ్రౌన్‌లను ఘనంగా సత్కరించారు.
చర్చ్ ఆఫ్ నార్త్ ఇండియా మహా పీఠాధిపతి పీసీ మరాండి, జబల్‌పూర్ బిషప్ పీసీ సింగ్, జాప్నా బిషప్ డాని యేల్ త్యాగరాజ్, సైప్రస్ బిషప్ మైకేల్ లూయిస్, నేషనల్ చర్చెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రతినిధి తారానాథ్ సాగర్ ప్రసంగించారు. భక్తులు ఆలపించిన గీతాలు, సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక, తమిళనాడు నుంచి 20 మంది బిషప్‌లు, 200 మందికి పైగా ప్రతినిధులు, నగర ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వెలంపల్లి శ్రీనివాసరావు, వేలాది మంది భక్తులు హాజరయ్యారు.